
నాకు ఇప్పుడు ఏడవ నెల. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ, నా ముఖం, చేతులు, కాళ్లల్లో ఒక్కసారిగా వాపులు మొదలయ్యాయి. ఇది సాధారణమా లేక ప్రమాదమా?
– లక్ష్మీ, నెల్లూరు.
వాపు అనేది శరీర భాగాలలో ద్రవం నిలిచిపోవడం వల్ల ఏర్పడుతుంది. ఇది గర్భధారణ సమయంలో తరచుగా కనిపించేదే. సాధారణంగా ఎక్కువ సేపు కూర్చోవటం, నుంచోవటం వలన ప్రెగ్నెన్సీలో వస్తుంది. ఎక్కువ ఉప్పు పదార్ధాలు తిన్నా, బరువు ఎక్కువ ఉన్నా, బీపీ మందులు, స్టెరాయిడ్స్, ఇతర మందులు వాడుతున్నా వస్తుంది.
చాలా అరుదుగా కాలేయం, గుండె, మూత్రపిండాల సమస్యల వల్ల కూడా ఈ వాపులు రావచ్చు. ప్రెగ్నెన్సీలో వచ్చే సాధారణ వాపు ఎక్కువగా రాత్రి వేళల్లో కనిపిస్తుంది. ఉదయానికి తగ్గిపోతుంది. కానీ, ఒక్కసారిగా వాపు రావడం, బీపీ పెరగడం, తలనొప్పి, చూపు మసకబారడం వంటివి కనిపిస్తే అది ప్రీ ఎక్లాంప్షియా అంటాం. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
ఈ వాపులు ప్రెగ్నెన్సీలో నెలలు పెరిగే కొద్దీ, ఆ బరువుకి కాళ్లలో రక్త ప్రసరణ తక్కువగా ఉండటంతో వస్తుంది. ఇది తగ్గించుకోవడానికి ఎక్కువ సేపు నిలబడకూడదు. అనుకూలమైన సాక్సులు, చెప్పులు వేసుకోవాలి. బాగా వాకింగ్, వ్యాయామం చేయాలి. ఒకసారి మీరు డాక్టరుని కలిస్తే బీపీ, బరువు అన్నీ పరీక్షించి ఇది నార్మల్ ఏనా కాదా అనేది చెప్తారు.
నేను మూడునెలల గర్భవతిని. చాలా అలసటగా ఉంటుంది. నిద్ర పట్టడం లేదు. నిద్రలో చెడు కలలు ఎక్కువగా వస్తున్నాయి. ఏం చేయాలో చెప్పండి?
– నందిని, సంగారెడ్డి.
ప్రెగ్నెన్సీలో హార్మోన్ల మార్పుల వలన మొదటి మూడు నెలల్లో అలసట, బలహీనత, నిస్సహాయత భావం ఎక్కువగా ఉంటుంది. ఇవి మానసికంగా చాలా ప్రభావితం చేస్తాయి. అందుకే, అన్నింటికీ సమాధానం విశ్రాంతి తీసుకోవటమే. ఈ సమయంలో కాళ్లు రెండు ఎత్తులో పెట్టుకొని కొంచెం విశ్రాంతి తీసుకోవాలి. పోషకాహారం తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం.
నెలలు నిండిన తర్వాత అధిక బరువుతో బలహీనంగా, డల్‌గా ఉంటారు. పొట్ట పెరిగే కొద్దీ నిద్రపట్టడం కష్టం కావచ్చు. దీని వలన బేబీకి ఏ ప్రమాదం ఉండదు. రిలాక్సినేషన్, బ్రీతింగ్ టెక్నిక్స్ పాటించాలి. మృదువైన దిండు వాడటం, నిద్రకు అనుకూలంగా పడుకోవడం చేయ్యాలి.
అంటెర్నల్ క్లాసెస్‌లలో ఇవీ నేర్పిస్తారు. వ్యాయామం చేయటం వలన కాస్త ఉపశమనం లభిస్తుంది. ఆహారం తిన్న తర్వాత తప్పకుండా వాకింగ్ చెయ్యాలి. కొంతమందికి నిద్రలేమితోపాటు అలసట, చిరాకు, నిస్సహాయత భావం, పనుల మీద ఆసక్తి లేకపోవటం ఉంటాయి. ఇవి ఉంటే డిప్రెషన్ కావచ్చు. ఇలాంటి సమయంలో మానసిక వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.
నాకు ఇప్పుడు తొమ్మిదవ నెల. ఒక వారం నుంచి ముక్కు నుండి రక్తం వస్తోంది. ఐస్ ప్యాక్ పెట్టుకోమన్నారు. ఇది సాధారణమేనా? ఏవైనా పరీక్షలు చేయించుకోవాలా?
– మమత, యాదాద్రి.
ప్రెగ్నెన్సీలో ముక్కులో ఉండే రక్తనాళాలు విస్తరించి, సున్నితంగా మారుతాయి. అప్పుడు ముక్కు నుంచి రక్తం రావడం సాధారణమే. ఇది హార్మోన్ల మార్పులు, ఎక్కువ రక్త ప్రసరణ వలన జరుగుతుంది. కొంతమందికి కొన్ని సెకన్ల నుంచి నిమిషాలపాటు రక్తం రావచ్చు. నిద్రలో కూడా ఇలా జరగచ్చు. ఇలా అయినప్పుడు వెంటనే నిటారుగా కూర్చొని, ముక్కు పై భాగాన్ని గట్టిగా మూసివేసి కొన్ని సెంకడ్ల పాటు పట్టుకుంటే తగ్గిపోతుంది.
నోటితో శ్వాసతీసుకోవటం మంచిది. ఐస్‌ప్యాక్ పెట్టుకోవచ్చు. అలా చేసినా తగ్గకపోతే డాక్టర్‌ని కలవాలి. ముక్కుని ఎక్కువ చీదటం, కిందకు వంగటం, వ్యాయామం చేయటం ఒక రెండు రోజులు మానేయాలి. పది నుంచి పదిహేను నిమిషాల్లో తగ్గకపోతే, వెంటనే డాక్టర్‌ని కలవాలి. అలసటగా, బలహీనంగా ఉన్నా డాక్టర్‌ను కలవాలి.
ఆసుపత్రిలో సన్నని గాజుగుడ్డతో నోస్ ప్యాకింగ్ చేస్తారు. తగ్గిన తర్వాత యాంటీసెప్టిక్ క్రీమ్స్ ముక్కు లోపల ఉపయోగించమని చెప్తారు. ఈ క్రీమ్స్ వలన క్రస్టింగ్, మచ్చలు ఏర్పడకుండా ఉంటాయి. కానీ, కొన్ని కేసెస్‌లో బ్లీడింగ్ డిసార్డర్స్ ఉన్నా, రక్తాన్ని పలుచగా చేసే మందులు వాడుతున్నా, ఈ బ్లీడింగ్ ఎక్కువ కావచ్చు. అందుకే వెంటనే ఆసుపత్రికే వెళ్లాలి.
(చదవండి: liposuction: సౌందర్య చికిత్సలు ఇంత డేంజరా..? పాపం ఆ మహిళ..)