
మాస్కో: రష్యాలోని కంపెనీలు, ముఖ్యంగా యంత్రాలు, ఎల్రక్టానిక్స్ రంగాలకు చెందిన కంపెనీలు భారతీయులను రిక్రూట్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయని రష్యాలోని భారత రాయబారి వినయ్ కుమార్ అన్నారు. వచ్చిన వారిలో ఎక్కువ మంది నిర్మాణ, వస్త్ర రంగాల్లో పనిచేస్తున్నారని, కానీ యంత్రాలు, ఎల్రక్టానిక్స్ విభాగాల్లో భారతీయులకు డిమాండ్ బాగా ఉందని వెల్లడించారు.
ఆ దేశీయ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. రష్యాలోని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఎక్కువ మంది భారతీయులు వస్తుండటంతో కాన్సులర్ సేవల పనిభారం పెరుగుతోందన్నారు. అమెరికా, కెనడా, యూకే సహా పాశ్చాత్య దేశాల్లో వలసలపై పెరుగుతున్న అణిచివేత మధ్య ఈ వ్యాఖ్యలు వచ్చాయి. రష్యాలో పెరుగుతున్న భారతీయ కార్మీకుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని కాన్సులర్ సైతం తమ సేవలను విస్తరింపజేస్తోందన్నారు.
రష్యాలో పెరుగుతున్న భారతీయుల సంఖ్య
రష్యాలో భారతీయుల సంఖ్య పెరుగుతోంది. విద్యార్థులు, వివిధ రంగాల్లోని నిపుణులు, కార్మీకులు గణనీయమైన కార్మిక లోటును పూడ్చుతున్నారు. భారత రాయబార కార్యాలయం ఇచ్చిన డేటా ప్రకారం ప్రస్తుతం రష్యాలోని భారతీయుల సంఖ్య 14,000 గా ఉంది. అదనంగా, భారత సంతతికి చెందిన దాదాపు 1,500 మంది ఆఫ్ఘన్ జాతీయులు ఉన్నారు.
ఇక ఇటీవలి కాలంలో రష్యాలోని వైద్య, సాంకేతిక సంస్థల్లో సుమారు 4,500 మంది భారతీయ విద్యార్థులు చేరారని తెలుస్తోంది. వారిలో 90 శాతం మంది దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 20 విశ్వవిద్యాలయాలు/సంస్థలలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. మిగిలిన వారు ఇంజనీరింగ్, ఏరోనాటికల్ డిజైనింగ్, కంప్యూటర్ సైన్స్, రవాణా సాంకేతికత, మేనేజ్‌మెంట్, వ్యవసాయం, బిజినెస్/ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ వంటివి చదువుతున్నారు.