
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా సమస్యలను పేర్కొంటూ.. ఇంటెల్ సీఈఓ 'లిప్-బు టాన్' వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
'ఇంటెల్ సీఈఓ తీవ్ర గందరగోళంలో ఉన్నారు, ఆయన వెంటనే రాజీనామా చేయాలి. ఈ సమస్యకు వేరే పరిష్కారం లేదని' ట్రంప్ వెల్లడించారు. సెనేటర్ టామ్ కాటన్, ఇంటెల్ చైర్మన్ ఫ్రాంక్ ఇయరీకి రాసిన లేఖ తర్వాత ట్రంప్ ఈ డిమాండ్ చేశారు. అందులో చైనా కంపెనీలతో 'టాన్'కు ఉన్న ఆర్థిక సంబంధాలపై సెనేటర్ ఆందోళన వ్యక్తం చేశారు.
టాన్ డజన్ల కొద్దీ చైనా కంపెనీలను నియంత్రిస్తున్నారని, వందలాది చైనీస్ అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ & చిప్ కంపెనీలలో వాటాను కలిగి ఉన్నారని సెనేటర్ లేఖ పేర్కొంది. అంతే కాకుండా చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో సంబంధాలు కలిగి ఉన్నాయని ఆరోపించారు.
కాడెన్స్ డిజైన్ సిస్టమ్స్‌లో టాన్ నాయకత్వ పాత్రను కూడా కాటన్ హైలైట్ చేశారు. జూలైలో ఆ కంపెనీ తన ఉత్పత్తులను చైనా మిలిటరీకి చెందిన చైనా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీకి విక్రయించడం ద్వారా యూఎస్ ఎగుమతి నియంత్రణలను ఉల్లంఘించినట్లు అంగీకరించింది.
ఇంటెల్ సీఈవోను.. ట్రంప్ రాజీనామా చేయాలనీ పట్టుబట్టడంతో గురువారం ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో ఇంటెల్ స్టాక్ 5 శాతం పడిపోయింది. అయితే తనకు కంపెనీ బోర్డు సభ్యుల నుంచి పూర్తి మద్దతు ఉందని 'టాన్' పేర్కొంటూ రాజీనామాను తిరస్కరించారు. అంతే కాకుండా తన ట్రాక్ రికార్డు గురించి అసత్య సమాచారం వ్యాప్తి కావడంతో వైట్‌హౌస్‌ను సంప్రదించారు.
ఇదీ చదవండి: భారత్ ఆర్థిక వృద్ధి బలంగా ఉంది.. కానీ..: ట్రంప్ సుంకాలపై ఆర్‌బీఐ చీఫ్
ఈ వివాదంపై స్పందిస్తూ.. ఇంటెల్ ఒక ప్రకటన విడుదల చేసింది. కంపెనీ, టాన్ ఇద్దరూ అమెరికా జాతీయ భద్రతను కాపాడటానికి కట్టుబడి ఉన్నారు. వారి ఆందోళనలను పరిష్కరించడానికి చట్టసభ సభ్యులతో సహకరిస్తారని పేర్కొంది. ప్రస్తుతానికి, టాన్ తన పాత్రలో కొనసాగుతున్నారు. కానీ రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది, పెట్టుబడిదారులతో కూడా భయాలు పెరుగుతున్నాయి. టాన్ నాయకత్వం & ఇంటెల్ భవిష్యత్తు దిశపై చర్చ త్వరలో ముగిసే అవకాశం లేదని వెల్లడించింది.