
మాస్కో: రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఎట్టకేలకు భారత్ తన వైఖరిని బయటపెట్టింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధిస్తూ బెదిరింపులకు దిగుతున్న నేపథ్యంలో భారత్ కౌంటరిచ్చింది. ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే అక్కడే చమురు కొంటామని స్పష్టం చేసింది. దేశీయ ప్రయోజనాలకే భారత్ ప్రాధాన్యం ఇస్తుందని కుండబద్దలు కొట్టింది.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యాలోని భారత రాయబారి వినయ్ కుమార్ తాజాగా రష్యా ప్రభుత్వం వార్తా సంస్థ టాస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ప్రపంచంలో ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే అక్కడే చమురు కొంటాం. ఎక్కడ చౌకగా దొరికితే ఇండియన్ కంపెనీలు అక్కడే కొనుగోలు చేస్తాయి. దేశీయ ప్రయోజనాలకే కాపాడుకోవడానికే ఢిల్లీ ప్రాధాన్యం ఇస్తుంది. భారత్‌లోని 1.4 బిలియన్ల ప్రజల ఇంధన భద్రత మా లక్ష్యం. ఇతర దేశాల మాదిరిగానే రష్యాతో సహకారంలో భాగంగా చమురు మార్కెట్, ప్రపంచ చమురు మార్కెట్‌లో స్థిరత్వాన్ని తీసుకురావడానికి సహాయపడింది.
🚨 BIG STATEMENT
Indian Envoy to Russia, Vinay Kumar, SLAMS US move to impose 25% tariffs on INDIA for buying Russian oil.
— Calls it ‘Unfair, Unreasonable & Unjustified.’
— Says Indian companies will KEEP buying oil from Wherever they get the best deal. pic.twitter.com/yyiHjhpkFA— VIPIN_UPDATE🚨 (@Vipin_Update) August 25, 2025
భారత్ విషయంలో వాషింగ్టన్ నిర్ణయం అన్యాయం, అసమంజసమైనది. భారత్ ప్రభుత్వం ఎల్లప్పుడు దేశ జాతీయ ప్రయోజనాలను పరిరక్షించే చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. రష్యాతో అమెరికా సహా పలు యూరప్ దేశాలు వ్యాపారం చేస్తున్నాయి. వాటిపై మాత్రం ఎందుకు సుంకాలు విధించలేదు అని ప్రశ్నించారు. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత వస్తువులపై సుంకాలను 50 శాతానికి రెట్టింపు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో భారత్.. రష్యా ముడి చమురు కొనుగోలుకు 25 శాతం అదనపు సుంకం కూడా ఉంది. భారత్.. రష్యా ముడి చమురు కొనుగోళ్లు ఉక్రెయిన్‌లో మాస్కో యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నాయని అమెరికా ఆరోపించింది. ఈ ఆరోపణను భారత్ తిరస్కరించింది.