మూడు గుణాలు | Give me three days I will take care of my sister and come back soon | Sakshi
Sakshi News home page

మూడు గుణాలు

Jun 3 2019 12:26 AM | Updated on Jun 3 2019 12:26 AM

Give me three days I will take care of my sister and come back soon - Sakshi

ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ (ర) ఒకసారి కొలువు తీరి ఉండగా, ఇద్దరు వ్యక్తులు ఒక యువకుడిని బంధించి ఈడ్చుకుంటూ అక్కడకు తీసుకువచ్చి ‘ఓ విశ్వాసుల నాయకా..! వీడు మా తండ్రిని హత్య చేశాడు, మీరు వీడికి మరణశిక్ష విధించాలి..’ అని అన్నారు ఉమర్‌ (ర) ఆ యువకుడి వైపు చూస్తూ .. ‘ఎందుకు చంపావు వీళ్ల తండ్రిని..?’ అని అడిగాడు. ఆ యువకుడు.. ‘నేనొక ఒంటెల కాపరిని. అనుకోకుండా నా ఒంటె ఒకటి వారి పొలంలో మేసింది. అది చూసి వీళ్ల నాన్న ఒక పెద్ద రాయిని దాని మీదకు విసిరాడు. రాయి కంటికి తగిలి అది బాధతో గిల గిల లాడింది. నేను కోపంతో అదే రాయిని తీసి వాళ్ల నాన్న మీదకు విసిరాను. అది ఆయన తలమీద పడి ఆయన చనిపోయాడు’ అని చెప్పాడు.

‘అలా అయితే నేను నీకు అదే శిక్ష విధిస్తాను’ అన్నారు ఉమర్‌ (ర). యువకుడు కంగారుగా.. ‘ఓ నాయకా..! దయచేసి నాకు మూడు రోజులు గడువు ఇప్పించండి. మా నాన్న చనిపోతూ నాకు కొంత ఆస్తిని ఇచ్చాడు, ఇంకా నాకు ఒక చెల్లెలు ఉంది. ఆమె బాధ్యత కూడా నా మీద ఉంది. మీరు నన్ను ఇప్పుడే చంపేస్తే నా ఆస్తికి రక్షణ, నా చెల్లెలికి సంరక్షణ ఉండదు. నాకు మూడు రోజులు గడువు ఇవ్వండి. నేను నా చెల్లెలికి సంరక్షణ ఏర్పాటు చేసి వెంటనే తిరిగి వస్తాను’ అన్నాడు. దానికి ఉమర్‌ (ర).. ‘సరే, నీకు పూచీగా ఎవరు ఉంటారు?’ అని అడిగారు. యువకుడు అక్కడ గుమిగూడి ఉన్న జనంలోకి చూశాడు.

అందరూ తలలు వంచుకున్నారు. కానీ ఒక చేయి పైకి లేచింది. అది హజరత్‌ అబూజర్‌ గిఫారీ (ర) గారిది.‘ఇతనికి పూచీగా ఉంటావా అబూజర్‌..?’ అని అడిగారు ఉమర్‌. ‘ఉంటాను నాయకా...!’ అన్నాడు అబూజర్‌ (ర). ‘‘అతను తిరిగి రాకపోతే ఆ శిక్ష నీకు పడుతుంది, తెలుసుగా...?’ అన్నారు ఉమర్‌. ‘ నాకు సమ్మతమే నాయకా! అన్నాడు అబూజర్‌ (ర). ఆ యువకుడు వెళ్లి పోయాడు.. రెండు రోజులు గడిచిపోయాయి. మూడవ రోజు సాయంత్రం కావస్తుంది. ఆ యువకుడి జాడ లేదు. అతడు తిరిగి రాకపోతే అబూజర్‌ (ర) కు మరణ శిక్ష పడవచ్చని అందరూ భయపడసాగారు.

సూర్యాస్తమయానికి ఇంకా కొంచెం సమయం ఉందనగా.. ఆ యువకుడు వచ్చి సభలో ఉన్న హజరత్‌ ఉమర్‌ (ర) ముందు హాజరయ్యాడు. అలసి సొలసినట్లు ఉన్న ముఖంతో అతడు ఇలా అన్నాడు.. ‘..ఓ నాయకా! నా ఆస్తిని, చెల్లెలి సంరక్షణ బాధ్యతను మా మామయ్యకు అప్పచెప్పాను... ఇక మీరు నాకు శిక్ష విధించవచ్చు’ అని!ఉమర్‌ (ర) ఆశ్చర్యంతో.. ‘శిక్ష నుండి తప్పించుకొనే అవకాశం ఉన్నా సరే ఎందుకు తిరిగి వచ్చావు?’ అని అడిగాడు. ‘ చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే సమర్థతను మనుషులు కోల్పోయారని అందరికీ అనిపిస్తుందని భయం వేసింది, అందుకే తిరిగి వచ్చాను’ అన్నాడు యువకుడు.

ఉమర్‌(ర) : (అబూజర్‌ వైపు చూస్తూ) ‘అసలు నీవెందుకు అతడికి పూచీగా ఉన్నావు?

అబూజర్‌ (ర) : సాటి మనిషి ఆపదలో ఉండి చేయి చాస్తే అతడికి మేలు చేసే ఆకాంక్షను మనుషులం కోల్పోయాం అనిపిస్తుందని భయం వేసింది. అందుకే పూచీగా ఉన్నాను.. అన్నాడు.

ఇక హత్యానేరాన్ని మోపిన ఆ వ్యక్తులు ఇదంతా చూసి ఇలా అన్నారు.. ‘ఓ నాయకా! మేము కూడా ఈ యువకుడిని క్షమించి వేస్తున్నాము, దయచేసి అతడిని శిక్షించకండి’ అన్నారు. ఉమర్‌ (ర) అమితాశ్చర్యంతో.. ‘అదేంటి? ఎందుకు క్షమించి వేస్తున్నారు?’ అన్నారు. క్షమాగుణం మనుషుల హృదయాల నుండి తుడిచి పెట్టుకు పోయినట్లనిపిస్తుందని భయం వేస్తోంది. అందుకే క్షమిస్తున్నాము’ అన్నారు ఆ వ్యక్తులు.
– మర్యమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement