మీ శక్తిని తెలుసుకోండి! | Know your power! | Sakshi
Sakshi News home page

మీ శక్తిని తెలుసుకోండి!

Mar 10 2014 12:09 AM | Updated on Sep 2 2017 4:31 AM

మీ శక్తిని తెలుసుకోండి!

మీ శక్తిని తెలుసుకోండి!

మీ దగ్గర ఓ కారు ఉందనుకోండి.

మీ దగ్గర ఓ కారు ఉందనుకోండి. అది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, విలాసవంతమైన కార్లలో ఒకటి. 10 సెకన్లలోపే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దాని ప్రత్యేకత. ఆ కారు విశేషాల గురించి ఇక చెప్పాల్సిన పనిలేదు. మెత్తటి తోలు సీట్లు, చల్లదనాన్నిచ్చే ఎయిర్ కండీషన్ వ్యవస్థ, సంగీతాన్ని ఆస్వాదించేందుకు స్టీరియో సౌండ్ సిస్టమ్, లోపల అదిరిపోయే అలంకరణ వంటివి ఉన్నాయి.

అంటే.. కార్ల ప్రేమికులు కోరుకునే అన్ని లక్షణాలు దానికి ఉన్నాయి. కానీ, ఒక చిన్న సమస్య ఉంది. మీ కారు బ్రేకులు జామ్ అయ్యాయి. యాక్సిలరేటర్‌ను కాలుతో ఎంత బలంగా తొక్కినా ముందుకు కదలడం లేదు. ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించడం లేదు. అప్పుడు మీరేమనుకుంటారు? ఇంతటి చెత్త కారు ఎక్కడా ఉండదని చిరాకు పడతారు. నిజమేనా? మనం కూడా ఆ కారు లాంటివాళ్లమే. ప్రపంచం కోరుకుంటున్న అన్ని లక్షణాలు మనలోనూ అంతర్గతంగా ఉన్నాయి. అనుకున్నది సాధించేందుకు కావాల్సిన అన్ని శక్తిసామర్థ్యాలు మనలో దాగి ఉన్నాయి. కాకపోతే మనపై మనకు నమ్మకం లేకపోవడంతోపాటు మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నాం. సాధించే శక్తి మనలో లేదనే అపోహ వల్ల జీవితంలో ఎదగలేకపోతున్నాం.
 
 బ్రేక్‌పై నుంచి కాలు తీసేయండి
 

మన కారు కదలక మిగిలిన కార్లు మనల్ని దాటుకొని ముందుకు దూసుకెళ్తుంటే మనకు అసహనం కలుగుతుంది. దేవుడికి మనపై దయ లేదని చింతిస్తాం. ఎక్కడ లేని నిరాశ ఆవహిస్తుంది. పనికిరాని మన కారును మార్చేయాలని నిర్ణయించుకుంటాం. కానీ, ఒక్కసారి బ్రేకుపై ఉన్న కాలును వెనక్కి తీసుకుంటే.. మన కారు, మన జీవితాలు నిస్సందేహంగా రేసు గుర్రాల్లా ముందుకు పరుగెత్తుతాయి.
 
 అపనమ్మకాలను వదిలించుకోండి

 మీ జీవితం అనుకున్న విధంగా ముందుకు సాగనప్పుడు, కెరీర్‌లో ఆశించిన ఎదుగుదల లేనప్పుడు.. ఇతరులను నిందించవద్దు. ‘నేను సాధించలేను, నావల్ల కాదు’ అనే అపనమ్మకాలను వదిలించుకోండి. మీ గురించి మీరు తక్కువగా అంచనా వేసుకోకండి. అప్పుడు మీ జీవితాల్లో వచ్చిన మార్పును చూసి మీరు ఆశ్చర్యపోతారు.
 
 అపజయం ఎదురైతే సాకులు చెప్పొద్దు

 

మనకు చాలా దూరంలో ఓ వ్యక్తి నివసించేవాడు. ఒకరోజు ఓ దేవత అతడి ఎదుట ప్రత్యక్షమైంది. నువ్వు కోరుకుంటున్న సంపద మొత్తం నీ ఇంటి పక్కనున్న తోటలోనే ఉంది. అక్కడ తవ్వితే బంగారం, వజ్రాలు, మణులు, మాణిక్యాలు లభిస్తాయి. అదంతా నీదే. ఆ నిధిని తవ్వి తెచ్చుకొని జీవితాంతం సుఖంగా జీవించు అని చెప్పింది. తోటలో ఓ తెల్లటి కుందేలు కూడా ఉందని, దాని గురించి ఆలోచిస్తే నిధి దక్కదని తెలిపింది.  ఆ వ్యక్తి తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు వెళ్లాడు. కానీ, నిధిని దక్కించుకోలేకపోయాడు. ఎందుకని అడిగితే.. కుందేలుపై నెపం వేశాడు. అది అడ్డుపడడం వల్లే సంపద పొందలేకపోయానని కుంటిసాకులు చెప్పాడు. తన ప్రయత్నంలో లోపం ఉందని మాత్రం అంగీకరించ లేదు.
 
 మిమ్మల్ని వెనక్కి లాగుతున్నదేంటి?
 నిర్దేశించుకున్న లక్ష్యాలు కొన్నిసార్లు చేతికి అందేంత దూరంలోనే ఉంటాయి. అయినా వాటిని అందుకోలేం. అప నమ్మకాలు మన శక్తిని మనం తెలుసుకోకుండా చేస్తాయి. మన వైఫల్యాలకు అర్థంపర్థం లేని కారణాలను చూపేందుకు ప్రయత్నిస్తాం. కుటుంబ నేపథ్యం, బాల్యం, సరైన విద్య లేకపోవడం, ప్రస్తుత ఆర్థిక స్థితి.. తదితర కారణాలు చెబుతాం. విజయం వైపు అడుగులేయకుండా మిమ్మల్ని వెనక్కి లాగుతున్న అంశాలేమిటో మొదట గుర్తించండి. దాన్ని మీ మనస్సు నుంచి శాశ్వతంగా తొలగించండి. బ్రేకుపై నుంచి కాలును వెనక్కి తీసుకుంటేనే కారు ముందుకు కదులుతుందని తెలుసుకోండి.                          
             
     -‘కెరీర్స్ 360’ సౌజన్యంతో
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement