ఇరుకు దారి

A Deep Canal Flows Between The Two Villages - Sakshi

చెట్టు నీడ

రెండు గ్రామాల మధ్య లోతైన కాలువ ప్రవహించేది. ఆ గ్రామాల మధ్య రాకపోకల కోసం రెండు గట్లు  కలుపుతూ సన్నని తాటిచెట్లు వంతెనలా వేసి వాటి మీదుగా నడిచేవారు గ్రామస్తులు. ఒకసారి ఆ మార్గంలో ప్రయాణిస్తున్న ఇద్దరు పండితులు దుంగ మీద ఎదురయ్యారు. ఇరుకైన దారి కనుక ఎవరో ఒకరు వెనక్కు వెళ్లాలి.  ‘‘ముఖ్యమైన పనిమీద వెళుతున్నాను. దారి విడుస్తారా’’ అన్నాడు ఒక పండితుడు దర్పంగా. ‘‘పెద్దవాళ్లను  గౌరవించాలన్న సంస్కారం లేదా? నువ్వే అడ్డు తప్పుకో’’ అన్నాడు రెండో పండితుడు. ‘‘వయసు విషయం పక్కన పెట్టండి. సకల శాస్త్రాలు అధ్యయనం చేసి, పాతిక గ్రంథాలు రచించిన వాణ్ణి’’ అని గొప్పతనం చెప్పాడు మొదటి పండితుడు. అలా ఇద్దరూ పంతాలకు పోతున్నారు. వాళ్లకు మరి కొంత దూరంలో సన్నని వంతెన ఉన్న విషయం గమనించలేదు పండితులు. అది చూసి  ‘అరే!’ అని మనసులో అనుకున్నారు కానీ అహంభావం అడ్డు వచ్చి ఇద్దరూ వెనక్కు తగ్గలేదు.

కొంతసేపటికి రెండు కుక్కలు ఆ మార్గంలో వెళుతూ పండితులు ఎదురయినట్టే  రెండూ వంతెన దుంగల మీద ఎదురయ్యాయి.కుక్కల వైపు చూసి ‘‘కొత్త కుక్క కనబడితే మరో కుక్క అరచి కలబడుతుంది. ఇప్పుడు దారి వదలమని కరుచుకుంటాయేమో’’ అనుకున్నారు పండితులు.అయితే ఆ రెండు కుక్కలూ అరుచుకోలేదు. కలబడి కరుచుకోలేదు. వాటి భాషలో ఏవో  మాట్లాడుకున్నాయి. వెంటనే ఒక కుక్క దుంగల మీద ముందరి కాళ్లు పొడుగ్గా పరచి పడుకుంది. రెండోది దాని మీదుగా నడిచి వెళ్లింది. అప్పుడు రెండో కుక్క లేచి ముందుకు వెళ్లిపోయింది. ఆశ్చర్య పోవడం పండితుల వంతయింది. విలువైన సమయం వృథాకి ఇరుకైన దారి కారణం కాదని, ఇరుకైన హృదయాలే కారణమని, సంకుచితంగా ఆలోచించామని సిగ్గుపడ్డారు పండితులు.
  – ఉమా మహేశ్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top