జుట్టు ఎక్కువగా రాలుతుందా...?

How to Reduce Hair Fall - Sakshi

జుట్టు రాలడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా మారింది. వయస్సుతో పాటు ఆడ మగ తేడా లేకుండా జుట్టు రాలుతుంది. జుట్టు రాలడం అనే సమస్యతో కనీసం 80 శాతం మంది బాధపడుతున్నారు. రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం మామూలే. అయితే అంతకుమించి రాలుతుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.

జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు: 

  • జీన్స్, ఒత్తిడి, కాలుష్యం, పోషకాహారలోపం, నిద్రలేమి, చెడు అలవాట్లు.
  • వంశపారంపర్యంగా బట్టతల ఉంటే, హార్మోన్‌ తేడా జుట్టు రాలడాన్ని ఎక్కువ చేస్తుంది. అందువల్ల చిన్న వయసులోనే జుట్టు రాలడం మొదలవుతుంది. 
  • ఇక్కడ హార్మోన్‌ కరెక్షన్స్‌ చేయాలి.
  • ఒత్తిడి వల్ల తలపై చర్మానికి (స్కాల్ప్‌) అందవలసిన పోషకాలు అందకపోవడం వల్ల జుట్టు రాలిపోతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడం, పోషకాహారం ముఖ్యం.
  • కాలుష్యం వల్ల జుట్టు పొడిగా అవడం, పోషకాలు సరిగా అందకపోవడం, అవసరం లేని రసాయనాలు అడ్డుపడటం వల్ల జుట్టు రాలిపోతుంది. కాలుష్యం నుంచి కాపాడుకోవాలి. మంచి గాలి పీల్చడం, నార్మల్‌ వాటర్‌ తాగడం చేయాలి.
  • ప్రధానంగా తీసుకోవాల్సిన పోషకాలు:
  • విటమిన్‌ బి3, బి5, ఇలు తీసుకోవాలి. ఇవి చికెన్, ఫిష్, నట్స్, సోయా, ఆకుకూరల్లో లభ్యమవుతాయి.
  •  ఐరన్, జింక్‌  గుడ్డు సొనలో ఉంటాయి. 

కుంకుళ్లుతో కురులు ధృడం
ఆధునికత పెరిగే కొద్దీ ఆడంబరాలకు పోతూ అలవాటుగా వస్తున్న ఆరోగ్య విధానాలను మరిచిపోతున్నాం. స్నానానికి రసాయనాలతో కూడిన ఖరీదైన షాంపూలు, సబ్బులను వాడుతూ.. ప్రకృతి ప్రసాదించిన కుంకుడుకాయలు, శీకాకాయ, సున్నిపిండి వంటివి మరచిపోతున్నాం. ఉద్యోగాలు చేసేవారికి కుంకుడుకాయలు నలగగొట్టి నానబెట్టడానికి ఖాళీ సమయమే కరువైంది. వీటిని నలగగొట్టితే మార్బుల్, సిరామిక్‌ గచ్చులు పాడైపోతాయని కుంకుడు కాయల జోలికే వెళ్లడం లేదు. అందమైన సీసాలు, ఆకట్టుకునే ప్యాకింగ్‌ల్లో లభించే షాంపూల వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ సంప్రదాయ పద్దతుల్ని పాటిస్తే.. శిరోజాలకు కలిగే మేలు అంతా ఇంతాకాదు.

తలంటుకి కుంకుడుకాయలను వాడటమే మంచిది. దీనివల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటమే కాక పేలు, చుండ్రులాంటి సమస్యలు రావు. కుంకుడుకాయలను బాగా ఎండబెట్టి పొడిచేసుకుని నిల్వ చేయొచ్చు. దీనివల్ల తలస్నానం చేసిన ప్రతీసారీ కుంకుడుకాయలను కొట్టుకునే శ్రమ తప్పుతుంది. ఎండబెట్టిన కమలాతొక్కలు, నిమ్మతొక్కలు, మందారాకులు, మందారపూలు, మెంతులను పొడిచేసి కుంకుడు పొడిలో కలపవచ్చు. వీటన్నిటినీ కలిపిన పొడితో తలస్నానంచేస్తే వెంట్రుకలు త్వరగా నెరవవు. జుట్టు ఊడదు. మృదువుగా ఉంటాయి. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top