అనుగ్రహానికి అన్నం నైవేద్యం

Delicious Dishes In Andhra pradesh Cultural - Sakshi

అమ్మ అంటేనే అనుగ్రహించేది అని అర్థం. దుర్గమ్మ తల్లి తన భక్తులను బిడ్డలుగా భావించి సదా అనుగ్రహిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ పిల్లలు తమ సంతృప్తి కోసం తల్లికి ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా పెడుతుంటారు. ఆపై ప్రసాదంగా స్వీకరిస్తారు. నవరాత్రుల సందర్భంగా బియ్యంతో చేసే ఈ నైవేద్యాలను చేయండి. అనుగ్రహాన్ని పొందండి.

పరమాన్నం
కావలసినవి: బియ్యం – కప్పు; పంచదార – 4 కప్పులు; పాలు – 2 కప్పులు; నెయ్యి – టేబుల్‌ స్పూను; జీడిపప్పు – 10; కిస్‌మిస్‌ – గుప్పెడు; కొబ్బరి తురుము – పావు కప్పు; ఏలకుల పొడి – అర టీస్పూను.

తయారి:
►బియ్యం శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి
►పాలు స్టౌ మీద పెట్టి, మరుగుతుండగా అందులో బియ్యం పోసి బాగా కలపాలి
►బాగా ఉడికిన తరువాత పంచదార వేసి కలిపి కొద్దిసేపు స్టౌ మీదే ఉంచాలి
►బాణలిలో నెయ్యి వేసి కాగాక జీడిపప్పు, కిస్‌మిస్‌ వేసి వేయించి తీసేయాలి
►ఉడుకుతున్న పరమాన్నంలో పచ్చి కొబ్బరి తురుము, వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌లను వేసి బాగా కలపాలి
►ఏలకుల పొడి వేసి బాగా కలిపి దించేయాలి
►ఈ ప్రసాదం తింటే సాక్షాత్తు అన్నపూర్ణాదేవి ఆశీర్వదించినట్లే.

బెల్లం అన్నం
కావలసినవి: బియ్యం – కప్పు; బెల్లం పొడి – కప్పున్నర; నెయ్యి – టేబుల్‌ స్పూను; కొబ్బరి ముక్కలు – అర కప్పు (నేతిలో వేయించాలి); పచ్చ కర్పూరం – టీ స్పూను; ఏలకుల పొడి – అర టీ స్పూను.

తయారి:
►ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి రెండున్నర కప్పుల నీళ్లు జత చేసి ఉడికించాలి
►అన్నం పూర్తిగా ఉడికిన తరువాత బెల్లం పొడి వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించాలి
►ఏలకుల పొడి వేసి బాగా కలపాలి
►నెయ్యి, వేయించిన కొబ్బరి ముక్కలు, పచ్చ కర్పూరం వేసి బాగా కలిపి దించేయాలి
►వేడివేడిగా తింటుంటే సాక్షాత్తు మహిషాసుర మర్దని ప్రత్యక్షం కావలసిందే.

కదంబం
కావలసినవి: బాస్మతి బియ్యం – రెండు కప్పులు; క్యారట్, బీన్స్, పచ్చి బఠాణీ, క్యాప్సికమ్, ఉల్లికాడలు, ఉల్లిపాయలు, బంగాళ దుంప, మెంతి కూర, పుదీనా – అన్ని ముక్కలు కలిపి ఒక కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 4; ఏలకులు – 2; లవంగాలు – 2; దాల్చినచెక్క – చిన్న ముక్క; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – చిన్న కట్ట; ఉప్పు – తగినంత; నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు; జీడి పప్పు – గుప్పెడు; కిస్‌మిస్‌ – టేబుల్‌ స్పూను; దానిమ్మ గింజలు – టేబుల్‌ స్పూను.

తయారి:
►ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి నాలుగు కప్పుల నీళ్లు పోసి ఉడికించి పక్కన ఉంచాలి
►బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వరుసగా వేసి కొద్దిగా వేయించాలి
►తరిగి ఉంచుకున్న కూర ముక్కలు, కరివేపాకు వేసి పచ్చి పోయేవరకు వేయించి తీసేయాలి
►ఒక పెద్ద పాత్రలో అన్నం వేసి విడివిడిలాడేలా చేయాలి
►కూర ముక్కలు, ఉప్పు వేసి కలపాలి
►జీడి పప్పు, కిస్‌మిస్, దానిమ్మ గింజలు జత చేసి బాగా కలపాలి
►కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి
►ఉల్లి రైతా కాంబినేషన్‌లో తింటే శాకంభరీదేవి ప్రత్యక్షం కావలసిందే.

పెసర పొడి పులిహోర
కావలసినవి: పెసర పప్పు – 4 టీ స్పూన్లు; అన్నం – 2 కప్పులు; ఎండు మిర్చి – 3 + 3; పసుపు – కొద్దిగా; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను + ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; పల్లీలు – రెండు టేబుల్‌ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్‌ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 4; కరివేపాకు – 2 రెబ్బలు; ఉప్పు – తగినంత.

తయారి:
►స్టౌ మీద బాణలిలో పెసరపప్పు వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి
►అదే బాణలిలో ఎండు మిర్చి వేసి వేయించుకోవాలి
►చల్లారాక అందులో సరిపడా ఉప్పు, జీలకర్ర ఇంగువ వేసి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి
►రెండు కప్పుల అన్నాన్ని ఒక పాత్రలోకి తీసుకుని ఇందులో నాలుగు టీ స్పూన్ల పెసర పొడి, ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక స్పూను నూనె వేసి కలపాలి
►స్టౌ మీద బాణలిలో పులిహోర పోపు కోసం నూనె వేసి కాగాక, అందులో ఘుమఘుమలాడేలా ఇంగువ, పచ్చి సెనగ పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించాలి
►పెసర పొడి వేసిన అన్నానికి పోపు జత చేయాలి
►అంతా ఒకసారి బాగా కలియబెడితే పెసర పొడి పులిహోర రెడీ.

పెరుగన్నం లేదా దద్ధ్యోదనం
కావలసినవి: బియ్యం – రెండు కప్పులు; అల్లం – చిన్న ముక్క; పచ్చి మిర్చి – 10; ఎండు మిర్చి – 5; సెనగ పప్పు – టీ స్పూను; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – చిన్న కట్ట; దానిమ్మ గింజలు – టేబుల్‌ స్పూను; చిన్న ద్రాక్ష లేదా కిస్‌మిస్‌ ద్రాక్ష – కప్పు; చెర్రీ ముక్కలు – టీ స్పూను; టూటీ ఫ్రూటీ ముక్కలు – టీ స్పూను; జీడి పప్పులు – 10; నెయ్యి – టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత

తయారీ:
►ముందుగా బియ్యం కడిగి నీళ్లు ఒంపేసి,  ఐదు కప్పుల నీరు జత చేసి ఉడికించాలి
►అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తగా దంచి పక్కన ఉంచాలి
►బాణలిలో నెయ్యి వేసి కాగాక పచ్చి సెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి
►ఒక పెద్ద పాత్రలో అన్నం వేసి, అందులో వేయించిన పోపు సామాను వేసి బాగా కలపాలి
►తగినంత ఉప్పు జత చేసి మరోమారు కలపాలి
►చివరగా దానిమ్మ గింజలు, దానిమ్మ గింజలు చిన్న ద్రాక్ష లేదా కిస్‌మిస్‌ ద్రాక్ష, చెర్రీ ముక్కలు, టూటీ ఫ్రూటీ ముక్కలు, జీడి పప్పులు వేసి బాగా కలపాలి
►పుల్లగా ఉండే నిమ్మకాయ ఊరగాయతో అందిస్తే ప్రసాదాన్ని కూడా అన్నంలా తినేస్తారు.

ఉప్పు పొంగలి లేదా కట్‌ పొంగల్‌
కావలసినవిః బియ్యం – కప్పు; పెసర పప్పు – కప్పు; జీలకర్ర – టీ స్పూను; మిరియాల పొడి – టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – తగినంత; నెయ్యి – 4 టేబుల్‌ స్పూన్లు; జీడిపప్పు – గుప్పెడు.

తయారి:
►ముందుగా ఒక గిన్నెలో బియ్యం, పెసర పప్పు వేసి నీళ్లతో బాగా కడిగి నీరు ఒంపేయాలి
►ఆరు కప్పుల నీరు జత చేసి, కుకర్‌లో ఉంచి, నాలుగు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి
►బాణలిలో నెయ్యి వేసి కరిగాక ముందుగా జీలకర్ర వేసి చిటపటలాడించాలి
►మిరియాల పొడి వేసి వేగుతుండగానే, జీడిపప్పు వేసి బాగా వేయించాలి
►కరివేపాకు వేసి వేయించి వెంటనే దించేయాలి
►ఉడికించుకున్న బియ్యం పెసరపప్పు మిశ్రమాన్ని గరిటెతో మెత్తగా మెదిపి, ఉప్పు జత చేయాలి
►నేతిలో వేయించి ఉంచుకున్న పదార్థాలను వేసి బాగా కలిపి వేడివేడిగా వడ్డించాలి
►అల్లం పచ్చడి, కొబ్బరి చట్నీల కాంబినేషన్‌తో ఈ ప్రసాదానికి రెట్టింపు రుచి వస్తుంది.

పులిహోర
కావలసినవి: బియ్యం – 4 కప్పులు; చింత పండు – 100 గ్రా.; పచ్చి సెనగ పప్పు – టేబుల్‌ స్పూను; మినప్పప్పు – టేబుల్‌ స్పూను; ఆవాలు – 2 టీ స్పూన్లు; జీలకర్ర – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 15; పచ్చి మిర్చి – 10; కరివేపాకు – 4 రెమ్మలు; వేయించిన పల్లీలు – 2 టేబుల్‌ స్పూన్లు; నువ్వుల పొడి – 2 టేబుల్‌ స్పూన్లు (నువ్వులు వేయించి పొడికొట్టాలి); జీడి పప్పులు – 15; నూనె – 100 గ్రా.; ఇంగువ – టీ స్పూను; పసుపు – టీ స్పూను; ఉప్పు – తగినంత.

తయారి:
►ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి, నీరు ఒంపేసి, తగినన్ని నీళ్లు జత చేసి బియ్యం ఉడికించాలి
►ఉడికిన అన్నాన్ని వేడిగా ఉండగానే ఒక పెద్ద పళ్లెంలోకి తిరగబోసి, గరిటెతో పొడిపొడిగా అయ్యేలా కలపాలి
►ఒక గిన్నెలో చింతపండులో తగినంత నీరు పోసి నానబెట్టి, రసం తీసి పక్కన ఉంచుకోవాలి
►బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వరుసగా వేసి దోరగా వేయించాలి
►చింతపండు పులుసు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి, ఉడికించి దించేయాలి
►అన్నంలో చింతపండు రసం, పోపు మిశ్రమం వేసి బాగా కలపాలి
►నువ్వుల పొడి, పల్లీలు, జీడి పప్పులు వేసి బాగా కలిపి సుమారు గంటసేపు ఊరిన తరవాత తింటే ప్రసాదాన్ని రుచిగా ఆస్వాదించవచ్చు.

కొబ్బరి అన్నం
కావలసినవి: బియ్యం – 2 కప్పులు; కొబ్బరి తురుము – 2 కప్పులు; పచ్చి మిర్చి – 10; పచ్చి సెనగపప్పు – టేబుల్‌ స్పూను; మినప్పప్పు – టేబుల్‌ స్పూను; ఆవాలు – టీ  స్పూను; జీలకర్ర – టీ స్పూను; ఎండు మిర్చి – 6; పల్లీలు – టేబుల్‌ స్పూను (వేయించినవి); అల్లం ముక్కలు – టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; జీడి పప్పు – గుప్పెడు (నేతిలో వేయించాలి); నెయ్యి – టేబుల్‌ స్పూను; నిమ్మకాయ – 1; ఉప్పు – తగినంత; నూనె – టేబుల్‌ స్పూను; కొత్తిమీర – కొద్దిగా

తయారి:
►బియ్యం శుభ్రంగా కడిగి, 3 కప్పుల నీళ్లు జత చేసి ఉడికించాలి
►అన్నం వేడిగా ఉండగానే పెద్ద పళ్లెంలో వేసి విడివిడిలాడేలా కలపాలి
►బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి
►కొబ్బరి జత చేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాక, ఉప్పు వేసి కలపాలి
►అన్నం జత చేసి బాగా కలిపి, దించే ముందు నిమ్మ రసం పిండాలి
►వేయించిన పల్లీలు, నేతిలో వేయించిన జీడిపప్పులు వేసి బాగా కలపాలి
►కొత్తిమీరతో అందంగా అలంకరించితే నోరూరించే కొబ్బరి అన్నం ప్రసాదం తినడం కోసం తొందరపడక తప్పదు.
– నిర్వహణ:
డా. వైజయంతి పురాణపండ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top