కలంకారీ భాగవతారిణి | Indian culture, the context of the study of the costume | Sakshi
Sakshi News home page

కలంకారీ భాగవతారిణి

Jun 25 2014 12:10 AM | Updated on Sep 2 2017 9:20 AM

కలంకారీ భాగవతారిణి

కలంకారీ భాగవతారిణి

చెన్నై పుట్టి పెరిగిన సంగీత తెలుగు కుటుంబానికి చెందిన వస్త్రవ్యాపారి రాజేశ్‌తో పెళ్లయ్యాక హైదరాబాద్ వచ్చారు.

ఈజిప్టు నుంచి పర్షియా మీదుగా భారతదేశానికి వచ్చిన చీర ఎప్పటికప్పుడు కొత్త సొబగులు అద్దుకుంటూనే అనేక మార్పులు చెందింది. అలాగే డిజైనర్ చీర తయారీ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా... అక్కడి వారి అభిరుచులకు తగ్గట్లుగా మారుతూ వచ్చింది. కానీ చీరను రూపుదిద్దే కలంకారులు మాత్రం స్థిమితంగా ఉండలేకపోయారు. ఇది ఇలాగే కొనసాగితే కలంకారీ కళ ఇక కనుమరుగైపోతుందనే తాను కలంకారీ మీదనే దృష్టి పెట్టానని, కాటన్‌కు బదులు క్రేప్, ఇతర ఫ్యాన్సీ మెటీరియల్ మీద కలంకారీ డిజైన్లను తీసుకురావడానికి నిపుణులతో కలిసి ప్రయోగాలు చేశానంటారు సంగీత.
 
 కొత్తొక వింత, పాతొక రోత అనే ధోరణి ఎప్పుడూ ఉండేదే. అయితే బంగారంలాంటి పాతదనానికి కొత్త రూపం తీసుకువస్తే ఎలా ఉంటుంది? ఉన్నత చదువులు, ఉద్యోగంలో పరుగుల మధ్య మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే పురాణాలను చదివే సమయం లేక వాటిని పక్కన పెట్టేసిన యువతలో పురాణాల పట్ల ఆసక్తి నెలకొనేలా చేస్తే..? ఎలా ఉంటుంది? అసలు ఈ ఆలోచనే బాగుంది క దూ. బాగుంటే మాత్రం అలా చేయడం సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమైనా చేసే వారెవరు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ఫ్యూజన్ చీరల డిజైనర్ సంగీత. ఇంతకీ ఆమె ఏం చేశారు? చీర లకూ, పురాణాలకూ సమన్వయం ఎలా చేశారు?
 
చెన్నైలో పుట్టి పెరిగిన సంగీత తెలుగు కుటుంబానికి చెందిన వస్త్రవ్యాపారి రాజేశ్‌తో పెళ్లయ్యాక హైదరాబాద్ వచ్చారు. అప్పటి నుంచి భర్త చేసే వస్త్ర వ్యాపారంపై దృష్టి పెట్టారామె. ఈ సందర్భంగా ఆమె భారతీయ సంస్కృతిలో ఒక భాగమైన చీరలో వచ్చిన మార్పులు, కలంకారీ విధానంలో రంగుల తయారీ వంటి అంశాలన్నింటినీ బాగా అధ్యయనం చేశారు. తాను కలంకారీ మీదనే ప్రయోగాలు చేయడానికి... దేశంలో కలంకారీని పోలిన మరో అద్దకం మరెక్కడా లేకపోవడమే కారణమంటూ ఇంకా ఇలా వివరిస్తారు. ‘‘పోచంపల్లిలో తయారయ్యే ఇకత్ డిజైన్లు ఒరిస్సాలో కూడా తయారవుతున్నాయి. అలాగే రకరకాల పట్టు వస్త్రాల తయారీ, ఇతర అద్దకం కళలు ఒకదానిని పోలినవే మరో చోట ఏదో ఒక రాష్ట్రంలో ఉన్నాయి. కానీ కలంకారీని పోలిన అద్దకం దేశంలో మరెక్కడా కనిపించదు. అందుకే దానిని అంతరించి పోనివ్వకుండా కాపాడేందుకు ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నం విజయవంతం కావడం వల్లే కలంకారీ నిపుణుల కుటుంబాల నుంచి కొత్తతరం కూడా ఈ వృత్తిని చేపట్టడానికి ముందుకొస్తోంది. ఇప్పుడు కలంకారీ చీరలు ఆన్‌లైన్ మార్కెట్ విధానంలో విదేశాలకు చేరుతున్నాయి’’ అంటూ తాను చేపట్టిన ప్రయత్నాన్ని వివరించారు సంగీత. దక్షిణాదిలో ఆదరణ పొందిన డిజైన్లను ఉత్తరాది చీరకట్టుకు అనుగుణంగా ముద్రించడం సంగీత చేస్తున్న మరో ప్రయత్నం. అలాగే  ఈ తరానికి పురాణాలను పరిచయం చేయడానికి దుస్తులనే మాధ్యమంగా ఎంచుకున్న సంగీత...భాగవతం వంటి పౌరాణిక గ్రంథాలను చీరల మీద ఆవిష్కరించడం ద్వారా భాగవతారిణిగా మారారు సంగీత. ‘‘మొదట భాగవతంలోని కృష్ణుడిని కాన్సెప్ట్‌గా తీసుకుని ఒక చీర తయారు చేయించాను. అందులో చీరకు అంచుగా అతికించిన ఈ అద్దకంలో అంతా కృష్ణుడే కనిపిస్తాడు. కానీ నిశితంగా గమనిస్తే ఏ రెండు కృష్ణుడి బొమ్మలూ ఒకలా ఉండవు. ఒక్కో బొమ్మ భాగవతంలోని ఒక్కో ఘట్టానికి ప్రతీకగా కనిపిస్తాయి’’ అంటూ తాను చేపట్టిన ఫ్యూజన్ డిజైనర్ చీరల ప్రయత్నాన్ని వివరించారు సంగీత.

భారతీయ సంస్కృతి, వస్త్రధారణ అంశంలో అధ్యయనం మొదలు పెట్టిన తర్వాత దానిని చీరల మీద ఆవిష్కరించడంలో భర్త రాజేశ్ ప్రోత్సాహం ఉందంటారామె. ఆమె కూతురు ఇంటర్‌లోనూ, కొడుకు హైస్కూల్ చదువులోనూ ఉన్నారు. ఒకపక్క  వ్యాపారం చేస్తూనే, మరోపక్క సాంస్కృతిక అధ్యయనం, బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు సంగీత.

 అదెలాగంటే... ఎర్లీ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన కోర్సులు చదివి ఉండడంతో మొదట కార్పొరేట్ స్కూళ్లలో ప్రీ స్కూల్ పాఠ్యప్రణాళిక సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకమైన పిల్లల (స్పెషల్ కిడ్స్) కోసం పుస్తకాలు రాస్తే సరిపోదు. ఆ పిల్లలను సాధారణ పిల్లల్లా తయారు చేయాలంటే శిక్షణ కూడా ప్రత్యేకంగానే ఉండాలని గ్రహించారు. అందుకే చదువులో వెనుకబడి ఉండే  విద్యార్థులకోసం తాను ప్రత్యేకంగా రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను ఉపాధ్యాయులకు అందజేస్తున్నారు. తాను ఫ్యాషన్ డిజైనర్‌గా వ్యాపారదృష్టితో పరుగులు తీస్తే... పిల్లలను, కుటుంబాన్ని మిస్ కావలసి వస్తుంది కాబట్టి అధ్యయనాలు, ప్రయోగాలన్నీ పిల్లలు స్కూలుకెళ్లిన తర్వాత మొదలై ఇంటికి వచ్చేలోపు పూర్తయేలా ప్రణాళిక వేసుకున్నారు. ఒకపక్క వ్యాపారం... మరోపక్క బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకు శిక్షణ, కుటుంబ బంధాలను కాపాడుకుంటూ బాధ్యతలు నిర్వహించడం... ఈ అన్ని కోణాలనూ సమర్థంగా నిర్వహిస్తున్నారు సంగీత. అన్నింటికంటే ముఖ్యంగా మన సంస్కృతిని ముందు తరాలకు పరిచయం చేయడానికి ఈ ‘కలంకారీ భాగవతారిణి’ పడుతున్న తపనను అందరూ అర్థం చేసుకున్నప్పుడే ఇటువంటి సంప్రదాయిక కళలు పదికాలాలపాటు పరిఢవిల్లుతాయి.
 
- వాకా మంజులారెడ్డి, ఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement