మృత్యుభయం

Fear of death - Sakshi

రాజుగారు భారీ ఊబకాయంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. సన్నబడేందుకు ఎన్ని మందులు వాడినా, ప్రయోజనం లేకపోగా రోజురోజుకూ బరువు పెరగసాగారు. దాంతో తన బరువు తగ్గించగల వైద్యుడికి భారీ నజరానా ప్రకటించారు. ఒక వైద్యుడు వచ్చాడు. రాజుగారితో ‘‘నేను మీ బరువును తగ్గిస్తాను. మీరు సన్నబడే వైద్యం నా దగ్గరుంది.’’ అంటూ రాజును పరీక్షించి, మరుసటి రోజు వస్తానని వెళ్లిపోయాడు. రెండోరోజు వైద్యుడు చాలా విచారంగా దర్బారులోనికి వచ్చి ‘‘రాజుగారూ! ఇప్పుడిక వైద్యంతో లాభంలేదు.

పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. మరెన్నో రోజులు మీరు బతకరు.మహా అయితే ఓ 30 రోజులు మాత్రమే మీరు బతుకుతారు’’ అని చెప్పాడు విచారంగా. ఈ మాటలతో రాజుకు ముచ్చెమటలు పట్టాయి. ఆగ్రహంతో వైద్యుడ్ని బంధించారు. కానీ వైద్యుడి మాటలు రాజును మనశ్శాంతి లేకుండా చేశాయి. తీవ్ర విచారంతో తిండీ తిప్పలు మానేశారు. కంటికి నిద్ర కూడా కరువైంది. రెప్ప వాలిందంటే– మృత్యువు తనను వెంబడిస్తున్నట్లు పీడకలలతోనే సరిపోతోంది.

అలా వైద్యుడు చెప్పిన గడువుకు ఇంకా రెండు రోజులే మిగిలాయి. రాజుకు ఒక్కసారిగా మృత్యువు కళ్లముందే తిరగాడ సాగింది. భయంతో వణికి పోసాగారు. 29 వ రోజు,  రాజు చెరసాలలో ఉన్న వైద్యుడ్ని పిలిచి, ‘‘నువ్వు చెప్పిన గడువుకు కేవలం ఒక్కరోజే మిగిలింది. ఒకవేళ నువ్వు చెప్పినట్లుగా రేపు నేను చనిపోకపోతే నీ తల నరికేస్తాను’అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. రాజుగారి మాటలకు వైద్యుడు పగలబడి నవ్వాడు.

‘‘అల్లాహ్‌!  మీకు నూరేళ్ల ఆయుష్షు ఇచ్చు గాక, మీ చావు ఘడియలు నాకెలా తెలుస్తాయండీ, నేనేమైనా జ్యోతిష్యుడినా? అయితే, నేను ఏ ఉద్దేశంతోనైతే ఈ మాటన్నానో ఆ ఉద్దేశం నెరవేరింది. మృత్యువు భయంతో నిద్రాహారాలు మాని మీరు సన్నబడ్డారు. ఇదే నా వైద్యం’’ అని విన్నవించుకున్నాడు. వైద్యుడి మాటలకు రాజు సంతోషించాడు. నిజంగా నెల తిరక్కముందే తాను ఇంత సన్నబడ్డానా అని ఆశ్చర్యపోయారు. వైద్యుడి సమయస్ఫూర్తికి ఎంతగానో అభినందించారు. విలువైన కానుకలతో సత్కరించారు. ఏ వ్యక్తికైనా చావు జ్ఞాపకం ఉండి, పరలోక చింతనలో జీవితం గడిపితే ఎవరూ లావెక్కరు. ఆరోగ్యంగా ఉంటారు. ఇదే ఈ కథలో నీతి.

– రేష్మా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top