'షీ'ఈఓ

Global Entrepreneur Summit 2017 - Sakshi - Sakshi - Sakshi

అబ్బాయి చదువుకుంటే తను బాగుపడతాడు అమ్మాయి చదువుకుంటే ఊరు బాగుపడుతుంది మరి అమ్మాయిలే షీఈవోలు అయితే... అంటే... సంస్థలకు అధిపతులైతే... భలే కనిపెట్టేశారు... అమ్మాయిలు సీఈవోలైతే ప్రపంచం బాగుపడుతుంది. గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌ సమ్మిట్‌ ఈ ఏడాది అంశం... మహిళలు ముందు... అంటే... మహిళలదే ముందడుగు.

ఈజీఎస్‌... గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌.. ప్రపంచమంతా..ఈ హడావిడి ఎక్కువగానే ఉంది. కారణాలు రెండు! ఒకటి.. హైదరాబాద్‌లో జరగడం. రెండు.. విమెన్‌ ఫస్ట్‌.. ప్రాస్పరిటీ ఫర్‌ ఆల్‌.. అనే నినాదాన్ని లోకమంతటికీ వినిపించబోతోంది ఈ సమ్మిట్‌. ఇప్పటి వరకు ఏడు జీఈఎస్‌ సమ్మిట్స్‌ జరిగాయి. ఏ సమ్మిట్‌ మహిళావాణిజ్య,వ్యాపారవేత్తల ప్రాతినిధ్యానికి వేదిక కాలేదు. ఈ 28న జరగబోతున్న ఎమిదో జీఈఎస్‌ మాత్రమే మహిళలకు పెద్ద పీటవేయనుంది.

స్త్రీ చదువుకోవడానికి అసలు బయటకే రావడానికి ఒప్పుకోని అఫ్గానిస్తాన్, మహిళల మీద విపరీతమైన ఆంక్షలున్న సౌదీఅరేబియాతోపాటు ఇంకో పది దేశాల  నుంచి కేవలం మహిళా వాణిజ్య వ్యాపారవేత్తలే ఈ జీఈఎస్‌కు రావడం ఆసక్తికలిగిస్తున్న విషయం. ఇలా సామాజిక, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటూ వాణిజ్యవ్యాపార రంగాల్లో ఆడవాళ్లూ రాణించగలరని ఈ జీఈఎస్‌ డయాస్‌ మీద తమ గొంతు వినిపిస్తున్న కొందరు విమెన్‌ ఎంట్రప్రెన్యూ ర్స్‌ గురించి చిన్న పరిచయం...

రోయా మెహబూబ్‌ (అఫ్గానిస్తాన్‌),
సీఈఓ, ప్రెడెంట్‌ ఆఫ్‌ డిజిటల్‌ సిటిజన్‌ ఫండ్‌...
రోయా మెహబూబ్‌  టెక్‌ ఫీమెల్‌ సీసీఓ ఆఫ్‌ అఫ్గానిస్తాన్‌.  ఆమె పుట్టింది, పెరిగింది, చదువుకుంది అంతా అఫ్గానిస్తాన్‌లోనే. ‘‘నాకు  స్కూల్‌కి వెళ్లి చదువుకునే అవకాశం దొరికింది(అఫ్గానిస్తాన్‌లోని పరిస్థితుల దృష్ట్యా).  చిన్నప్పటి నుంచీ టెక్నాలజీ మీద ఆసక్తి ఎక్కవ. అందుకే యూనివర్శిటీలో ఉన్నప్పుడు ఐటీ ప్రాజెక్ట్స్‌ మీదే దృష్టిపెట్టేదాన్ని. దాంతో మా యూనివర్సిటీలో నన్ను ఐటీ డైరెక్టర్‌ను చేశారు. దీన్ని నా మొదటి విజయంగా చెప్పొచ్చు. రెండో విజయం.. కాబూల్‌లో అందింది. అక్కడ మినిస్ట్రీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లోని ఐటీ డిపార్ట్‌మెంట్‌కి ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌గా చేశాను.

ఆ తర్వాత నా చెల్లెలు (ఇలాహ్‌ మెహబూబ్‌)తో కలిసి నా ఫస్ట్‌ కంపెనీ ‘‘అఫ్గాన్‌ సిటడెల్‌ సాఫ్ట్‌వేర్‌’’ను పెట్టాను. కాని నా వయసు అంటే అప్పటికి ఇంకా ఇరవయ్యేళ్లు కూడా లేవు. యూనివర్శిటీలో ఉన్నప్పుడే అన్నమాట. అందుకే వయసు, అనుభవం, టెక్నాలజీ మీద పట్టు, రిసోర్స్‌ కొరత వగైరాలన్నిటి వల్ల ఆ కంపెనీ అంతగా సక్సెస్‌ కాలేదు. ఆ తర్వాత హార్ట్‌ ఇన్‌క్యుబేటర్‌లో చేరాను. ఎంతో నేర్చుకున్నాను. అదిచ్చిన ఆత్మవిశ్వాసంతోనే 2010లో ‘‘డిజిటల్‌ సిటిజన్‌ ఫండ్‌’ను స్టార్ట్‌ చేశాం. టెక్నాలజీ ఇండస్ట్రీలో మహిళలూ విజయం సాధించగలరని చూపించడానికే ఈ కంపెనీ పెట్టా. అందుకే మా కంపెనీలో విమెన్‌ ప్రోగ్రామర్స్, విమెన్‌ బ్లాగర్స్‌కే ఫస్ట్‌ ప్రయారిటీ. చదువు, టెక్నాలజీ.. మహిళల జీవితాల్లో ఎలాంటి మార్పును తీసుకొస్తాయో అనడానికి నేనే ఉదాహరణ.

ఇలాంటి మార్పే మాలాంటి దేశాల్లోని మహిళల్లోనూ చూడాలనుకుంటున్నాను. సంస్కృతీ, సంప్రదాయాల అడ్డంకకులను దాటి చదువుకున్నాను. సామాజిక పోరాటం చేసి ఒక టెక్‌ కంపెనీకి సీఈఓ అయ్యాను. లోన్స్, ఫండ్స్‌ ఏవి కావాలన్నా మగవాళ్లకు దొరికినట్టు నాకు దొరకలేదు. ఆ పరిమితులతోనే నా కంపెనీని ముందుకు నడిపించాలనుకున్నాను, నడిపించాను, నడిపిస్తున్నాను కూడా. మహిళలు సమాన హోదా పొందాలంటే చదువొక్కటే మార్గం. సాంకేతికంగా కూడా వాళ్లు విద్యావంతులు కావాలి. మనకున్న అడ్డంకులను ఛేదించి అవకాశాల ప్రపంచాన్ని చూపిస్తుంది. కొత్త విజయాలకు దారినిస్తుంది’’ అని చెప్తారు రోయా మెహబూబ్‌.

సిబోంజిల్‌ సాంబో (సౌత్‌ ఆఫ్రికా)
మేనేజింగ్‌ డైరెక్టర్, ఎస్‌ఆర్‌ఎస్‌ ఏవియేషన్‌ అండ్‌ ఎస్‌ఆర్‌ఎస్‌ పెట్రోలియం...
32 ఏళ్ల సిబోంజిల్‌ జీవితం విజయాల పంట. అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మార్కెటింగ్‌లో సర్టిఫికేషన్‌ కోర్స్, మైనింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రిపరేషన్‌ ప్రోగ్రామ్‌ ఎట్‌సెట్రా... ఎట్‌సెట్రా ఎన్నో చదువులు...సొంత ఏవియేషన్, పెట్రోలియం కంపెనీలు.. ఇవన్నీ చూస్తుంటే ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద అచీవ్‌మెంట్‌ ఎలా సాధ్యమైందబ్బా అని అనిపిస్తుంది. లక్ష్యం, చక్కటి ప్రణాళిక.. మొక్కవోని దీక్ష ఉంటే సాధ్యకానిదేం లేదు అంటుంది  సిబోంజిల్‌. 

ఆమె స్థాపించిన ఎస్‌ఆర్‌ఎస్‌ ఏవియేషన్‌... సౌత్‌ ఆఫ్రికాలోనే మొట్టమొదటి బ్లాక్‌ విమెన్‌ స్థాపించిన ఏవియేషన్‌. అక్కడితో ఆగలేదు. పెట్రోలియం బిజినెస్‌లోనూ తన సత్తా చూపించింది. ఎస్‌ఆర్‌ఎస్‌ పెట్రోలియం సంస్థను ప్రారంభించింది. ఆ తర్వాత ఎస్‌ఆర్‌ఎస్‌ టెక్నికల్‌ కంపెనీని స్థాపించింది. సొంత వ్యాపారం స్థాపించే ముందు టెల్‌కామ్, సిటీ పవర్, డీ బీర్స్‌లో పనిచేసింది. 2006లో బీఎఫ్‌ఏ వాళ్ల  రీజినల్‌ బిజినెస్‌ విమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డ్‌ అందుకున్నారు.

మొదటి స్థానం మహిళలకు ఇస్తే.. అందరికీ సంపద అంది.. ఆర్థిక స్వావలంబనను సాధిస్తారనడానికి వీళ్లే నిదర్శనం. సంప్రదాయ, సామాజిక కట్టుబాట్లను ఎదిరించి.. వ్యాపారంలో ఉన్న పురుషాధిపత్యాన్నీ తట్టుకొని.. మగవాళ్లకు మాత్రమే సొంతమైన వ్యాపారంలో సైతం అడుగుపెట్టి.. తమ నిర్వహణాసామర్థ్యాన్ని నిరూపించుకున్నారు ఈ మహిళలు. ఇదే స్ఫూర్తిని రేపు జీఈఎస్‌ స్టేజ్‌ మీద నుంచి గ్లోబ్‌ అంతా పంచబోతున్నారు! జయహో స్త్రీ శక్తి!

లెటిషియా గాస్కా (మెక్సికో),
‘‘ఫెయిల్యూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ’’ కో ఫౌండర్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌...
లెటిషియా పుట్టింది మెక్సికోలో. ప్రస్తుతం ఉంటున్నది అర్జెంటీనాలో. బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ మార్కెటింగ్‌ డిగ్రీ చదువుతున్నప్పుడే ఓ స్టార్టప్‌ స్టార్ట్‌ చేసింది. ఎంత ఉత్సాహంతో అది మొదలైందో అంతే నిరుత్సాహంతో ముగిసింది. అయితే ఆ ఫెయిల్యూర్‌ను అలా వదిలేయదల్చుకోలేదు. దాంతో వైఫల్యాన్ని ఎలా డీల్‌ చేయొచ్చో అధ్యయనం చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఎందరినో కలవడం, మాట్లాడ్డం, ఇంటర్వ్యూలు చేయడంతో ఆమెకు ఒక కొత్త ఐడియా మెరిసింది. అలా వచ్చిందే ‘‘ఫెయిల్యూర్‌ ఇన్‌స్టిట్యూట్‌’’.

ఈ ఆర్గనైజేషన్‌ పెట్టడంతో తన ఫెయిల్యూర్‌నూ సక్సెస్‌ దిశగా డీల్‌ చేసి తన కేస్‌ స్టడీని నమోదు చేసుకుంది లెటిషియా. ‘‘ గో అండ్‌ లర్న్‌ ఫ్రమ్‌ ఫెయిల్యూర్‌’’ అనే నినాదంతో ఈ ఇన్‌స్టిట్యూట్‌ను ముందు ఫకప్‌నైట్స్‌గా స్టార్ట్‌చేసింది లెటిషియా. ఇప్పుడు ఇదొక మూవ్‌మెంట్‌. 200 దేశాలకు వ్యాపించింది. ఫకప్‌నైట్స్‌ అని ఉచ్చరించడానికి ఇబ్బంది పడేవాళ్లు ఫెయిల్యూర్‌ ఇన్‌స్టిట్యూట్‌గా పలుకుతున్నారు. ‘‘ నేను ఈ ఇన్‌స్టిట్యూట్‌ స్టార్ట్‌ చేయడానికి ముందు చాలా ఉద్యోగాలు చేశాను. జర్నలిస్ట్‌గా కూడా వర్క్‌ చేశాను.

ఏం చేసినా.. నా పని ఇది కాదు అనిపించేది. ఈ ఇన్‌స్టిట్యూట్‌ పెట్టాకే నాకు జాబ్‌ శాటిస్‌ఫ్యాక్షన్‌ దొరికింది. అందరూ విజయాల గురించే మాట్లాడ్తారు. ఇన్‌స్పిరేషన్‌గా విజయాలనే చూపిస్తారు. కాని ఫెయిల్యూర్స్‌ కూడా ఉంటాయని, అవి సర్వసాధారణమని, వాటి నుంచి స్ఫూర్తి పొంది విజయాలు సాధించొచ్చని ఎవరూ చెప్పరు. నేను కలిసిన మనుషులు, చేసిన ఇంటర్వ్యూల్లో చాలా మంది బిజినెస్‌కు సంబంధించిన ఫెయిల్యూర్స్‌ ఉన్నవాళ్లే. నాది కూడా బిజినెస్‌ ఫెయిల్యూరే. అందుకే   ఈ ఇన్‌స్టిట్యూట్‌ను బిజినెస్‌ ఫెయిల్యూర్స్‌ కోసమే పెట్టాను. ఫెయిల్యూర్‌ అనేది ఒక స్టేట్‌ ఆఫ్‌ మైండ్‌. నిరాశ నుంచి ఆశకు త్వరగా మారేందుకు వీలుంటుంది. ఉంది కూడా. ఆశే విజయం. విజయం వైపు నడిపించేది పాజిటివ్‌ ఆలోచనే’’ అని అంటుంది లెటిషియా గాస్కా.

లెరాటో మోట్సమై (సౌత్‌ ఆఫ్రికా),
ఫౌండర్, సీఈఓ ఆఫ్‌ ‘‘పెట్రోలింక్‌’’
లెరాటో మోట్సమై జీవితం.. నిజంగానే స్ఫూర్తిదాయకం. ఒకప్పుడు నిలువ నీడలేక.. కారునే ఇల్లు చేసుకొని తన ఇద్దరు పిల్లలతో దాంట్లో తలదాచుకుంది. ఇప్పుడు.. మగవాళ్ల చేతుల్లో ఉన్న పెట్రోలియం ఇండస్ట్రీలో కాలుమోపి.. మహిళలకూ స్పేస్‌ చూపించింది. 2012లో పెట్రోలింక్‌ అనే కంపెనీని పెట్టి ఎందరో మహిళలకు ఉపాధినిస్తోంది. అంతేకాదు ఆఫ్రికాలోని అమ్మాయిల ఆర్థిక స్వావలంబన కోసం 2014లో "Girl ignite Africa Academy"‘ని స్థాపించింది.

ఆమె సాధించిన విజయాలకు న్యూయార్క్‌లో గ్లోబల్‌ బిజినెస్‌ లీడర్‌షిప్‌ అవార్డును అందుకుంది. ఆమె నడుపుతున్న పెట్రోలింక్‌.. సౌత్‌ ఆఫ్రికాలోనే అతిపెద్ద పెట్రోలియం కంపెనీ. ‘‘పెట్రోలియం ఇండస్ట్రీ ఇప్పటికీ వైట్‌ మెన్‌ చేతుల్లోనే ఉంది. మార్కెట్‌ యాక్సెస్, పెట్టుబడుల మద్దతు మహిళలకు ఎప్పటికీ సవాళ్లే. జెండర్‌ బ్యాలెన్స్‌ అనేది సుదూర స్వప్నం. అయినా మహిళలకు  ధైర్యం ఉంటే చాలు.. పెట్రోలియమే కాదు అంతకన్నా గొప్ప పరిశ్రమలను ఒంటిచేత్తో నడపడానికి’’ అంటారు  లెరాటో మోట్సమై.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top