‘నేనూ చౌకీదార్‌నే!’

Gollapudi Maruthi Rao Article On Narendra Modi - Sakshi

జీవన కాలమ్‌

పేదరికం పెద్ద ఉపద్రవం. పెద్ద ఊబి. అభిమానధనుడి ఆత్మాశ్రయం. నిస్సహా యుడి గుండెలో అగ్నిప ర్వతం. దాటి ముందుకు సాగాలని ప్రయత్నించే చెలి యలికట్ట. దాటలేని ఒక్క కారణానికే గంభీరమైన వారధి. ఆ ఒక్క కారణానికే ముట్టుకుంటే జివ్వుమనే రాచపుండు. మొట్టమొదట– అయిదేళ్ల కిందట ఈ తేనె తుట్టని కదిపింది మణిశంకర్‌ అయ్యర్‌. మోదీ పూర్వా శ్రమంలో నిద్రాణమైన జీవన సత్యాన్ని లేపి వెక్కిరిం చిన ఘనత ఆ ప్రముఖ రాజకీయ నాయకుడిది. అంతే. మిన్ను విరిగి మీద పడింది. 2014 ఎన్నికలకు పెద్ద ఉద్యమానికి ఆ ‘వెక్కిరింత’ నాంది పలికింది. ‘ఛాయ్‌వాలాతో ముఖాముఖీ’, ‘ఛాయ్‌వాలాతో పిచ్చాపాటీ’ ఛాయ్‌వాలా పురోగతి, ఏ విధంగానూ సిగ్గుపడనక్కరలేని ఓ నాయకుని గతం విశ్వరూపం దాల్చింది. ఇది ఊహించని మలుపు.

ఈ కథలో నీతి. ఎప్పుడూ నిద్రపోతున్న ‘పేద రికం’ జూలుని సవరించకు. అది సిగ్గుపడే విషయం కాదు. చేజేతులా పూనుకున్న అవినీతి కాదు. ఆ ‘నిజం’ కోట్లాదిమంది జనసందోహం మధ్య పదే పదే ప్రతిధ్వనించింది.ఇప్పుడు రాహుల్‌ గాంధీ గారు నిద్రపోతున్న సింహం జూలును మరో విధంగా సవరించారు. ‘రెచ్చగొట్టారు’ అనే మాటకి నిస్సహాయమైన ప్రత్యా మ్నాయాన్ని వాడుతున్నాను. రకరకాల చర్యలను ప్రశ్నిస్తూ ‘అయ్యా చౌకీదార్‌ గారూ! ఇప్పటికయినా తమరు కళ్లు తెరిచారా? 9 వేల కోట్ల విజయ్‌ మాల్యా అవినీతి మిమ్మల్ని నిద్ర లేపిందా? హఠాత్తుగా ఇంగ్లండులో ప్రత్యక్షమయిన నీరవ్‌గారి కథ చౌకీదార్‌ని ఎలా పలకరించింది. మా ఆస్తులకు చౌకీదార్‌నని గర్వంగా చెప్పుకున్న తమరు ఇప్పుడేమంటారు?’ ఇలాంటి విసుర్లు మనం రాహుల్‌ గాంధీ గారి సభల్లో వింటున్నాం. ప్రతీసారి ‘మన అధోగతికి జవాబుదారీ ఈ చౌకీదార్‌’ అన్న స్పృహని రాహుల్‌ గాంధీగారు విడిచిపెట్టలేదు.

అంతేకాదు. అనిల్‌ అంబానీ, నీరవ్‌ మోదీ, విజయ్‌ మాల్యాల మధ్య ముల్లె భుజానికెత్తుకు నిలిచిన మోదీ కార్టూన్‌ కింద రాహుల్‌ గాంధీ పలకరింత. ‘ఇప్పటికయినా నేరం కాస్త గుచ్చుకుం టోందా చౌకీదార్‌ జీ!’ అంటూ.ఇప్పుడు కాంగ్రెస్‌ ట్విట్టర్‌లో నరేంద్ర మోదీ ‘చౌకీదార్‌ దొంగ’. అంతే. రాత్రికి రాత్రి బీజేపీ ట్విట్టర్లు కొత్తరూపుని సంతరించుకున్నాయి. నరేంద్ర మోదీ అన్నారు: మీ దృష్టిలో చౌకీదార్‌ దొంగ. కానీ ఈ దేశంలో అవినీతికి తిరగబడే ప్రతీ వ్యక్తీ చౌకీదారే. ఇప్పుడు నరేంద్ర మోదీ ట్విట్టర్‌ పేరు ‘చౌకీదార్‌ నరేంద్ర మోదీ’. అలాగే చౌకీదార్‌ అమిత్‌ షా, చౌకీ దార్‌ నరేష్‌ గోయెల్‌– ఇలా అవతరించాయి. దేశ మంతా ‘నేనూ చౌకీదార్‌నే’ అనే ప్రతిజ్ఞ చేయాలని నరేంద్ర మోదీ తన ట్విట్టర్‌లో 3 నిమిషాల సందేశాన్నుంచారు. ఇది కార్చిచ్చులా దేశాన్ని ఊపి ఉర్రూతలూగించనుంది. నిన్న ఏదో చానల్‌లో బొంబాయి వంతెన కూలిన సంఘటనలో అవినీతిని ప్రశ్నిస్తూ– ‘ఈ దేశంలో మీరూ ఒక చౌకీదార్‌. నేనూ ఒక చౌకీదార్‌ని. ప్రధానే కానక్కర లేదు’ అని బల్లగుద్దారు. నేను నిర్ఘాంతపోయాను– ఒక నినా దం, ఒక ఆలోచన ఇంత సూటిగా, ఇంత బలంగా, మించి ఇంత త్వరగా ప్రజల్లోకి దూసుకు పోగలి గినందుకు.

దానికి కారణం ఏమిటి? ఒక్కటే సమాధానం– ఆ నినాదంలో ప్రాథమికమయిన నిజాయితీ.ఎదుటి వ్యక్తి విమర్శని ఆశీర్వాదం చేసుకుని, వెక్కిరింతని ‘ఆయుధాన్ని’ చేసుకుని దేశానికి కొత్త నినాదాన్ని ఇవ్వడం భారతీయ జనతా పార్టీకి ఇది రెండోసారి.మొదటిది ‘చాయ్‌వాలా’ విమర్శ. ఏమిటి ఇందులో రహస్యం? పక్కవాడి విమర్శలో ‘దమ్ము’ చాలనప్పుడు, వెక్కిరింతలో సామంజస్యం కాక, తేలికతనం ఎక్కువగా ద్యోతకమయినప్పుడు విమర్శ ఆయుధమవుతుంది. కొండొకచో అవకాశమూ అవుతుంది.కాగా, వ్యక్తిని చేసే విమర్శ వ్యవస్థకి ఆశీ ర్వాదాన్ని చేసుకోవడం ఎప్పుడు సాధ్యం? ఆ విమర్శలో బలం చాలనప్పుడు, అందులో నిజాయితీ కంటే ‘అక్కసు’ పాలు ఎక్కువగా ఉన్నప్పుడు. ఈ మధ్య వాట్సాప్‌లో ఓ పెద్ద మనిషి అతి మర్యాదగా నన్ను మందలించబోయాడు. ఆయన సందేశం తాత్పర్యం. ‘పెద్దాయనా! మోదీ భజన చాలు. నిజానిజాలు గ్రహించండి’ అని.

ప్రయత్నిస్తున్నాను. అయిదేళ్లకిందట మోదీ ఎవరో నాకు తెలీదు. కానీ ప్రతిపక్షం చేసే ఎత్తి పోతలకూ ఓ మార్గాంతరం కనిపించి, తిట్టుని దీవెన చేసుకోగల సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ దేశమంతా ప్రతి ఫలించింది. ఇది ప్రయత్నించినా సాధించలేని కార్యాచరణ.ఈ వృత్తికి 59 ఏళ్లు పాతవాడిని. నా మాటల్లో నిజాయితీ చాలనప్పుడు– ఒక్క ‘పెద్దమనిషి’ కాదు, పెద్ద జంఝామారుతం నాలాంటి చాలా గొంతుల్ని నొక్కేస్తుంది.
మహాత్ముడి గొంతు వినమని ఎవరు బతి మాలారు? అన్నా హజారే గొంతు ఎవరు విన మన్నారు? ఆనాడు కేజ్రీవాల్‌ని రెండుసార్లు నిరా ఘాటంగా ఎవరు ఎన్నుకోమన్నారు?
గొల్లపూడి మారుతీరావు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top