తప్పిపోయింది పెద్దోడా, చిన్నోడా?

Even the eldest son living with his father is a bad name - Sakshi

సువార్త

తండ్రిని ధిక్కరించి, ఆస్తిలో తన వంతు భాగం తీసేసుకొని దూరదేశానికి వెళ్లి అదంతా దుబారా చేసి, జీవితంలో పూర్తిగా చితికిపోయిన చిన్న కుమారుడు పశ్చాత్తాపంతో ఇంటికి తిరిగొచ్చాడు. ఆ సంతోషంతో వాద్యాలు, నాట్యాలతో తండ్రి తన ఇంట్లో గొప్ప సంబరాలు, మహా విందు చేస్తున్నాడు. తండ్రి తనను క్షమించి కుమారుడిగా కాకున్నా కనీసం ఒక పనివాడిగా తనను ఇంట్లో చేర్చుకున్నా చాలనుకుని తిరిగొచ్చిన  చిన్న కుమారుడికి ఇదంతా అనూహ్యం, అత్యానందకరం!!! అయితే ఆదినుండీ తండ్రి వెంబడే ఉంటూ, తండ్రి పనులు చేస్తూ, తండ్రితో పాటే జీవిస్తున్న పెద్దకుమారుడికి కూడా, తనకు చెడ్డపేరు తెచ్చిన చిన్న కొడుకు తిరిగి ఇంటికొస్తే తన తండ్రి ఇంతగా సంతోషించడం అనూహ్యంగానే ఉంది. భరించలేకుండా కూడా ఉంది. తర్వాత వెళ్లి, ‘‘ఇన్నాళ్లూ నిన్ను అంటిపెట్టుకొని సేవచేస్తున్న నాకోసం ఎన్నడూ నీవు ఇలాంటి సంబరాలు చేయలేదు, నా విషయంలో సంతోషించలేదు, విందు చేసుకొని సంతోషించడానికి ఎన్నడైనా నాకొక మేకపిల్లనిచ్చావా?’’ అంటూ తండ్రితో గొడవ పెట్టుకున్నాడు(లూకా 15:11–32). 
యేసుక్రీస్తు చెప్పిన ‘తప్పిపోయిన కుమారుని’ ఉపమానంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన బైబిల్‌ భాగం ఇది.

అయితే నిజంగా తప్పిపోయింది చిన్నకొడుకా, పెద్ద కొడుకా అన్న సంశయం వస్తుంది. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలన్నది దేవుని ఆజ్ఞ, అభీష్టం కాగా, తండ్రితోనే ఉంటూ తండ్రి ప్రేమను, హృదయాన్ని అర్థం చేసుకోకుండా, తన సొంత తమ్ముణ్ణి క్షమించలేకపోయిన పెద్దకుమారుడే నిజంగా తప్పిపోయిన కుమారుడా? అన్న అభిప్రాయం కలగడం సహజమే, న్యాయమే. తండ్రిని వదిలి తప్పి పోయినవాడు చిన్న కొడుకైతే, తండ్రితోనే ఉంటూ తప్పిపోయినవాడు పెద్ద కొడుకు. ఈ పెద్దకొడుకు లాంటి తప్పిపోయిన కుమారులే సమాజంలో, చర్చిల్లో చాలా సమస్యలకు కారకులు. చిన్నవాడితో సమానంగా బోలెడు ఆస్తిని తండ్రి తనకు పంచి ఇచ్చినా, విందు చేసుకోవడానికి తనకొక మేక పిల్లనివ్వలేదంటూ తండ్రిని నిందించిన అల్పుడు ఆ పెద్దవాడు. చిన్నవాడు, పెద్దవాడితో సహా లోకంలో అంతా పాపం చేసి దేవునికి దూరమైన వారే అంటుంది బైబిల్‌ (రోమా 3:23). కాకపోతే చిన్నవాడు తిరిగొచ్చాడు, పెద్దవాడికి తాను తిరిగి తండ్రిని పరిపూర్ణంగా ఆశ్రయించాలన్న ఆలోచనే ఇంకా లేదు. కొత్తనిబంధన తాలూకు ఈనాటి కృపాయుగంలో ’యాజకత్వం’ అనే మధ్యవ్యవస్థను యేసుప్రభువు రద్దు చేసి, విశ్వాసులు తనను అంటే దేవుణ్ణి నేరుగా ఆశ్రయించే వీలుకల్పిస్తే, ఎందుకీ సంబరాలంటూ నేరుగా తండ్రినే అడిగే హోదా, చనువూ ఉన్నా, పనివాడిని పిలిచి తన సొంతింటి విషయాలు వాకబు చేసిన పెద్దకొడుకు లాగా, దేవుణ్ణి వదిలేసి ‘‘మా పాదిరి, మా పాస్టర్, మా అయ్యగా’’రంటూ బోధకులకు, పరిచారకులకు ప్రాధాన్యతనిచ్చే అవగాహన లేని ఈనాటి విశ్వాసులు ఇంకా తప్పిపోయే ఉన్న ఆ పెద్దకొడుకులే!! తండ్రితోనే  ఉన్నా తండ్రి క్షమా హృదయం, ఔదార్యం, ప్రేమనూ  అర్థం చేసుకోకుండా బయటి వాళ్లలాగే సద్వర్తన, మార్పు లేకుండా జీవించేవారు ఆ పెద్దకొడుకులే. తండ్రితోనే ఉన్నా తండ్రి ఆనందాన్ని ఆవగింజంత కూడా సొంతం చేసుకోలేక, ఎంతున్నా తమకు దేవుడు ఇంకా ఏదో ఇవ్వలేదన్న అసంతృప్తితో బతికే నిరంతర నిరాశావాదులు, నాకొక మేకపిల్లను కూడా ఇవ్వలేదంటూ తండ్రిని నిందించిన ఆ పెద్దకొడుకులాంటివారే!! మార్పునొందిన విశ్వాసి లోకానికే కాదు పరలోకంలో కూడా ఆనందకారకమవుతాడు. మార్పునొందిన ఒక్క పాపి వల్ల పరలోకంలో ఎంతో ఆనందం వెల్లివిరుస్తుందని ప్రభువే చెప్పాడు( లూకా 15:7). 

విశ్వాసిలో వచ్చే ‘మార్పు’ అతని వ్యక్తిగత జీవితంలో, పిదప అతని వల్ల సమాజంలోనే కాదు, పరలోకంలో కూడా ఆనందాన్ని వ్యాపింపజేస్తుంది. తన హృదయంలో లేని ఆనందాన్ని విశ్వాసిలోకంలో, పరలోకంలో కూడా నింపలేడు. మారిన జీవితమే ఆనందానికి నిలయమవుతుంది. జీవితం మారకుండా సమాజంలో, చర్చిల్లో ఎంత ప్రముఖంగా జీవిస్తున్నా వారిలో ఆనందం తప్ప అన్నీ ఉంటాయి. చిన్నకొడుకు తప్పిపోయి దొరికాడు, పెద్దవాడు ఇంకా తప్పిపోయే ఉన్నాడు, దేవునికింకా దొరకలేదు, అదీ ఈనాటి క్రైస్తవం సంక్షోభం!!  శుచి కరువైన పాయసంలో రుచి కూడా కరువైనట్టే, మార్పులేని జీవితంలో ఆనందం కూడా కరువవుతుంది. అదే ఆ పెద్దకొడుకు జీవిత తాత్పర్యం!!
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top