రుచిగా లేదనుకుంటే నష్టపోతాం

 If we do not taste it, we lose it - Sakshi

గుడ్‌ పుడ్‌

పాపం... దొండకాయను కాకి ముక్కుతో జత చేసేప్పుడు మనమిచ్చే ప్రాధాన్యం.. దాన్ని కూరగా పరిగణించినప్పుడు అంతగా ఇవ్వం. కానీ కాకి విషయంలో దాని అందం ఎంతో... తిండి విషయంలో దాంతో వచ్చే ఆరోగ్యమూ అంతే అంటున్నారు న్యూట్రిషనిస్టులు. అంతగా రుచించదంటూ దొండను ముట్టకపోతే మనమే అజ్ఞానకాకులం అవుతామంటున్నారు కాకలు దీరిన ఆహారనిపుణులు. దొండకాయతో మనకు సమకూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే. 

దొండకాయ ఒంట్లో విడుదలయ్యే చక్కెరను మెల్లగా విడుదలయ్యేలా చేస్తుంది. అందుకే ఇది డయాబెటిస్‌ రోగులకు మంచిది. క్రమం తప్పకుండా దొండకాయ తినేవారిలో చక్కెర పాళ్లు నియంత్రణలో ఉంటాయంటున్నారు ఆహార నిపుణులు. కొవ్వుగా మారే ప్రీ–అడిపోసైట్స్‌ అనే కణాలను దొండకాయ సమర్థంగా నివారిస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. దొండలో ఐరన్‌ పాళ్లు ఎక్కువ. అందుకే దీన్ని తీసుకోవడం వల్ల రక్తహీనత (అనీమియా) తగ్గుతుంది. ఐరన్‌ లేమి వల్ల వచ్చే నిస్సత్తువ కూడా మాయమవుతుంది.దొండ వల్ల కేంద్ర నాడీమండలం బలం పుంజుకుంటుంది. మెదడుకూ మంచిది. ఇది మూర్ఛ (ఎపిలెప్సీ), అలై్జమర్స్‌ వంటి వాటిని చాలావరకు నివారిస్తుంది. కార్పెల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌ అనే మణికట్టు నొప్పి కలిగించే జబ్బుకు దొండకాయ స్వాభావికమైన చికిత్సగా చాలామంది వైద్యులు పరిగణిస్తుంటారు. దొండలో ఫైబర్‌ పాళ్లు చాలా ఎక్కువ. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం చక్కగా ఉండటానికి  దొండకాయలోని ఈ పీచుపదార్థం బాగా తోడ్పడుతుంది. దొండకాయ మూత్రపిండాల్లో రాళ్లను సమర్థంగా నివారిస్తుంది. 

దొండకాయలో చాలా రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. అందులో క్యాల్షియమ్, మెగ్నీషియమ్, పొటాషియమ్, మ్యాంగనీస్, విటమిన్‌ బి కాంప్లెక్స్, విటమిన్‌ సి, విటమిన్‌ ఏ చాలా ముఖ్యమైనవి. అందుకే దొండకాయ తినేవారిలో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. దొండకాయలో సాపోనిన్, ఫ్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్స్‌ వంటివి పుష్కలంగా ఉండటం వల్ల అది ఎన్నో రకాల అలర్జీలను నివారిస్తుంది. దొండలో బలమైన యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల అది చాలా రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. దొండలోని పోషకాల వల్ల మన కండరాలు, టెండన్లు, లిగమెంట్లు బలంగా తయారవుతాయి. కండరాలు బలపడటానికి, కదలికలు చురుగ్గా ఉండటానికి దొండ బాగా తోడ్పడుతుంది. దొండలోని యాస్కార్బిక్‌ యాసిడ్‌ పాళ్ల వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడటంతో పాటు చర్మం మిలమిలలాడుతుంది. మేని నిగారింపు కోసం చాలా మంది దొండకాయ రసాన్ని సైతం ఉపయోగిస్తుంటారు. శరీరంలో ఎక్కడైనా ఇన్‌ఫ్లమేషన్‌ (వాపు, నొప్పి, మంట, ఎర్రబారడం) ఉన్నప్పుడు దాన్ని తగ్గించడానికి దొండ బాగా ఉపయోగపడుతుంది. దొండలో పొటాషియమ్‌ పాళ్లు ఎక్కువ. అందుకే హైబీపీ ఉన్నవారికి దొండ చాలా మంచిది. హైబీపీని నియంత్రణలో ఉంచడం ద్వారా అది గుండెజబ్బులనూ అరికడుతుంది.  చాలా కూరగాయలలాగే దొండకాయలోనూ నీటి పాళ్లు ఎక్కువ. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి దొండ బాగా తోడ్పడుతుంది. 
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top