లాక్‌డౌన్‌: స్మార్ట్‌ ఫోన్‌‌కు బానిసవుతున్నారా?

How To Stop Addiction To Mobile Phone - Sakshi

అసలే కరోనా లాక్‌డౌన్‌ కాలం.. ఆపై ఖాళీగా ఇంట్లో ఉండేవాళ్లం.. సెల్‌ఫోన్‌ లేకపోతే!.. ఆ ఊహే బాగోలేదంటారా. మీరు ఆ ఊహలో బ్రతుకుతుంటే మాత్రం మీ జీవితాన్ని మీ చేతులారా నాశనం చేసుకుంటున్నారని గ్రహించండి. ఈ కొన్ని రోజుల కాలాన్ని గడపటానికి మీరు సెల్‌ఫోన్‌ను ఆశ్రయించినట్లైతే లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తేసిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని గుర్తించండి. లాక్‌డౌన్‌ తర్వాత మీరు పనుల్లోకి వెళ్లిపోతారు. ఇన్ని రోజులు సెల్‌ఫోన్‌కు అతుక్కుపోయిన బుర్ర ఒక్కసారిగా పనిమీదకు మళ్లమంటే మొండికేస్తుంది. కుదరదని మంకు పట్టుపడుతుంది. పని మీద శ్రద్ధ పెట్టలేక, పని సమయంలో సెల్‌ఫోన్‌ వాడలేక ఒత్తిడికి లోనవుతారు. ( వైన్‌ షాపులు తెరవండి.. ఖజానా నింపుకోండి )

వ్యసనాన్ని చంపుకోలేక ఒక వేళ ఆఫీసులో కూడా ఫోన్‌ వాడుతూ కూర్చుంటే.. మీ నెత్తిన సెల్‌ఫోన్‌ పడ్డట్లే. సెల్‌ఫోన్‌ వ్యసనం మీ ఫ్యామిలీ లైఫ్‌పై, జాబ్‌ లైఫ్‌పై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతుంది.  ముఖ్యంగా నిద్రపోయేటప్పుడు సెల్‌ఫోన్‌ వాడటం వల్ల నిద్ర సంబంధింత సమస్యలు రావటమే కాకుండా నిద్రలేమితో దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది.

సెల్‌ఫోన్‌ వాడకాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి : 
సెల్‌ఫోన్‌ నుంచి మీ దృష్టిని మరల్చడానికి వేరే పనుల్లో బిజీగా ఉండటానికి ప్రయత్నించండి. మీ సమయాన్ని మొత్తం భాగాలుగా విభజించి ఒక్కో సమయంలో ఒక్కో పని చేస్తూ గడపండి. దీర్ఘకాలంలో ఫలితాలనిచ్చే అంశాలపై దృష్టి పెట్టండి. ఓ గంట పుస్తకం చదవటం, ఓ గంట ఇంటి పనులు చేయటం.. ఇలా సమయాన్ని మీ ఇంటి వాతావరణానికి తగ్గట్లు ఎంచుకోండి. దీంతో మీకు శారీరకంగానూ, మానసికంగానూ ఉపయోగపడుతుంది. ఒక్కో సారి అవసరం లేకపోయినా సెల్‌ఫోన్‌ను చేతుల్లోకి తీసుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు ఓ క్షణం ఆలోచించండి ‘‘ నేనెందుకు ఇప్పుడు సెల్‌ఫోన్‌ ముట్టుకున్నాను. ( ఆ విషయం మాకూ తెలుసు.. అదో వ్యూహం! )

నిజంగా దీంతో నాకు అవసరం ఉందా’’ అని. ఎక్కువ మంది స్మార్ట్‌ ఫోన్‌ యూజర్స్ కనీసం మూడు గంటల పాటు సెల్‌ఫోన్‌తో కాలం వెళ్లదీస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియా యాప్‌లకు వీలైనంత దూరంగా ఉండండి. అసలు అవసరం లేదనుకుంటే వాటిని డిలేట్‌ చేయటం మంచిది. ఇంట్లో ఉన్నపుడు వీలైనంత మీ సెల్‌ఫోన్‌ను దూరంగా ఉంచండి. నిద్రపోయే సమయంలో సెల్‌ఫోన్‌ను దరిచేరనీయకండి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top