అమ్మకు భక్తితో...

kanaka durga Nine types of materials - Sakshi

సర్వమంగళ మాంగల్యే
శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబకే దేవీ
నారాయణీ నమోస్తుతే!!

అంటూ జగన్మాతను నవరాత్రులు భక్తిశ్రద్ధలతో కొలిచే
దసరా మొదలైంది.. రోజూ చేసే పూజలు సరే..
మరి నైవేద్యాల మాటో..? అవీ ఉండాల్సిందే కాబట్టి అన్నంతో చేసే
ఈ తొమ్మిది రకాల పదార్థాలను ఓసారి చూడండి..
మీకు అనువైన వాటిని చేసి నివేదించండి.

కేసరీ బాత్‌
కావల్సినవి: అన్నం – కప్పు, చక్కెర – ముప్పావుకప్పు, జీడిపప్పు, కిస్‌మిస్‌ పలుకులు – రెండూ కలిపి పావు కప్పు, నెయ్యి – అరకప్పు, యాలకులపొడి – చెంచా.
తయారీ: అడుగు మందంగా ఉన్న గిన్నెలో నెయ్యీ, నాలుగుకప్పుల నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. రెండు నిమిషాలయ్యాక అందులో కడిగిన బియ్యం వేసి కలిపి మూత పెట్టేయాలి. అన్నం ఉడికాక చక్కెర వేసి మధ్య మధ్య కలుపుతూ ఉండాలి. అది పూర్తిగా దగ్గరకు అయ్యాక యాలకులపొడీ, జీడిపప్పు, కిస్‌మిస్‌ పలుకులు వేసి ఓసారి కలిపి దింపేయాలి. కావాలనుకుంటే ఇందులో రంగు వేసుకోవచ్చు.

కదంబం
కావల్సినవి: బియ్యం – కప్పు, కందిపప్పు – కప్పు, చింతపండు రసం – పెద్ద చెంచా, బెండకాయ, క్యారెట్, చిలగడదుంప, బంగాళాదుంప, వంకాయ, క్యాప్సికం, బఠాణీ, తీపి గుమ్మడికాయ, చిక్కుడుకాయ ముక్కలు – అన్నీ కలిపి మూడున్నర కప్పులు, సాంబారుపొడి – పెద్ద చెంచా, ఉప్పు – తగినంత, నెయ్యి – రెండు స్పూన్లు, జీలకర్ర–చెంచా, కొత్తిమీర–కట్ట, కరివేపాకు రెబ్బలు– రెండు.
తయారీ: బియ్యంలో మూడుకప్పుల నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. నాలుగు కూతలు వచ్చాక దింపేయాలి. అదేవిధంగా కందిపప్పూ, కూరగాయ ముక్కల్ని విడివిడిగా ఉడికించుకుని తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి... నెయ్యి వేయాలి. అది కరిగాక జీలకర్రా, కరివేపాకు వేయించి ఉడికించి పెట్టుకున్న కూరగాయముక్కలు వేయాలి. తరవాత సాంబారుపొడీ, తగినంత ఉప్పూ, చింతపండు రసం వేయాలి. ఐదు నిమిషాలయ్యాక ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేసి కాసిని నీళ్లు పోసి ఒకసారి ఉడకనివ్వాలి. తరవాత అందులో అన్నం, కొత్తిమీర వేసి కలిపితే చాలు.

మిరియాల అన్నం
కావల్సినవి: అన్నం – కప్పు, నెయ్యి – మూడు చెంచాలు, జీలకర్ర – చెంచా, ఉప్పు – తగినంత, మిరియాలు – ఒకటిన్నర టేబుల్‌స్పూను, కరివేపాకు రెబ్బలు – నాలుగు, జీడిపప్పు–4.
తయారీ: పొయ్యిమీద బాణలి పెట్టి మిరియాలను వేయించి తీసుకోవాలి. తరవాత మెత్తగా పొడిలా చేసుకోవాలి. అదే బాణలిలో నెయ్యి వేసి జీలకర్రా, కరివేపాకు రెబ్బలూ, మిరియాలపొడి వేయాలి. తరవాత అందులో అన్నం, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి వేయించిన జీడిపప్పు వేసి దించేయాలి.

పాల పరమాన్నం
కావల్సినవి: బియ్యం – అరకప్పు, పాలు – రెండు కప్పులు, బెల్లం తరుగు – ఒకటిన్నర కప్పు, యాలకులపొడి – అరచెంచా, నెయ్యి – పావుకప్పు, జీడిపప్పు, కిస్‌మిస్‌ – రెండూ కలిపి పావుకప్పు.
తయారీ: పాలు ఓ గిన్నెలోకి తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి మరిగాక కడిగిన బియ్యం వేసి మంట తగ్గించాలి. అన్నం మెత్తగా అయ్యాక బెల్లం వేసి బాగా కలపాలి. అది దగ్గరకు అయ్యాక యాలకులపొడివేసి దింపేయాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక జీడిపప్పు, కిస్‌మిస్‌ వేసి వేయించి.. దీన్ని పరమాన్నంలో వేసి ఒకసారి కలపాలి.

కట్టు పొంగలి
కావల్సినవి: పెసరపప్పు – కప్పు, బియ్యం – రెండు కప్పులు, జీలకర్ర – టేబుల్‌స్పూను, మిరియాలు – రెండు చెంచాలు, జీడిపప్పు – అరకప్పు, ఉప్పు – తగినంత, నెయ్యి – పావుకప్పు.
తయారీ: పెసరపప్పూ, బియ్యాన్ని కలిపి కడిగి ఆరున్నర గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక జీలకర్రా, మిరియాలూ, జీడిపప్పు వేసి వేయించి దింపేయాలి. ఈ తాలింపును ఉప్పు కలిపిన పెసరపప్పు అన్నంలో వేసి కలపాలి.

పులిహోర
కావల్సినవి: అన్నం – కప్పు, నూనె – టేబుల్‌ స్పూను, పల్లీలు – టేబుల్‌ స్పూను, మినప్పప్పు, సెనగపప్పు – ఒకటిన్నర చెంచా చొప్పున, పచ్చిమిర్చి – మూడు, ఆవాలు – చెంచా, ఎండుమిర్చి – నాలుగు, కరివేపాకు రెబ్బలు – రెండు, పసుపు – అరచెంచా, ఉప్పు – తగినంత, చింతపండు గుజ్జు – ఒకటిన్నర టేబుల్‌స్పూను, బెల్లం ముక్క – చిన్నది.
తయారీ: అన్నాన్ని ఓ పళ్లెంలో పరిచి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక పల్లీలు వేయాలి. అవి కాస్త వేగుతున్నప్పుడు సెనగపప్పూ, మినప్పప్పూ, ఆవాలూ, ఎండుమిర్చి వేయాలి. ఈ తాలింపు వేగాక కరివేపాకూ, పచ్చిమిర్చి వేయాలి. నిమిషం తరవాత చింతపండు గుజ్జూ, పసుపూ, తగినంత ఉప్పూ, బెల్లంముక్క వేసి మంట తగ్గించాలి. చింతపండు ఉడికాక అన్నంలో ఈ పులుసు వేసి బాగా కలిపితే చాలు.

చక్కెర పొంగలి
కావల్సినవి: బియ్యం – కప్పు, పెసరపప్పు – అరకప్పు, బెల్లం – ఒకటింబావు కప్పు, నెయ్యి – అరకప్పు, కిస్‌మిస్, జీడిపప్పు – రెండూ కలిపి అరకప్పు, ఎండుకొబ్బరిముక్కలు – పావుకప్పు, యాలకులపొడి – అరచెంచా.
తయారీ: పొయ్యిమీద బాణలి పెట్టి పెసరపప్పును దోరగా వేయించి తీసుకోవాలి. అందులో కడిగిన బియ్యం వేసి నాలుగు కప్పుల నీళ్లు పోసి నాలుగు కూతలు వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి. ఇంతలో బెల్లంలో అరకప్పు నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. అది కరిగాక దింపేయాలి. ఇప్పుడు పొయ్యిమీద ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంచి.. అందులో కరిగిన బెల్లం పాకం కలిపి మంట తగ్గించాలి. మరో పొయ్యిమీద బాణలి పెట్టి.. సగం నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్, కొబ్బరిముక్కలు వేసి వేయించుకుని అన్నంలో వేయాలి. చివరగా యాలకులపొడీ, మిగిలిన నెయ్యి వేసి దగ్గరకు అయ్యేవరకూ ఉడకనిచ్చి దింపేయాలి.

కొబ్బరి అన్నం
కావల్సినవి: బియ్యం – కప్పు, కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పు, కొత్తిమీర – కట్ట, జీడిపప్పు – పది, ఎండుమిర్చి – మూడు, పచ్చిమిర్చి – నాలుగు, కరివేపాకు – రెండు రెబ్బలు, సెనగపప్పు – టేబుల్‌స్పూను, మినప్పప్పు – చెంచా, జీలకర్ర – చెంచా, ఆవాలు – అరచెంచా, నెయ్యి – టేబుల్‌స్పూను, నూనె – చెంచా, ఉప్పు – తగినంత.
తయారీ: బియ్యం కడిగి రెండు గ్లాసుల నీళ్లు పోసి పొడిపొడిగా వండి వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి... నెయ్యి, నూనె వేయాలి. నెయ్యి కరిగాక ఎండుమిర్చీ, సెనగపప్పూ, మినప్పప్పూ, జీలకర్రా, ఆవాలు, జీడిపప్పు వేసి వేయించాలి. అవి వేగాక నిలువుగా తరిగిన పచ్చిమిర్చీ, కరివేపాకు వేయాలి. రెండు నిమిషాలయ్యాక కొబ్బరితురుమూ, తగినంత ఉప్పు వేసి పచ్చివాసన పోయాక దింపేయాలి. దీన్ని అన్నంలో వేసి బాగా కలిపి కొత్తిమీర తరుగు వేయాలి.

దద్ధ్యోదనం
కావల్సినవి: అన్నం – కప్పు, పెరుగు – ఒకటిన్నర కప్పు, ఉప్పు – తగినంత, ఆవాలు – చెంచా, జీలకర్ర – చెంచా, కరివేపాకు – రెండు రెబ్బలు, అల్లం తరుగు – చెంచా, పచ్చిమిర్చి ముక్కలు – రెండు చెంచాలు, నెయ్యి – రెండు చెంచాలు, కొత్తిమీర – కట్ట.
తయారీ: అన్నాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని పెరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక ఆవాలూ, జీలకర్ర వేయాలి. అవి వేగాక కరివేపాకూ, పచ్చిమిర్చి ముక్కలూ, అల్లం తరుగు వేసి దింపేయాలి. ఈ తాలింపును పెరుగున్నంలో వేయాలి. తగినంత ఉప్పూ, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. కావాలనుకుంటే ఇందులో క్యారెట్‌ తురుము, దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top