‘దాటుడు’ గుర్రాలు

Gollapudi Maruthi Rao Article On Politics - Sakshi

జీవన కాలమ్‌

జీవితంలో కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో మన అభిప్రాయాలు మారుతాయి. ఈ మధ్య రిటైరయిపోయిన ఓ ‘పాత’ రాజకీయ నాయకుడిని కలిశాను. ఆయన తొలి రోజుల్లో గాంధీగారి ఉద్యమంలో పాల్గొని, ఖద్దరు కట్టి, కొన్నాళ్లు సబర్మతి ఆశ్రమంలో ఉండి వచ్చినవాడు. ‘‘ఇప్పుడేం చేస్తున్నారు?’’ అన్నాను. ‘‘ఏమీ లేదండీ. అబ్బాయి షాపులో కూర్చుంటున్నాను’’ అన్నాడు. ‘‘మరి మీరు మొన్నటి దాకా పని చేసిన గాంధీగారి సాహచర్యం?’’

‘‘ఆ పోకడ నాకు నచ్చలేదండీ’’ అంటూ ఆ విషయం మీద చర్చించడానికి విముఖత చాపాడు. గట్టిగా వత్తిడి చేస్తే అప్పుడు చెప్పాడు. గాంధీగారి జాతీయ భావాలకు ఒక దశలో ఊగిన మాట నిజమే. కానీ ఆయన దరిమిలాను ‘స్వాతంత్య్ర’ ఉద్యమాన్ని ‘మతం’తో కలపడం ఈయనకి నచ్చలేదు. ఒక పార్టీ విశ్వాసాల మీద నిజమైన ‘కమిట్‌ మెంట్‌’ ఉన్న ఓ వ్యక్తి స్పందన ఇది. న్యాయం. కానీ తమ వ్యక్తిగత ప్రయోజనాలకు పదేపదే పాత పార్టీని అటకెక్కించేసి కొత్త పార్టీలో దూకే ‘అవకాశవాదులు’ కోకొల్లలు. వీరి దర్శన భాగ్యం ప్రతి రోజూ కలిగే అపూర్వమైన దినాలివి. మరి పార్టీ సిద్ధాంతాలు? విశ్వాసాలు? నాన్సెన్స్‌! ఎవడిక్కావాలి? పదవులో, డబ్బో.. లేక రెండూనో సంపాదించుకునే అవకాశం కావాలి. అందుకు తన వృత్తి లాయకీ కావాలి. అవును. ఇది ‘సేవ’ కాదు. ‘వృత్తి’. గట్టిగా మాట్లాడితే వ్యాపారం.ఉన్నట్టుండి మన రాష్ట్రంలో కాంగ్రెసు మూలబడ్డాక.. పార్టీలో ఉన్నవారూ, పదవుల్లో ఉన్నవారూ ఎలా చొక్కాలు మార్చారో ప్రజలకు తెలుసు.

వీరిప్పుడు మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ పాత చొక్కాల ‘కంపు’ గుర్తుకొస్తుంది. ఇప్పుడు? ఉన్నట్టుండి జయప్రద పార్టీ మార్చారు. తనకి టిక్కెట్టు ఇవ్వలేదని శతృఘ్న సిన్హా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మూలమూలల్లో ఉన్న సినీ తారల్ని ఏరి మరీ పార్టీ టిక్కెట్లు యిస్తున్నారు.. వీరిలో మిగిలిన ఏ మాత్రం ‘పాపులారిటీ’ గుజ్జునయినా రాబట్టుకోడానికి. ఉత్తరప్రదేశ్‌లో శ్యాం వరణ్‌ గుప్తా ఎస్‌.పి. నుంచి బీజేపీకి మారారు. చత్తీస్‌గఢ్‌లో గిరిరాజ్‌ సింగ్‌ బీజేపీలో చేరారు. రాకేష్‌ జీ సచిన్‌ కాంగ్రెసులోకి మారారు. అలాగే ఎస్‌.పి. హరీష్‌ ద్వివేదీ బీజేపీకి వచ్చారు. రెయిస్‌ జహాన్‌ బీఎస్పీ నుంచి కాంగ్రెసుకి దూకారు. బీఎస్పీ నుంచి ముకుల్‌ ఉపాధ్యాయ బీజేపీకి వచ్చారు. ఈ ‘దూకుడు’ ఎంత అర్జంటుగా, హాస్యాస్పదంగా ఉన్నదంటే ఆంధ్రాలో టీడీపీ నామా నాగేశ్వరరావుగారు టీఆర్‌ఎస్‌లోకి దూకారు. తీరా మరునాడు ఎన్నికల మీటింగులో దూకిన పార్టీ సింబ ల్‌కి బహిరంగంగా మారిపోయారు. ఇది కేవలం నమూనా ఉదాహరణలు. వీటికి కోట్ల పెట్టుబడి ఉంటుందని, అదవా చేరిన పార్టీ టిక్కెట్లు దక్కే అవకాశం ఉంటుందని పెద్దలు చెబుతారు.

ఇలాంటి దుర్గంధ వాతావరణంలో కూడా కాస్త ‘ఆక్సిజన్‌’ని వ్యాపింపజేసే వ్యక్తులుంటారు. 40 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న సుష్మా స్వరాజ్, ఉమా భారతి పోటీ నుంచి స్వచ్ఛందంగా శలవు తీసుకున్నారు. ఈ దేశంలో బీజేపీలో 75 సంవత్సరాలు పైబడిన వారిని పోటీలో నిలపరాదని నిర్ణయిం చింది. అందుకు ఆ పెద్దలు అంగీకరించారు. ఈసారి పోటీలో ఎల్‌.కె.అద్వానీ, కల్‌ రాజ్‌ మిశ్రా, ఎమ్‌.ఎమ్‌.జోషీ, శాంతకుమార్, బి.సి.ఖండూరీ పోటీ చెయ్యడం లేదు. ఒకాయన చేయాలనుకున్నారు–మురళీ మనోహర్‌ జోషీ, ఎంత పెద్దవాడు! పోటీలో నిలిస్తే ఓటర్‌ హారతినిచ్చి ఆహ్వానిస్తాడు కదా? ఆ విషయం తెలిసిన పార్టీ గడుసుగా ఒక సీటుని గెలుచుకోవచ్చు కదా? కానీ పార్టీ ఆయన పోటీ చెయ్యడం లేదని చెప్పింది. ఆయన ఆ విషయాన్ని చెప్పి మానుకున్నారు. ఇదేమిటి? న్యాయంగా ఇప్పటి లెక్కల ప్రకారం ఈయన మరో పార్టీ తలుపు తట్టాలికదా? వీరంతా అన్నారు కదా –తమ పార్టీ ముందు కాలంలో పెద్దల అనుభవాన్ని ఎలా వినియోగించుకోవాలో నిర్ణయించుకుంటుందని. ఈ మధ్యలో ఎక్కడ చూశాం ఇలాంటి పెద్దరికాన్ని! ఇలాంటి ఉదాత్తత రాజకీయాల్లో ఎక్కడిది?

ఆ మధ్య కర్ణాటకలో ఒక సీనియర్‌ నాయకులు అనంత్‌ కుమార్‌ కన్నుమూశారు. న్యాయంగా వారు కన్నుమూసిన విషాదానికి వారి సతీమణిని ఆ స్థానంలో నిలిపి వోటర్‌ సానుభూతిని పార్టీ రాబట్టుకోవడం సబబు. కానీ పార్టీ తేజస్వీ సూర్య అనే యువకుడిని ఎంపిక చేసింది. న్యాయంగా అనంత్‌ కుమార్‌ భార్య తేజస్విని ఎదురు తిరగాలి కదా? అర్జంటుగా మరొక పార్టీలో చేరాలి కదా? పార్టీ పెద్దల్ని దుయ్యపట్టాలి కదా? కానీ ఆవిడ అపూర్వమయిన సంయమనంతో ‘‘నాకు పార్టీ శ్రేయస్సు ముఖ్యం. సమాజ శ్రేయస్సు ముఖ్యం. ఏం చేయాలో, ఎలా చేయాలో పెద్దలు నిర్ణయిస్తారు’’ అన్నారు. ఈ మురుగు నీటి చెలమలకు దగ్గరగా.. యింకా మంచినీటి సెలలున్నాయని నిరూపించే ఓ పార్టీకి పెద్దరికాన్నీ, ఉద్ధతినీ, గాంభీర్యాన్నీ, Objectivityనీ సంతరించే యిలాంటి కొందరు నిజమైన ‘కార్యకర్తల’ ఉనికి దేశానికీ, ప్రజలకీ–ఈ సమాజానికీ కాస్త ‘ఊపిరి’ని ఇవ్వగలదని నాలాంటివారి ఆశ.

గొల్లపూడి మారుతీరావు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top