
అబ్బా... ఆపుతారా ఇక మీ గోల!
‘రాజ్ కుమార్ గుప్తా థ్రిల్లర్ ఫిల్మ్ ‘సెక్షన్ 84’లో కరీనా కపూర్ నటించి ఉంటే...
‘రాజ్ కుమార్ గుప్తా థ్రిల్లర్ ఫిల్మ్ ‘సెక్షన్ 84’లో కరీనా కపూర్ నటించి ఉంటే... ఆమె కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడి ఉండేది’.
‘గ్లామర్ పాత్రలు చేయడం కంటే.. ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయడంలోనే కథానాయికల నటనాప్రతిభ బయటపడుతుంది. సెక్షన్ 84 సినిమా ద్వారా కరీనాకు అలాంటి ప్రాధాన్యత ఉన్న పాత్ర వెదుక్కుంటూ వస్తే... పారితోషికం కోసం కాదనడం ఏ మేరకు సబబు?’....
ఇలా మీడియాలో రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
‘సెక్షన్ 84’లో మానసిక సమస్యతో బాధపడే వేశ్య పాత్రలో కరీనా నటించి ఉంటే ఎంత పేరు వచ్చి ఉండేదోగానీ... సినిమా నుంచి ఆమె తప్పుకోవడానికి అసలైన కారణం ఏమిటి అనేదాని గురించి భిన్నాభిప్రాయాలు వినిపిస్తూనే ఉన్నాయి.
నిన్నటి వరకు వినిపించిందేమిటంటే, ‘భజ్‌రంగి భాయ్‌జాన్’ సక్సెస్‌ను ఊహించి తన పారితోషికాన్ని అమాంతం పెంచేయడం వల్ల నిర్మాతలు చేతులెత్తేసి ‘‘మీరు నటించకపోయినా ఫరవాలేదు’’ అన్నారని!
తాజాగా వినిపిస్తున్నదేమిటంటే, స్క్రిప్ట్ విషయంలో కరీనా అతి జోక్యం చేసుకోవడం వల్లే ఆమె సినిమా నుంచి తప్పుకోవాల్సివచ్చిందని. మొదట ఒకటి రెండు మార్పులకు దర్శకుడు ఓకే అన్నప్పటికీ... మార్పుల మీద మార్పులు చెప్పుకుంటూపోవడంతో విసుగెత్తిన డెరైక్టర్ రాజ్‌కుమార్ ‘స్కిప్ట్‌లో ఒక్క సీన్ కూడా మార్చేది లేదు’ అని ప్రకటించాడట. దీంతో బెబో అలిగి ‘సినిమా చేయనుగాక చేయను’ అందట. అంతేకాదు... ‘సెక్షన్ 84’ సినిమా గురించి ఎవరైనా అడిగితే చాలు...‘ఆపుతారా... మీ గోల’ అని మండిపడుతుందట!