వాష్‌ కరో.. షైన్‌ కరో..

Liquid Wash For Burkha Sisters New Creation Hyderabad - Sakshi

బుర్ఖాల కోసం ప్రత్యేక లిక్విడ్‌ వాష్‌...

సృష్టించిన అక్కాచెల్లెళ్లు

దేశంలోనే తొలి ఉత్పత్తిగా వెల్లడి

అన్ని వస్త్రాలూ ఒకలా ఉండవు. అలాగే అన్నింటికి ఒకే రకమైన వాషింగ్‌ ఉత్పత్తులూ పనికిరావు. ముఖ్యంగా ఖరీదైన ఫ్యాబ్రిక్స్‌ ఉపయోగించి రూపొందించే దుస్తుల కోసం మరింత జాగ్రత్తగా వాషింగ్‌ ఉత్పత్తులను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బుర్ఖాల కోసం నగరానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఓ వైవిధ్యభరితమైన వాషింగ్‌ లిక్విడ్‌ని రూపొందించారు.  

సాక్షి, సిటీబ్యూరో: ‘డార్క్‌ కలర్‌ బుర్ఖాలు, వెయిల్స్, స్టోల్స్‌... వంటివి కొంత కాలం తర్వాత రంగులను కోల్పోయి కళావిహీనంగా మారుతున్నట్టు మా కాలేజ్‌ డేస్‌లో స్వయంగానూ, స్నేహితుల అనుభవాల ద్వారా గుర్తించాం. అప్పుడే వాటికి సరైన క్లీనింగ్‌ డిటర్జెంట్‌ మార్కెట్లో లభించడం లేదని అర్థమైంది’ అంటూ చెప్పారు మసరత్‌ ఖాటూన్, మెహనూర్‌ ఖాటూన్‌. నగరానికి చెందిన ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు చదువు పూర్తయిన తర్వాత ఇదే అంశంపై  చేసిన మార్కెట్‌ స్టడీ కూడా ఈ విషయాన్నే నిర్ధారించడంతో... వాషింగ్‌ ఉత్పత్తుల రంగంలోకి ప్రవేశించాలనుకున్నారు. ఒక సమస్యకు పరిష్కారంతో మార్కెట్లోకి ప్రవేశించాలనుకున్న వీరికి అప్పటికే కెమిస్ట్‌ అయిన తండ్రి సహకారం కూడా తోడైంది. 

‘ఖరీదైన డిజైనర్‌ వేర్‌ గాఢమైన రసాయనాలతో తయారైన ఉత్పత్తుల వాడకం కారణంగా కాంతిహీనంగా మారుతున్నాయి. త్వరగా ఫేడ్‌ అవుతుండటంతో స్టోల్స్‌ తదితర వస్త్రాలను మహిళలు రెగ్యులర్‌గా వినియోగించలేకపోతున్నారు. బుర్ఖాకు వాడే క్లాత్‌ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. కెమికల్‌తో తయారైన లిక్విడ్‌ వినియోగిస్తే త్వరగా చిరిగిపోవడం, షేడ్‌ అవడం జరుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఈ వుర్ఖా వాష్‌ రూపొందించాం’ అని చెప్పారు. బేగంపేటలోని మ్యారీగోల్డ్‌ హోటల్‌లో బుధవారం దీనిని విడుదల చేసిన సందర్భంగా వీరు మాట్లాడుతూ... ప్రస్తుతం లిక్విడ్‌ రూపంలో విడుదల చేస్తున్నామని, త్వరలోనే బాటిల్స్‌ రూపంలోనూ అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ ఉత్పత్తికి సంబంధించి రిసెర్చ్, ప్రయోగాలన్నీ చండీఘడ్‌లో చేశామని, నగరంలో తయారీ జరుగుతోందన్నారు. బుర్ఖాలకు సంబంధించి అందుబాటులోకి వచ్చిన తొలి వినూత్న వాషింగ్‌ ఉత్పత్తిగా వీరు పేర్కొన్నారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top