మనోభావాల కలబోత

International Womens Day 2019 - Sakshi

వందకుపైగా ఏళ్ల నుంచి ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ డే నిర్వహించుకుంటున్నారు మహిళలు. తమను అదిమిపెట్టిన అడ్డంకిని ఛేదించి, విప్లవాత్మకమైన విజయానికి బాటలు వేసిన స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఉన్నారు అప్పటి నుంచి. అయినా సరే.. సమానత్వం కోసం ఇంకా గళమెత్తాల్సిన పరిస్థితే ఉంది. రాబోయే ఏడాది (2019, మార్చి 8) ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ డే థీమ్‌ ‘బ్యాలెన్స్‌ ఫర్‌ బెటర్‌’. లింగ వివక్ష లేని ప్రపంచం కోసం డ్రైవింగ్‌ ఫోర్స్‌గా పని చేయడానికి సాటి మహిళలను సంసిద్ధం చేయనుంది. ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ డే ప్రపంచానికి బాగా తెలిసిన మహిళల పోరాటం. ఇది మాత్రమే కాదు. మనకు పెద్దగా పరిచయం లేని మరెన్నో పోరాటాలు మహిళల కోసం జరుగుతున్నాయి, 2019లోనూ జరగబోతున్నాయి. 

 జూన్‌ నెలలో కెనడాలో ‘ఉమెన్‌ డెలివర్‌ 2019’ కాన్ఫరెన్స్‌ జరగనుంది. మహిళలు తమను తాము సంఘటిత పరుచుకోవడానికి నిర్వహించుకునే సదస్సుల్లో ప్రపంచంలోనే అత్యంత పెద్ద సదస్సు ఇది. స్త్రీ–పురుష సమానత్వం, ఆరోగ్య రక్షణ, బాలికలు, మహిళలు మానసికంగానూ శారీరకంగానూ, ఉల్లాసంగా ఉండే వాతావరణం కోసం పరితపించే మనసులు అక్కడ కొలువుదీరి ఆవేదనను పంచుకుంటాయి.

ఒకే రోజు వంద నగరాల్లో..!
‘ఉమెన్స్‌ మార్చ్‌ 2019’.. వచ్చే ఏడాది జనవరి19వ తేదీన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్‌ డీసీలో జరగనున్న కవాతు. ఇది అక్కడి మహిళలు చేస్తున్న మూడవ ఉమెన్స్‌ మార్చ్‌. 2017లో మొదలైన ఈ ఉద్యమం ఏటా కొనసాగుతోంది. ఆ మార్చ్‌కు మద్దతుగా ప్రపంచ వ్యాప్తంగా సుమారు వంద నగరాల్లో మహిళలు కవాతు నిర్వహిస్తాయి. లింకన్‌ మెమోరియల్‌ దగ్గర నిర్వహించే ర్యాలీలో మహిళల అవసరాలు, అవకాశాలు, హక్కులు ప్రధానాంశాలు
.

దిద్ది రాయించే సదస్సు
ఏప్రిల్‌లో మూడు రోజులపాటు న్యూయార్క్‌లో ‘ఉమెన్‌ ఇన్‌ ద వరల్డ్‌’ సదస్సు జరగనుంది. దశాబ్దకాలంగా నినదిస్తోంది ఈ ‘ఉమెన్‌ ఇన్‌ ద వరల్డ్‌’. ఈ సదస్సులో మహిళల హక్కుల కార్యకర్తలు, అభ్యుదయ వాదులు సమావేశమై అభిప్రాయాలు పంచుకుంటారు. మగవాళ్ల చేతుల్లో రూపుదిద్దుకున్న మహిళల జీవితాలను విశ్లేషిస్తూ, మహిళల జీవితాలకు ఆరోగ్యకరమైన రూపు తీసుకురావడానికి మేధోమధనం జరుగుతుంది. పితృస్వామ్య భావజాలంతో రూపుదిద్దుకున్న సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయం ఒక ఎత్తయితే, మహిళల గురించిన ఉదంతాలను వార్తాకథనాలుగా రాసేటప్పుడు సున్నితత్వాన్ని పాటించకపోవడం మరోఎత్తు. మీడియా ఉపయోగించే పదజాలం చాలాసార్లు అభ్యంతరకరంగా ఉంటోంది. వీటన్నింటి మీద తమ గళాన్ని వినిపించడానికి చేస్తున్న ఓ ప్రయత్నం ఇది.

ఐరాసలో సమాలోచన
మార్చిలో ఉమెన్స్‌ డే జరిగిన మూడు రోజులకు న్యూయార్క్‌లో మహిళల స్థితిగతుల మీద ఐక్యరాజ్య సమితిలో చర్చలు జరగనున్నాయి. ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న 63వ సదస్సు ఇది. ఈ ఏడాది థీమ్‌ ‘కమిషన్‌ ఆన్‌ ద స్టేటస్‌ ఆఫ్‌ ఉమెన్‌’. ఇందులో సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ఆ పెద్దవాళ్లు చర్చించే అంశం కొత్తదేమీ కాదు. ‘మహిళలకు సామాజిక రక్షణ వ్యవస్థ, సేవల రంగంలో విధులు నిర్వర్తించడానికి ఉన్న వెసులుబాటు, మహిళల భద్రత ఏర్పాట్లు, స్త్రీ– పురుష సమానత్వం, బాలికలు – మహిళల సాధికారత’ ఉంటాయి. కొంచెం అటుఇటుగా ఎన్నో ఏళ్లుగా మాట్లాడుతున్నదే. అయినా... ఇంకామాట్లాడాల్సిన అవసరం ఉన్న అంశమే.
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top