బ్యూటిప్స్‌

Lemon juice Removes excess grease from the glands - Sakshi

నాచురల్‌ ఫేస్‌ మాస్క్‌
పది మిల్లీలీటర్ల తేనెలో ఒక కోడిగుడ్డు సొన, ఐదు గ్రాముల పాలపొడి కాని ఒక టేబుల్‌ స్పూన్‌ తాజా పాలు కాని తీసుకోవాలి. వీటన్నింటినీ ఒక పాత్రలో వేసి బాగా చిలికి ఆ మిశ్రమాన్ని ఫేషియల్‌ బ్రష్‌తో కళ్ల చుట్టూ, పెదవులను మినహాయించి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. కోడిగుడ్డుసొన చర్మానికి పోషణనిస్తుంది. తేనె చక్కని నిగారింపునిస్తుంది. ఈ ప్యాక్‌ వేయడం వల్ల చర్మం బాల్యపు సుకుమారాన్ని సంతరించుకుంటుంది. ఇది నాచురల్‌ స్కిన్‌కూ పొడిచర్మానికీ కూడా చక్కగా పని చేస్తుంది.ఆయిలీ స్కిన్‌ అయితే పది మిల్లీలీటర్ల తేనెలో ఒక కోడిగుడ్డులోని తెల్లసొన, ఐదు మిల్లీలీటర్ల నిమ్మరసం, ఐదు గ్రాముల ఈస్ట్‌ పౌడర్‌ లేదా పుల్లటి పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. నిమ్మరసం చర్మగ్రంథుల నుంచి విడుదలైన అదనపు జిడ్డును తొలగిస్తుంది. తెల్లసొన డీప్‌ క్లెన్సర్‌గా పని చేసి చర్మాన్ని బాగా శుభ్రపరుస్తుంది. వీటికి తేనె తెచ్చే నిగారింపు కలిసి ముఖం తాజాగా, కాంతివంతంగా మారుతుంది.

మెరిసే కేశాలకోసం..
తలస్నానం పూర్తయ్యాక చివరగా ఒక లీటరునీటిలో ఒక నిమ్మకాయను పిండి, రెండు టీ స్పూన్ల తేనె కలిపి జుట్టంతా తడిసేలా పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తల మీద పోసి కనీసం రెండు నిమిషాల సేపు అలాగే ఉంచిన తర్వాత చన్నీటిని పోసి శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల కేశాలు నిగనిగలాడతాయి.అరకప్పు తేనె తీసుకుని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు సమంగా పట్టించి జుట్టును ముడి చుట్టేసి క్యాప్‌ పెట్టేయాలి. అరగంట సేపు అలాగే ఉంచి తర్వాత షాంపూతో లేదా షీకాయలతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కేశాలు మెరుస్తూ, గాలికి అలల్లా ఎగిరిపడతాయి. జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉంటే అవసరాన్ని బట్టి తేనె మోతాదును పెంచుకోవచ్చు.తేనె, ఆలివ్‌ ఆయిల్‌ కాంబినేషన్‌ కేశాలను ఆరోగ్యంగా ఉంచి మెరుపులీనేటట్లు చేస్తుంది. పావు కప్పు తేనెలో అంతే మోతాదు ఆలివ్‌ ఆయిల్‌ కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇది డీప్‌ కండిషనర్‌గా పనిచేసి పోషణ లేక నిర్జీవంగా, పాలిపోయినట్లున్న జుట్టును అందంగా, ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా మారుస్తుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top