
సుచీ లీక్స్‌తో కోలీవుడ్‌లో వైరలైన వివాదాస్పద సింగర్ సుచిత్ర. గతంలో ఆమె పలువురు స్టార్స్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసి కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. అంతేకాకుండా తన మాజీ భర్త కార్తీక్ గే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ విషయం తెలిసిన తర్వాతే ఆయనతో విడాకులు తీసుకున్నానని ఆమె బాంబ్ పేల్చింది. ఈ వివాదంలోకి హీరో ధనుష్‌ను కూడా లాగింది. పూటుగా మద్యం సేవించి హీరో ధనుష్, కార్తీక్ ఒకే గదిలో ఉండేవారని తెలిపింది. అప్పట్లో ఆమె వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.
తాజాగా సింగర్ సుచిత్ర మరోసారి వార్తల్లో నిలిచింది. తనకు కాబోయే భర్త షణ్ముగరాజ్ మోసం చేశాడంటూ ఆరోపించింది. అంతేకాకుండా తన ఇంటితో పాటు డబ్బులను లాక్కున్నాడని వీడియోను రిలీజ్ చేసింది. అతనితో తనకు నిశ్చితార్థం అయిందని.. ఆ తర్వాత అతని చేతిలో తీవ్రమైన గృహ హింసకు అనుభవించానని సుచిత్ర ఆవేదన వ్యక్తం చేసింది. షణ్ముగరాజ్ పెద్ద మోసగాడని.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపింది.
గతంలో తనను చెన్నై నుంచి వెళ్లగొట్టారని సింగర్ సుచిత్ర పోస్ట్ చేసింది. అందుకే ముంబైకి వెళ్లి ఉద్యోగం దొరికిన తర్వాత అక్కడే స్థిరపడినట్లు తెలిపింది. సుచీ లీక్స్ వివాదం తర్వాత.. నా జీవితంలో ఇంతకంటే దారుణమైన పరిస్థితులు రావని అనుకున్నా.. కానీ మళ్లీ నా లైఫ్‌లో అదే జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. నేను 48 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో పడ్డాను.. నా జీవితంలో ఎప్పుడూ జరగకూడదనుకున్నవన్నీ జరిగాయని బాధను వ్యక్తం చేసింది. ఈ వయసులో గృహ హింసను ఎదుర్కొంటానని కలలో కూడా ఊహించలేదన్నారు. అతను ఒక రెజ్లర్ లాగా కొట్టేవాడని.. నన్ను బూట్లతో తన్నేవాడని.. ఒక రోజంతా ఏడుస్తూ మూలన కూర్చున్నేదాన్ని అని వాపోయింది.
అతను తన మొదటి భార్య కారణంగా ఇలా ప్రవర్తిస్తున్నాడని అందరూ అనేవారని సింగర్ తెలిపింది. కానీ అతను విడాకులు తీసుకోలేదని నాకు తరువాత తెలిసిందని.. ఈ విషయంలో తనతో అబద్ధం చెప్పాడని వెల్లడించింది. ఒక రోజు అతని మొదటి భార్య వచ్చి అతన్ని విడిచి పెట్టాలని నన్ను వేడుకుందని వీడియోలో మాట్లాడింది. నేను నిజంగా ప్రేమలో పడడం వల్లే డబ్బులు ఇచ్చానని.. లేకపోతే ఒక్క రూపాయి కూడా ఇచ్చేదాన్నికాదని.. నా ప్రతి పైసా తిరిగి చెల్లించే వరకు పోరాడతానని అంటోంది సుచిత్ర. మరో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో అతని ఫోటో, ఆధార్ కార్డుతో సహా వివరాలను పోస్ట్ చేసింది.