అభినవ ఆధ్యాత్మిక తపశ్చక్రవర్తి

 An emotional spiritual manifestation

సందర్భం

పతనావస్థలో ఉన్న భారతీయ సనాతన ధర్మాన్ని పరిరక్షించి ప్రజలందరినీ ఒక్క తాటిమీద నడిపించగల శక్తి ఒక్క అద్వైత మతానికే ఉందనీ, దాంతోనూ ఐక్యతను సాధించవచ్చనీ, అందుకు తన శిష్యులను కూడా సమాయత్తం చేయాలనీ సంకల్పించారు శంకర భగవత్పాదులు. అందులో భాగంగా భారతదేశం నలుమూలలా నాలుగు పరమ పీఠాలను స్థాపించారు. వాటిలో ఒకటి కర్ణాటక రాష్ట్రం చిక్‌మగళూర్‌ జిల్లాలోని శ్రీశృంగేరీ శారదాపీఠం. ఈ పీఠానికి మొట్టమొదటి అధిపతి శ్రీశ్రీశ్రీ సురేశ్వరాచార్య. కాగా శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి 36వ (పస్తుత) అధిపతి. ఉత్తరాధికారి విధుశేఖర భారతీ స్వామివారు. భారతీతీర్థులకు ముందు శ్రీమదభినవ విద్యాతీర్థుల వారు అధిపతిగా ఉన్నారు. నేడు వారి జయంతి. ఈ సందర్భంగా వారి గురించి స్మరించుకుందాం...

 శ్రీ శృంగేరి జగద్గురు పీఠాన్ని అలంకరించిన శ్రీమదభినవ విద్యాతీర్థ మహాస్వామివారు పూర్వపీఠాధిపతుల తేజశ్శక్తులను సంగ్రహించి, సంప్రదాయ సిద్ధంగా మత వ్యాఖ్యానం చేస్తూ, అన్ని తరగతుల వారితోనూ, అన్ని రకాలైన శిష్యులతోనూ, సత్యసాధకులతోనూ, సత్యశోధకులతోనూ సన్నిహితంగా మెలిగారు. ఆదిశంకరుల తర్వాత కాలినడకన మూడుమార్లు భారతదేశమంతటా పర్యటించారు. తమ అనుగ్రహ భాషణంతో, ఆశీర్వచన బలంతో ఛిన్నాభిన్నమైన అనేక జాతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక శక్తులను పోగు చేసి, దేశాన్ని ఏకం చేశారు. బెంగళూరుకు చెందిన కైపు రామశాస్త్రి, వెంకటలక్ష్మి పుణ్యదంపతులకు పింగళ నామ సంవత్సర ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు అనగా 1917 సంవత్సరంలో జన్మించిన శ్రీనివాస శాస్త్రి, అసాధారణ ధారణ శక్తితో, అనన్య సామాన్యమైన శాస్త్రజ్ఞానంతో గురువనుగ్రహంతో ప్రతిష్ఠాత్మకమైన శృంగేరీ పీఠానికి 35వ జగద్గురువు స్థానాన్ని అలంకరించి, ఆ స్థానానికే వన్నె తెచ్చిన మహనీయులు.

దక్షిణ భారతదేశమంతటా అనేకమార్లు సంచరించి, అనేక స్థలాలలో పలు ధర్మకార్యాలను జరిపించారు. విద్వత్సభలను ఏర్పాటు చేశారు. శ్రీ శంకర భగవత్పాదులపై భక్తిని కలిగించేందుకు ‘అఖిల భారత శంకర సేవాసమితి’ అనే సంస్థను స్థాపించారు. శ్రీ శృంగేరీ శంకర మఠ శాఖలను నెలకొల్పారు.   హైదరాబాద్‌లోని నల్లకుంటలోగల శ్రీ శృంగేరి శారదాపీఠం నిత్యనామార్చనలతో, సుప్రభాత సేవలతో, కుంకుమపూజలతో భక్తుల నీరాజనాలందుకుంటూ కొంగుబంగారంగా విలసిల్లుతున్న ఆ చల్లని తల్లి శ్రీశారదాంబ విగ్రహ ప్రతిష్ఠాపన 1960లో శృంగేరీ పీఠాధిపతి పరమగురు శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్థమహాస్వామి దివ్యహస్తాల మీదుగా జరగడం భాగ్యనగర వాసుల భాగ్యంగా చెప్పుకోవచ్చు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top