తన లైఫ్‌ని తనే కుట్టుకుంది

 Learning to dress up for three months - Sakshi

షబ్నమ్‌. వయసు 17. ఈ వయసు పిల్లలు అడిగినట్లు ‘నాన్నా! పండక్కి నాకు కొత్త బట్టలు కొనివ్వు, నాన్నా పది రూపాయలివ్వు జడ పిన్నులు కొనుక్కుంటాను’ అని అడగడంలేదీ అమ్మాయి. రివర్స్‌లో ఆ తండ్రే ‘నువ్వు నా కంటే ఎక్కువ సంపాదిస్తున్నావు బిడ్డా’ అని మురిసిపోతున్నాడు.

ఆ తండ్రి.. కూతుర్ని పెద్ద ముందుచూపుతో నడిపించిన దార్శనికుడేమీ కాదు. ‘ఆడపిల్లవు ఊరు దాటి మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకుంటావా, వద్దే వద్దు. ఊళ్లో బడిలో ఉన్నంత వరకు ఏడు తరగతులు చదివావు ఇక చాలు’ అనేశాడు ఐదేళ్ల కిందట. ఆడపిల్లకు వంట వండటం నేర్పించి పెళ్లి చేయడమే అమ్మానాన్నల బాధ్యత అన్నట్లు రెండేళ్ల కిందట ఓ పెళ్లి సంబంధం కూడా తెచ్చాడు. 

కూతురు తల వంచలేదు!
బడి మాన్పిస్తే చేసేదేమీ లేక ఊరుకుంది. కానీ పెళ్లి చేసి పంపించేస్తానంటే ఊరుకోనంటే ఊరుకోనని మొండికేసింది షబ్నమ్‌. ‘ఆడపిల్లలు 18 ఏళ్లకంటే ముందు పెళ్లి చేసుకోకూడదట’ అని కూడా వాదించింది. పిల్ల సంతోషంగా తల వంచితే తాళి కట్టించాలి తప్ప మెడలు వంచి కట్టించకూడదని షబ్నమ్‌ నానమ్మ నచ్చచెప్పడంతో ఆ ప్రయత్నం మానుకున్నాడా తండ్రి.కూతురికి లోకజ్ఞానాన్నంతా నూరిపోశాడని టైలరింగ్‌ టీచర్‌ను మాత్రం బాగానే తిట్టుకున్నాడు. 

తండ్రి తల ఎత్తుకున్నాడు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరైచ్‌ జిల్లా, రాయ్‌పూర్‌ షబ్నమ్‌ ఊరు. అక్కడ ఓ ఎన్జీవో నిర్వహించిన టైలరింగ్‌ సెంటర్‌లో మూడు నెలలపాటు దుస్తులు కుట్టడం నేర్చుకుంది. అదే ఆమె జీవితానికి పెద్ద  మలుపు అవుతుందని అప్పట్లో ఎవరూ అనుకోలేదు. కానీ ఇప్పుడామె నెలకు రెండు మూడు వేలు సంపాదిస్తోంది. రంజాన్, దసరా వంటి పండుగ సీజన్‌లలో నాలుగైదు వేలు సంపాదిస్తోంది. ఇంట్లో కొంత ఇచ్చి మిగిలిన డబ్బును బ్యాంకులో దాస్తోంది. ఆమె బ్యాంకు అకౌంట్‌లో డబ్బుని చూసి ఆ తండ్రి పుత్రికోత్సాహంతో ఇప్పుడు మురిసిపోతున్నాడు. 

రాయ్‌పూర్‌ ‘రోల్‌ మోడల్‌’!
షబ్నమ్‌ తాను టైలరింగ్‌ క్లాస్‌లో నేర్చుకున్న మోడల్స్‌ దగ్గర ఆగిపోలేదు. అదే బ్లవుజ్‌లు, లెహెంగాలు కుడుతూ ఉంటే ఈ రోజు ఇంతలా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ ఉండకపోయేది. ఆమె వాల్‌పోస్టర్‌ మీద హీరోయిన్‌ డ్రస్‌ చూస్తే అది ఏ ప్యాటర్న్‌ అయి ఉంటుందో ఊహించగలుగుతుంది. సినిమాకు వెళ్తే హీరోయిన్‌ వేసుకున్న డ్రస్‌లు మైండ్‌లో ప్రింట్‌ అయిపోతాయి. సినిమా నుంచి వచ్చాక వాటిని పేపర్‌ మీద గీసుకుంటుంది. అలా పెద్ద నోట్స్‌ తయారు చేసుకుంది. ఆ మోడల్స్‌ని రాయ్‌పూర్‌ వాసులకు అందుబాటులోకి తెచ్చింది. తండ్రి స్నేహితుని కూతురికి పెళ్లి డ్రస్‌ కుట్టిచ్చింది. ఆ పెళ్లిడ్రస్‌ షబ్నమ్‌ పనితీరుకు ఓ ప్రచారాస్త్రంగా మారింది. 

చదువుకుంటూ, నేర్పిస్తోంది
షబ్నమ్‌ సాధించిన మరో విజయం ఏమిటంటే.. ఏడవ తరగతి తర్వాత ‘చదువు కోసం మరొక ఊరికి పోవడమా... వీల్లేదంటే వీల్లేదు’ అన్న తండ్రిని ఒప్పించి కాలేజ్‌లో చేరడం. నాన్‌ఫార్మల్‌ ఎడ్యుకేషన్‌లో బ్రిడ్జి కోర్సు పూర్తి చేసి నిషార్‌ షరీఫ్‌ అహ్మద్‌ ఇంటర్‌ కాలేజ్‌లో చేరింది. తానింకా పెద్ద చదువులు చదువుతానంటున్న షబ్నమ్‌ టైలరింగ్‌ను కొనసాగిస్తూనే ఉంది. కొత్త మోడల్స్‌ నేర్పించమని వచ్చిన తోటి అమ్మాయిలకు మెళకువలు నేర్పిస్తోంది. 
– మంజీర

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top