పొలం, స్థలం అమ్మినా తీరని అప్పులు

Farmer suicide on debt relief - Sakshi

కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మంగళి పెద్ద ఎల్లనాగన్న అనే రైతు అప్పుల బాధతో 2014 ఆగస్టు 25న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య సావిత్రితోపాటు ముగ్గురు కుమార్తెలు (గీతాంజలి, రేణుక, శ్రీలక్ష్మి), కుమారుడు వీరేష్‌ ఉన్నారు. గీతాంజలి కస్తూర్బా గాంధీ వసతి గృహంలో ఉండి 6వ తరగతి చదువుతున్నది. రేణుక 5వ తరగతి, శ్రీలక్ష్మి 1వ తరగతి, వీరేష్‌ 4వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. చిన్నారుల పోషణ భారమైనా ఐదేళ్లుగా పంటిబిగువున బాధను దిగమింగి సంసార నౌకను లాక్కొస్తున్నది సావిత్రి.
కుటుంబపెద్ద మరణించినా బీమా అందలేదు. ఎన్‌.ఎఫ్‌.బి.ఎస్‌. పథకం కింద రావాల్సిన రూ. 20 వేలు కూడా అందలేదు. బాధితకుటుంబానికి ప్రభుత్వం ఇల్లు కూడా మంజూరు కాలేదు. అధికారులు పట్టించుకోవడం లేదు. వితంతు పింఛన్‌ మాత్రమే మంజూరైంది.

రెండున్నరెకరాల పొలం, ఇంటిస్థలం ఉండేది. అప్పుల వాళ్ల ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో 2.5 ఎకరాల పొలంతోపాటు ఇంటి స్థలాన్ని కూడా అమ్మి అప్పులు తీర్చింది సావిత్రి. అయినా, ఇంకా రూ. 3 లక్షల అప్పు మిగిలింది. గ్రామంలో ఇల్లు కూడా లేకపోవడంతో బంధువుల ఇంటిలో తలదాచుకుంటూ పిల్లలను కడుపులో పెట్టుకొని జీవనం సాగిస్తున్నది. వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ నలుగురు పిల్లలను పోషించుకుంటున్నది. కరువు వల్ల వ్యవసాయ పనులు కూడా చేతినిండా లేవు. పని దొరకని రోజు మంచినీళ్లతో తల్లీ బిడ్డలు కడుపు నింపుకోవాల్సిన దుర్భర పరిస్థితులున్నాయి. ప్రభుత్వం, దాతలు సహకరించి ఆర్థికంగా ఆదుకోవాలని సావిత్రి కోరుతున్నది.
– నీలం సత్యనారాయణ, సాక్షి, కల్లూరు, కర్నూలు జిల్లా

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top