
అమెరికా, తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో ‘మీ టూ’ ఉద్యమం రూపంలో కొన్ని నెలల క్రితం ఈ అంశం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. మహిళలపై.. పనిచేసే ప్రదేశాల్లో ఉన్నత స్థానాల్లోని వ్యక్తులు వివిధ రూపాల్లో వేధింపులకు పాల్పడుతున్న విషయం ఈ ఉద్యమం ద్వారా ఒక్కసారిగా పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చింది. అయితే అంతర్జాతీయంగా పేరొందిన స్వచ్ఛంద సేవాసంస్థల ఉన్నత స్థానాల్లోని వ్యక్తులు కూడా ఈ జాడ్యానికి, అనైతిక కార్యకలాపాలకు అతీతులు కాదన్నది తాజాగా బయటపడింది.
ఐరాసకూ తప్పని మరక
రాజకీయ, మతపరమైన హింస పెచ్చరిల్లి సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న వివిధ దేశాల్లో బాధిత ప్రజలకు సహాయాన్ని అందిస్తున్న ఐరాస సైతం లైంగిక ఆరోపణల పర్వంలో చిక్కుకుంది! అనుచిత వ్యవహారశైలి కారణంగా ఐరాస పిల్లల సంస్థ.. యూనిసెఫ్ డిప్యూటీ డైరెక్టర్ జస్టిన్ ఫోర్సిత్ ఇటీవలే రాజీనామా చేశారు. 2011–15 మధ్యకాలంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసినపుడు ఫోర్సిత్ ప్రవర్తనపై యూకే ‘సేవ్ ది చిల్డ్రన్’ అభ్యంతరాల నేపథ్యంలో ఇది జరిగింది. ఐరాస నిర్వహించే విస్తృత కార్యాకలాపాల్లో గతేడాది చివరి మూడు నెలల్లోనే 40 లైంగిక దోపిడి, వేధింపుల ఆరోపణలపై ఫిర్యాదులు నమోదయ్యాయి. ఐరాస శాంతి పరిరక్షక దళాలపై 15, ఏజెన్సీలు, నిధులు, కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన వాటిపై 17, భాగస్వామ్య సంస్థలపై 8 ఆరోపణలు వచ్చాయి. మొత్తం 54 మంది బాధితుల్లో 30 మంది మహిళలు, 16 మంది యువతులు ఉన్నారని, మిగతా 8 మంది వయసెంతో వెల్లడి కాలేదని యూఎన్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ వెల్లడించారు. ఇక బురుండికు చెందిన 25 మంది, గబన్‌కు 16 మంది శాంతి పరిరక్షక సైనికులు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గతంలోనే ఐరాస అంతర్గత విచారణలో బయటపడింది.
ఆక్స్‌ఫామ్ ఉక్కిరి బిక్కిరి
హైతీలో 2010లో సంభవించిన భూకంపం కారణంగా తీవ్ర నష్టం వాటిల్లడంతో అక్కడ బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ కమిటీ ఫర్ ఫెమైన్ రిలీఫ్ (ఆక్స్‌ఫామ్ సంస్థ) పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టింది.ఈ సంస్థ సిబ్బంది తమ విధుల నిర్వహణ సందర్భంగా అక్కడి వేశ్యల సేవలను ఉపయోగించుకున్నట్టు గత నెల 9న టైమ్స్ పతాక శీర్షిక కథనాన్ని ప్రచురించింది. వీరిలో తక్కువ వయసు ఉన్న అమ్మాయిలు కూడా ఉన్నారని, దీనిని ఈ సంస్ధ సీనియర్ అధికారులు కప్పిపుచ్చే ప్రయత్నాలు చేశారంటూ పేర్కొంది. హైతీలో డైరెక్టర్ ఆక్స్‌ఫామ్ కార్యకలాపాలు నిర్వహించిన రోలాండ్ వాన్ హ్యువర్‌మిరిన్ కూడా ఈ సిబ్బందిలో ఉన్నట్టు తేలింది. 2011లో దీనిపై ఆరోపణలు రాగానే అంతర్గత విచారణ చేపట్టి రోలాండ్ స్వచ్ఛందంగా వైదొలిగే అవకాశంతో పాటు, మరో నలుగురిని తొలగించినట్టు ఆ సంస్థ తెలిపింది. ఈ ఉదంతం తీవ్ర అలజడికి దారితీయడంతో ఆస్ట్రేలియా, తదితర దేశాల నుంచి కొందరు వ్యక్తులు, సంస్థలు ఆక్స్‌ఫామ్‌కు విరాళాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. – కె.రాహుల్, సాక్షి నాలెడ్జ్ సెంటర్