వెంట ఉండేది ధర్మమొక్కటే! | Dharmaraju test after dark pruning | Sakshi
Sakshi News home page

వెంట ఉండేది ధర్మమొక్కటే!

May 11 2018 12:01 AM | Updated on Jul 11 2019 8:56 PM

Dharmaraju test after dark pruning - Sakshi

కొద్దిసేపట్లోనే సహదేవుడుపడిపోవడం చూచి భీముడు హెచ్చరించగా – ‘సోదరా! మాద్రీ పుత్రుడు పాండిత్య మదపూర్ణుడు’.. అని పలికి వెనక్కి చూడక మిగిలిన వారితో  ముందుకు సాగాడు.

కృష్ణ నిర్యాణం తర్వాత ధర్మరాజు పరీక్షిత్తుకు పట్టం కట్టి విరక్తుడై సర్వం త్యజించి సశరీర స్వర్గప్రాప్తికై ఉత్తర దిశగా పయనమయ్యాడు. ఆహార పానీయాలు వదలి నిర్మోహిౖయె దిక్కులు చూడక, ఎక్కడా నిలవక హిమాలయంలో బదరీనాథం దాటి అవిశ్రాంతంగా ముందుకు సాగిపోతున్నాడు. నలుగురు సోదరులు, ద్రౌపది కూడా ఆయన్ను అనుసరిస్తున్నారు. అందరూ స్వర్గారోహణ దివ్యభూమిని సమీపించారు.
 అక్కడ ద్రౌపది కిందకు పడిపోవడం చూచి భీముడు అన్నగారికి నివేదించాడు. ధర్మారాజు వెనుకకు చూడకనే.. ‘పడిపోనీ, పాంచాలి ప్రవర్తన పక్షపాతమయం’ అంటూ నిర్లిప్తంగా ముందుకు నడిచాడు.
కొద్దిసేపట్లోనే సహదేవుడు పడిపోవడం చూచి భీముడు హెచ్చరించగా – ‘సోదరా! మాద్రీ పుత్రుడు పాండిత్య మద పూర్ణుడు’.. అని పలికి వెనక్కి చూడక మిగిలిన వారితో ముందుకు సాగాడు. తర్వాత నకులుని పతనం తెలపగా ధర్మరాజు – ‘భీమా! అతనికి తాను అందరికంటే అందగాడిననే అహంకారం. అందుకే పడిపోయాడు’ అని వెనుతిరుగకనే వివరించాడు.

ఇంతలోనే పాండవ మధ్యముని పతనం ప్రారంభమవగా భీముడు భయం–భయంగా, అన్నా! మన ప్రియతమ సోదరుడు గాండీవధారి పార్థుడు కూడా పడిపోతున్నాడని చెప్పగా యుధిష్ఠిరుడు.. ‘పడనీ. నేను గొప్ప విలుకాడినని, విజయుడు ఎప్పుడూ విర్రవీగేవాడు’ అంటూ ముందుకు సాగాడు.చివరకు ‘అన్నా! నేనూ పడిపోతున్నా అడ్డుపడమ’ని భీముడు ఆక్రోశించగా.. ‘భీమా! నువ్వొక పెద్ద తిండిపోతువి. ఈ లోకంలో నాకన్నా బలవంతుడు లేడని నీకు అహంకారం. దురభిమానికి పతనం తప్పదు’ అంటూ ఆగక సాగిపోయాడు. (అందుకే కదా ‘అహంకారం సురాపానం’.. అంటే అహంకారం మద్యపానంతో సమానమని శాస్త్రం హెచ్చరించింది). మృతునికి ధర్మమే మిత్రము. ధనాన్ని భూమిలో, బీరువాలలో, బ్యాంకులలో; పశువుల్ని గొడ్ల పాకల్లో, భార్యను ఇంటి గుమ్మంలో, బంధుమిత్రులను శ్మశానంలో; దేహాన్ని చితి మీదను, గోతిలో వదలి జీవుడు పరలోక మార్గంలో పోయేటప్పుడు ధర్మమొక్కటే అతని వెంట ఉంటుంది.
– డి.వి.ఆర్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement