పాపాయితో హైలెవల్‌ మీటింగ్‌కి

Kiran Bedi Allows Woman Officer Child In Official Meeting Puducherry - Sakshi

పుదుచ్చేరిలోని లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ఆఫీస్‌లో మంగళవారం అత్యవసర సమావేశం జరుగుతోంది. ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసినవారు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడి! వివిధ శాఖల కార్యదర్శులు ఈ హైలెవల్‌ మీటింగ్‌కి హాజరయ్యారు. వారిలో ఐటీ శాఖ నుంచి వచ్చిన ఓ మహిళా కార్యదర్శి కూడా ఉన్నారు. సమావేశం గంభీరంగా సాగుతోంది. అంతలో.. మీటింగ్‌ హాలు బయట నుంచి పసిబిడ్డ ఏడుపు! ఆ ఏడుపు వింటూ మహిళా కార్యదర్శి స్థిమితంగా ఉండలేకపోయారు. అది గమనించారు కిరణ్‌ బేడి. ‘ఏమైంది?’ అన్నట్లు ఆమె వైపు చూశారు. ‘‘బయట ఏడుస్తున్నది నా కూతురే. పది నెలలు. నేను కనిపించకపోతే ఏడ్చేస్తుంది. వాళ్ల అమ్మమ్మ దగ్గర కూర్చోబెట్టి వచ్చాను’’ అని చెప్పారు ఆ ఆఫీసర్‌. పసికందు ఏడుపు ఆపడం లేదు. ‘‘వెళ్లి పాపను తెచ్చుకోండి’’ అన్నారు కిరణ్‌ బేడీ.

ఆమె ముఖంలో సంతోషం. పరుగున వెళ్లి, పాపను ఎత్తుకుని తనతోపాటు లోపలికి తెచ్చుకుంది. ఆమె రాగానే మళ్లీ మీటింగ్‌ మొదలైంది. తల్లి ఒడిలో కూర్చొని ఉన్న పాప కూడా ఏడుపు మాని కిరణ్‌ బేడీ వైపే గంభీరంగా చూడ్డం మొదలు పెట్టింది. ఆ తల్లీ బిడ్డల ఫొటోను కిరణ్‌ బేడీ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘చైల్డ్‌ ఈజ్‌ హ్యాపీ’ అని కామెంట్‌ రాశారు. స్ట్రిక్ట్‌ ఆఫీసర్‌ అని కిరణ్‌బేడీకి పేరు. దేశంలోనే తొలి మహిళా ఐపీఎస్‌ అధికారి. కుటుంబ బాధ్యతల వల్ల మహిళలు ఉద్యోగాలను సరిగా చేయలేరు అనే మాటను కిరణ్‌ ఒప్పుకోరు. బిడ్డ ఏడుస్తుంటే పనిపై ధ్యాసపెట్టడం తల్లికి కష్టమే. బిడ్డ దగ్గర ఉంటే ఆ తల్లి ఇంకా బాగా పనిచేస్తుంది అంటారు ఆమె. ఇప్పుడీ ట్విట్టర్‌లో కూడా కిరణ్‌ బేడీ ‘చైల్డ్‌ ఈజ్‌ హ్యాపీ’ అన్నారు కానీ.. ‘మదర్‌ ఈజ్‌ హ్యాపీ’ అని అనలేదు. దానర్థం.. పిల్లల లాలన కూడా డ్యూటీలో భాగమేనని. పిల్లల బాధ్యతను సక్రమంగా నెరవేరిస్తే పిల్లలు సంతోషంగా ఉంటారు. వాళ్లసంతోషం తల్లిని సంతోషంగా ఉంచుతుంది. పనిలో తల్లి సామర్థ్యాన్ని పెంచుతుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top