మీరు తింటే నేను లొట్టలేస్తా!

Literature Bites - Sakshi

సాహిత్య మరమరాలు
ముళ్లపూడి వెంకటరమణ ఫోర్తు ఫారంలో ఉన్నప్పుడే కథలు రాశాడు. అప్పుడు చెన్నైలోని కేసరి స్కూల్లో చదువుతున్నాడు. ఉపాధ్యాయుడి సలహా మేరకు కథలను ఒక పుస్తకంగా కుట్టి, పాఠశాల ‘ఫౌండర్స్‌ డే’ రోజు కె.ఎన్‌.కేసరికి  అంకితమిచ్చాడు. కేసరి ఆయుర్వేద వైద్యంలో ప్రసిద్ధులు. గొప్ప సంపన్నుడు, గొప్ప దాత. పిల్లాడి తీరుకు ముచ్చటపడి తెల్లారి రమణను ఇంటికి పిలిపించాడు కేసరి.

రమణ, వాళ్లమ్మ ఇద్దరూ ‘కేసరి కుటీ’రానికి వెళ్లారు. రమణ వాళ్లమ్మ కేసరి వారి గృహలక్ష్మి ప్రెస్సులోనే పనిచేసేవారు. వెళ్లగానే కేసరి వీళ్ల ఆర్థిక పరిస్థితి వాకబు చేశారు. ఇంతలో బంట్రోతు జిలేబీ, మసాలాదోసెతో రెండు ప్లేట్లు వాళ్ల ముందు తెచ్చిపెట్టాడు. ‘తినండి’ అన్నారు కేసరి. ‘మరి మీరు’ అన్నట్టు వాళ్లు చూశారు.

‘‘అదేరా, నువ్వు పది దోసెలు తినగలవు– కాని ఒక్కటీ కొనలేవు. కాని నేను? వెయ్యి దోసెలు కొనగలను– కాని ఒక్కటీ తినలేను. నేనూ చిన్నప్పుడు నీలా బీదవాడినే. అప్పుడు డబ్బు లేనప్పుడు ఆకలి. ఇప్పుడు డబ్బొచ్చాక అజీర్ణం. తిండి అప్పుడూ లేదు ఇప్పుడూ లేదు. అదే గమ్మత్తు’’ అన్నారు కేసరి. రమణ, వాళ్లమ్మ అలాగే చూస్తూండిపోయారు. ‘‘తినండి తినండి. నేను లొట్టలేస్తాను’’ అని పక పక నవ్వారు కేసరి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top