గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ | Gastroenterology counseling | Sakshi
Sakshi News home page

గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్

Jul 24 2015 11:06 PM | Updated on Sep 3 2017 6:06 AM

నా వయసు 56. నేను గత 5 సంవత్సరాల నుండి డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నాను.

భయపడాల్సిన అవసరం ఏమీ లేదు

 నా వయసు 56. నేను గత 5 సంవత్సరాల నుండి డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నాను. గత 20 రోజుల నుండి భోజనం చేస్తుంటే ఛాతీలో నొప్పి వస్తోంది. ఎందువల్ల నొప్పి వస్తోందో అర్థం కావడంలేదు. నాకు సరైన సలహా ఇవ్వగలరు.
 - వెంకటేశ్వర్, నిర్మల్

 భోజనం చేస్తున్నప్పుడు గానీ, ద్రవ పదార్థాలు తీసుకున్నప్పుడు కానీ ఛాతీలో నొప్పి రావడాన్ని ‘బడైనోఫెజిమా’ అంటారు. మీరు డయాబెటిస్‌తో బాధపడుతున్నారు కాబట్టి ఆహార వాహికకు సంబంధించిన  ఇన్ఫెక్షన్ వల్ల నొప్పి వచ్చే అవకాశం ఉంది. మీలో డయాబెటిస్‌ని నియంత్రించకపోతే ‘కాన్‌డిడా’ అనే ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోండి. తరువాత దానికి సంబంధించిన మందులు వాడి, డయాబెటిస్‌ను నియంత్రణలో పెట్టుకుంటే మీకు మంచి ఫలితం లభిస్తుంది.
 
 నా వయస్సు 48 సంవత్సరాలు. ఐదు సంవత్సరాల క్రితం నాకు లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా ఆపరేషన్ చేసి, పిత్తాశయాన్ని తొలగించారు. ఇప్పుడు అదే స్థానంలో మూడు నెలల నుండి నొప్పి వస్తోంది. ఎందుకు ఇలా జరుగుతున్నది? నొప్పి తగ్గే మార్గం చెప్పగలరు?
 - రమణ, విశాఖపట్నం

 సాధారణంగా కాలేయంలో తయారయ్యే పైత్య రసం చిన్నచిన్న నాళాల ద్వారా వచ్చి పిత్తాశయంలో కేంద్రీకరించబడుతుంది. పిత్తాశయం నుండి సిబిడి అనే గొట్టం ద్వారా చిన్నప్రేవులోకి చేరుతుంది. అయితే పిత్తాశయాన్ని తొలగించిన తరువాత మీకు నొప్పి కలగడానికి అనేక కారణాలు ఉండవచ్చు. మీరు ముందుగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షను చేయించుకుని, సిబిడి గొట్టంలో రాళ్లు ఇంకా ఏమైనా ఉన్నాయా లేవా అనే విషయం నిర్ధారణ చేసుకోవాలి. ఎండోస్కోపీ పరీక్ష చేయించుకుని అల్సర్‌కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి. రెండు పరీక్షలు నార్మల్‌గా ఉన్నట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఒకసారి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలిసి తగిన పరీక్షలు చేయించుకోండి.
 
మా పాప వయసు 9 సంవత్సరాలు. మల విసర్జనలో ఎలాంటి సమస్య లేదు. కానీ అప్పుడప్పుడు మలంలో రక్తం పడుతోంది. వీటికి మీరు తగిన సలహా, సూచన ఇవ్వగలరని ప్రార్థన.
 - రాజేశ్వరి, రాయచోటి

 మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే అవి పెద్ద ప్రేవులో కంతులు ఉన్నాయనిపిస్తోంది. వీటిని పాలిప్స్ అంటారు. ఈ కంతులు ఉండడం వల్ల అప్పుడప్పుడు మలంలో రక్తం వచ్చే అవకాశం ఉంది. ఇలా మలంతో రక్తం పోవడంవల్ల మీ పాపకి ఎనీమియాకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి పాపకు సిగ్మా ఎండోస్కోపీ చేయించండి.ఒకవేళ పాలిప్స్ ఏమైనా ఉన్నట్లయితే ఎండోస్కోపీ ద్వారా తొలగించవచ్చు. ఈ చికిత్స వల్ల పాపకు ఉన్న సమస్య తొలగిపోతుంది. మీరు వెంటనే దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలిసి చికిత్స మొదలుపెట్టండి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement