హాలీవుడ్‌లో భారతీయ తేజం!


సినిమాల్లో అవకాశం రావడం అంటే మాటలు కాదు...ఇక  హాలీవుడ్ సినిమాలు సరేసరి. బాలీవుడ్ సూపర్‌స్టార్  అమితాబ్ బచ్చన్ అయినా ఏదైనా హాలీవుడ్ సినిమాలో చేయబోతున్నాడంటే అది అత్యంత ప్రముఖమైన వార్తగా నిలుస్తుంది.  ఈ  నేపథ్యంలో కరణ్‌బ్రార్ అనే ఒక టీనేజర్ హాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగొందుతున్నాడు. డిస్నీ, ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ వంటి సంస్థల సినిమాల్లో చేస్తున్నాడు. అమెరికన్ టీనేజ్ సినీస్టార్‌లతో సమానమైన గుర్తింపును తెచ్చుకొన్నాడు. పుట్టి పెరిగింది అమెరికాలోనే అయినా భారతీయ మూలాలు కలిగిన కరణ్ బ్రార్ గురించి...

 

 కరణ్ తల్లిదండ్రులు భారతీయులు.  చాలా సంవత్సరాల కిందట అమెరికాకు వలస వెళ్లారు. అక్కడే పుట్టి పెరిగిన కరణ్ హైపర్ యాక్టివ్. ఇతడిలోని చురుకుదనాన్ని చూసి తల్లిదండ్రులు  ఆశ్చర్యపోయేవారు. తమ పిల్లాడిలోని యాక్టివ్‌నెస్ యాక్టింగ్‌కు బాగా పనికొస్తుందని వారు భావించారు. అందుకే కరణ్‌ను ఆ దిశగా ప్రోత్సహించారు. నట శిక్షణ విషయంలో జరిగే వివిధ వర్క్‌షాప్‌లకు తీసుకెళ్లేవారు. అలా ఏడెనిమిదేళ్ల వయసు నుంచే కరణ్‌కు నటనతో పరిచయం ఏర్పడింది.

 

 అనుకోని అవకాశం...




 అమెరికాలో నివసించే ఒక భారతీయ బాలుడి అగచాట్ల నేపథ్యమే ‘డైరీ ఆఫ్ ఏ వింపీకిడ్’ సినిమా నేపథ్యం. ఇదే పేరుతో వచ్చిన ఒక నవలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందించారు.  సినిమాలో టైటిల్ రోల్ కోసం ఒక భారతీయ బాలుడి అన్వేషణలో ఉన్న దర్శకుడు థార్‌కు ‘కరణ్’ తగిలాడు. నటన మీద ఆసక్తి ఉన్న కరణ్‌ను తన సినిమాలో ప్రధానపాత్ర కోసం ఎంచుకొన్నాడు ఆ దర్శకుడు.

 

 తొలి సినిమా కోసం హోమ్ వర్క్...




 కథ ప్రకారం కరణ్ భారతీయ శైలిలో ఇంగ్లిష్‌ను మాట్లాడాల్సి ఉంటుంది. అయితే అమెరికాలో పుట్టి పెరిగిన కరణ్‌కు అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లిష్ అలవాటయింది. దీంతో తప్పనిసరిగా తన భాషను మార్చుకోవాల్సి వచ్చింది. ఒక శిక్షకుడిని పెట్టుకొని మరీ భారతీయ శైలిలో ఇంగ్లిష్ భాషను మాట్లాడటం ప్రాక్టీస్ చేశాడు కరణ్. కరణ్ కష్టం ఊరికే పోలేదు. 2010లో విడుదల అయిన ‘డైరీ ఆఫ్ ఏ వింపీకిడ్’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఒకటిన్నర కోటి డాలర్లతో రూపొందించిన ఈ సినిమా దాదాపు 12 కోట్ల డాలర్ల సొమ్మును వసూలు చేసింది. ఇందులో కరణ్ నటనకు ప్రశంసలు దక్కాయి. 2011లో వివిధ అవార్డుల విషయంలో కరణ్ నామినేట్ అయ్యాడు. యంగ్ ఆర్టిస్ట్ అవార్డును కూడా అందుకొన్నాడు.

 

 సీక్వెల్ మీద సీక్వెల్...




 కరణ్ తొలి సినిమా బాగా ఆడటంతో దీనికి సీక్వెల్స్ రూపొందాయి. ‘డైరీ ఆఫ్  ఏ వింపీకిడ్’కు 2011లో ఒక సీక్వెల్, 2012లో మరో సీక్వెల్ వచ్చాయి. ఈ సినిమాల్లో కథాంశం, పాత్రధారులు మారినా... కరణ్‌మాత్రం  ‘చిరాగ్ గుప్తా’ అనే తన ముఖ్యపాత్రను సొంతం చేసుకొన్నాడు. ఈ మూడు సినిమాలూ కలిసి కోట్ల డాలర్లను వసూలు చేశాయి. దీంతో కరణ్‌కు స్టార్‌హోదా వచ్చింది. ఇప్పుడు హాలీవుడ్‌లోని టీన్ ఆర్టిస్టుల్లో పద్నాలుగు సంవత్సరాల కరణ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వింపీకిడ్ సినిమా తర్వాత... ఈ యేడాదిలో కరణ్ సినిమాలు రెండు విడుదల అయ్యాయి. కొన్ని టెలివిజన్ ప్రోగ్రామ్స్‌లో కూడా నటిస్తున్నాడు. కరణ్ నటనను చూసి ‘‘ ఈ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది, హాలీవుడ్‌లో నటుడిగా ఉన్నతస్థాయికి చేరుతాడు’’ అని  సినీ పండితులు అంటున్నారు.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top