
హాలీవుడ్ మొదటి సైకో ఎనలిటికల్ థ్రిల్లర్
యూఎస్‌లోని ఆరిజానా రాష్ట్రంలో ఫీనిక్స్‌లో ఓ చిన్న ఉద్యోగం చేస్తున్న మేరియోన్ క్రేన్‌కు మధ్యతరగతి కుటుంబానికి ఉండే కష్టాలన్నీ ఉన్నాయి.
ట్రెండ్ సెట్ చేసిన థ్రిల్లర్
సినిమా / సైకో
యూఎస్‌లోని ఆరిజానా రాష్ట్రంలో ఫీనిక్స్‌లో ఓ చిన్న ఉద్యోగం చేస్తున్న మేరియోన్ క్రేన్‌కు మధ్యతరగతి కుటుంబానికి ఉండే కష్టాలన్నీ ఉన్నాయి. ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, మరో పక్క పెళ్లి చేసుకుందామని పోరుపెడుతున్న ప్రియుడు... ఇలా జీవితాన్ని మోస్తున్న మేరియన్‌కు బ్యాంక్‌లో డబ్బు జమ చేయమని పెద్ద మొత్తంలో ఇస్తాడు ఆమె పై అధికారి. అయితే అంత పెద్ద మొత్తంలో డబ్బు చూసేసరికి ఇక దీంతో తన కష్టాలు తీర్చేసుకోవాలని అక్కడి నుంచి పారిపోతుంది. అయినా ఎక్కడో మూల ఆమెను గిల్టీ ఫీలింగ్ వెంటాడుతూనే ఉంటుంది. పోలీసులు ఎక్కడ తనను పట్టుకుంటారోనన్న సందేహంతో పాత కారు మార్చేసి, కొత్త కారు కొంటుంది. అలా ప్రయాణిస్తున్న ఆమెకు వర్షం అడ్డంకిగా మారుతుంది. అర్ధరాత్రి... అసలే భోరున వర్షం... ఇక దారిలో ఉన్న మోటెల్‌లో బస చేస్తుంది. అప్పుడే ఆమె జీవితంలోకి మోటెల్ యజమాని నార్మన్ బేట్స్ ఎంటరవుతాడు. కానీ, నార్మన్ ఒక అమ్మాయికి తన మోటెల్‌లో రూమ్ ఇవ్వడం నార్మన్ తల్లి మిసెస్ బేట్స్‌కు అసలు నచ్చదు. ఈ క్రమంలోనే ఇద్దరికి గొడవ కూడా అవుతుంది. వీళ్లిద్దరి అరుపులు విని మేరియోన్ ఆశ్చర్యపోతుంది. నార్మన్ తనకు రూమ్ ఇచ్చాడనే కృతజ్ఞతాభావం మోరియోన్‌కు ఉంటుంది. అతనితో మాటలు కలుపుతుంది. నార్మన్ మాటలు ఆమెలో మార్పు తీసుకొస్తాయి. వెంటనే వెనక్కి వెళ్లిపోయి డబ్బు తిరిగిచ్చేయాలని నిర్ణయించుకుంటుంది.
తర్వాత ఆమె స్నానానికి వెళ్లిన మరుక్షణం నార్మన్ తల్లి చేతిలో హత్యకు గురవుతుంది. నిశ్శబ్దంగా ఉన్న రాత్రిని చీల్చుకుంటూ వచ్చిన మారియోన్ అరుపులు విని నార్మన్ ఉలిక్కిపడతాడు. అతను పరిగెత్తుకుంటూ వచ్చేసరికి మారియోన్ రక్తపు మడుగుల్లో పడి ఉంటుంది. తల్లి చంపిందని నిర్ధారించుకుంటాడు. అసలు హత్యే జరగలేదు... ఆమె మోటెల్‌కు రాలేదు అన్నట్లుగా సీన్ క్రియేట్ చేస్తాడు. ఆమె వేసుకొచ్చిన కారును ఓ చెరువులోకి తోసేసి ఆధారాలను నాశనం చేస్తాడు..
ఇది జరిగి చాలా రోజులైపోతుంది. మోరియోన్ జాడ తెలియకపోవడంతో ఆమె చెల్లి లైలా ప్రైవేట్ డిటెక్టివ్ అర్భోగోస్ట్‌ను సంప్రదిస్తుంది. తన అక్క జాడ తెలుసుకోమని కోరుతుంది. ఈ మిస్టరీలోని ఒక్కొక్క తీగ లాగుతూ చివరికి ఆ డిటెక్టివ్ మోటల్‌కు చేరుకుంటాడు. నార్మన్ బేట్స్ ప్రవర్తన అర్భోగోస్ట్‌లో సందేహాలు కలిగిస్తుంది. అతను తల్లి గురించి అడిగితే పొంతలేని సమాధానాలు చెప్పడంతో ఆమెను కలవడానికి ఇంటికి వెళతాడు. అతను ఇంట్లోకి అడుగుపెట్టి మెట్లు ఎక్కగానే నార్మన్ తల్లి బేట్స్ డిటెక్టివ్‌ను కూడా చంపేస్తుంది. డిటెక్టివ్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో లైలా, ఆమె ఫ్రెండ్ శామ్ రంగంలోకి దిగుతారు. ఈ ఇద్దరూ నార్మన్‌ను కలుస్తారు. అతన్నుంచి ఎలాంటి సమాచారం లభించదు. తల్లి గురించి అడిగితే కలవడానికి వీల్లేదని చెప్పడంతో లైలా అతని ఇంట్లోకి రహస్యంగా వెళుతుంది. పైకి వెళ్లాలనుకునే లోపు నార్మన్ ఇంటికి రావడంతో దాక్కోవడానికి అండర్‌గ్రౌండ్‌లోకి వెళుతుంది. అక్కడ రూమ్‌లో ఎదురుగా గోడవైపు తిరిగి ఉన్న మిసెస్ బేట్స్‌ను పిలుస్తూ దగ్గరికి వెళ్లి, కుర్చీని తిప్పగానే భయంకరమైన దృశ్యం. కుళ్లిపోయి, పురుగులు స్వైరవిహారం చేస్తున్న శవం... చూడగానే గట్టిగా అరుస్తుంది. ఆమె అరుపు విని తల్లి వేషంలో ఉన్న బేట్స్ చంపడానికి పరిగెత్తుకుంటూ వస్తూంటే వెనకాల నుంచి శామ్ అతన్ని నిలువరించి పోలీసులకు పట్టిస్తాడు.
హాలీవుడ్ మొదటి సైకో ఎనలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా షూటింగ్ 1959వ సంవత్సరం నవంబరు 11న మొదలై, 1960 ఫిబ్రవరిలో పూర్తయింది.
- బి.శశాంక్
చరిత్రకెక్కిన షవర్ సీన్
ఈ సినిమా కథాంశం ఎంత పాపులర్ అయిందో, షవర్ సీన్ అంతకు మించి హిట్ అయింది. కేవలం ఈ సీన్‌ను మాత్రమే చాలా సినిమాల్లో వాడుకున్నారంటే ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.ఈ షవర్ సీన్‌ను హిచ్‌కాక్ ఏడు రోజుల పాటు చిత్రీకరించారు. కథానాయిక జెన్నెట్ లీ మీద చిత్రీకరించిన ఈ భయానక సన్నివేశం అమెరికా సినిమాల్లో వయొలెంట్ కంటెంట్‌కు కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. కానీ, ఎక్కడా ఒళ్లు గగుర్పొడిచే వయొలెన్స్‌ను హిచ్‌కాక్ ఈ సినిమాలో చూపించలేదు. షవర్ సీన్‌తో సహా.ఇక ఈ సీన్‌ను తెర మీద చూసుకున్న కథానాయిక జెన్నిఫర్ స్నానానికి వెళ్లే ముందు తలుపులన్నీ లాక్ చేసుకుని వెళ్లేదాన్నని ఓ ఇంటర్వ్యూలో చెప్పారంటే, తెర మీద హిచ్‌కాక్ ఈ సన్నివేశాన్ని ఎంత బాగా పండించారో ఊహించుకోవచ్చు.
‘సైకో’ నవల ఆధారంగా ఈ సినిమా తీసిన హిచ్‌కాక్ తన చిత్రబృందంతో మార్కెట్‌లో ఉన్న అన్ని కాపీలను కొనుగోలు చేయించి, సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు.ఈ సినిమాకు విచిత్రమైన ప్రచారం చేశాడు హిచ్‌కాక్. ఒక్కసారి షో స్టార్ట్ అయ్యాక లేట్‌గా వచ్చేవాళ్లను థియేటర్ లోనికి రానివ్వకూడదని థియేటర్ యజమానులకు హుకుం జారీ చేశాడు. దానికి కారణం... సినిమా మొదట్లో చచ్చిపోయే మ్యారియోన్ క్యారెక్టర్ గురించి తెలియకపోతే సినిమాలో కిక్ ఏముంటుందని?ఒకసారి జనాలు థియేటర్ బయట నించుని ఉంటే వర్షం అకస్మాత్తుగా మొదలైంది. ఓ థియేటర్ యజమాని హిచ్‌కాక్‌ను ఈ విషయం గురించి అడిగితే- ‘‘అందరికీ గొడుగులు ఇచ్చి అందర్నీ ఫొటోలు తీసి పేపర్‌కు ఇవ్వండి. ఇంతకు మించిన పబ్లిసిటీ ఏముంటుంది’’ అని బదులిచ్చాడట.