ఈఎన్‌టీ కౌన్సెలింగ్‌

ent councilling - Sakshi

ముక్కులు మూసుకుపోతున్నాయి ఫ్రీ అయ్యేదెలా..?
నా వయసు 26 ఏళ్లు. నా ఎడమ చెవిలో వినికిడి సమస్యతో గత రెండేళ్లుగా బాధపడుతున్నాను. కుడి చెవి బాగానే ఉంది. పదిహేను రోజుల క్రితం ఈఎన్‌టీ వైద్యుడిని సంప్రదించాను. ఆయన నా చెవులను పరీక్షించి ఎడమ చెవిలో ఎముక కొద్దిగా మందం అయింది, అందువల్లనే మాటలు అర్థం చేసుకోలేకపోతున్నానని చెప్పారు. అంతేకాకుండా ఈ సమస్య చాలా అరుదుగా వస్తుందని, లేజర్‌ సర్జరీ అవసరం కావచ్చని చెప్పారు. కొన్ని మందులు రాశారు. నా సమస్య ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు లేజర్‌ సర్జరీ అవసరమవుతుందా? – మదన్‌మోహన్, నల్లగొండ
మీ సమస్యను విశ్లేషించడానికి మీరు ఇచ్చిన వివరాలు సరిపోవు. మీరు మొదట ఆడియాలజీ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. వాటిలో మీకు ఉన్న సమస్య తీవ్రత ఎంత, చెవిలోని ఏ భాగంలో సమస్య ఉంది అన్న వివరాలు తెలుస్తాయి. అయితే...  మీరు చెప్పిన వివరాలను బట్టి చూస్తే మీరు ‘ఓటోస్లి్కరోసిస్‌’ అనే సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. మధ్య చెవిలోని ఎముకల గొలుసులో ఉండే చిన్న ఎముక అయిన ‘స్టెపీస్‌’లో ఒక ఎముక మందం కావడం, స్పాంజిజోన్‌ పెరగడం వల్ల ఈ సమస్య వస్తుంది.

ఇది ఉన్నవారికి శబ్దం, మాటలు వినిపిస్తాయి. కానీ అవి అర్థం కావు. సమస్య తీవ్రత పెరిగే కొద్దీ వినికిడి సమస్యలు కూడా పెరుగుతాయి. మీరు వెంటనే ప్యూటర్‌టోన్‌ ఆడియోమెట్రీ, ఇంపిడెక్స్‌ ఆడియోమెట్రీ, ఓటోస్కోపీ మొదలైన పరీక్షలు చేయించుకోవాలి. అవసరాన్ని బట్టి సీటీ స్కాన్‌ చేయించి మీ సమస్యను నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలు సాధారణంగా మందులతో తగ్గవు. సమస్య తీవ్రతను, పరిస్థితిని బట్టి చేయాలో నిర్ణయించాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు పైన చెప్పిన సమస్య ఉన్నట్లయితే మీరు హియరింగ్‌ ఎయిడ్‌ వాడటం లేదా ఆపరేషన్‌ చేయించుకోవాల్సిన అవసరం ఉండవచ్చు.

ముక్కుఎప్పుడూ ఏదో అడ్డండి తగ్గేదెలా?
నాకు ముక్కులో ఎప్పుడూ ఏదో అడ్డం పడినట్లుగా అనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా ఈ సమస్య వదలడం లేదు. చాలా రకాల మందులు వాడాను. మార్కెట్‌లో దొరికే చుక్కల మందు వాడుతున్నాను. అది వాడినప్పుడు మాత్రం సమస్య తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తోంది. ఆ మందుకు అలవాటు అవుతానేమో అని మానేశాను. రాత్రిపూట రెండు ముక్కు రంధ్రాలు మూసుకుపోతున్నాయి. చాలాసార్లు నోటితో గాలి తీసుకోవాల్సి వస్తోంది. నా సమస్య ఏమిటి? దీనికి తగిన పరిష్కారం తెలియజేయగలరు.
– పి. సూర్యనారాయణ, నెల్లూరు
ఈమధ్య కాలుష్యం వల్ల, జీవనశైలిలో మార్పుల వల్ల చాలామందిలో అలర్జీ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలర్జీ సంబంధిత సమస్యలలో మొదట ఉండేది ముక్కుకు సంబంధించిన సమస్యలే. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు ముక్కుదూలం వంకరపోవడం లేదా అలర్జీ లేదా ముక్కులో పాలిప్స్‌ లేదా ఈ అన్ని సమస్యలు కలగలిసి ఉండవచ్చు. మీరు మొదట నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి ముక్కుకు సంబంధించిన పరీక్షలు చేయించి, అవసరమైతే సీటీ స్కాన్‌ (పీఎన్‌ఎస్‌) కూడా తీయించాక మీ వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.

మీకు ముక్కుదూలం వంకరపోతే దాన్ని ఒక చిన్న ఆపరేషన్‌తో సరిచేయవచ్చు. దీనినే సెప్టోప్లాస్టీ అంటారు. లేదా ముక్కులో పాలిప్స్‌ ఉన్నట్లయితే వాటిని కూడా ఆపరేషన్‌తో తొలగించవచ్చు. అలర్జీ వల్ల వచ్చే సమస్య అయి ఉంటే అందుకు కారణమైన అంశాలకు దూరంగా ఉండటం, ముఖ్యంగా కాలుష్యానికి దూరంగా ఉండటం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తాజా పదార్థాలు మాత్రమే తినడం, చల్లటి వాతావరణానికి, వస్తువులను దూరంగా ఉండటం వంటి చేయడం వల్ల మీ సమస్యను నివారించవచ్చు. కొన్ని రకాల నేసల్‌ స్ప్రేలు వాడటం వల్ల మీ సమస్యను అదుపులో ఉంచవచ్చు.

-డాక్టర్‌ ఇ.సి. వినయ కుమార్‌
హెచ్‌ఓడి –ఈఎన్‌టి సర్జన్,అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top