breaking news
uma mahesh
-
WC: ఏపీ షూటర్ ఉమామహేశ్ ఖాతాలో రెండో స్వర్ణం
గ్రనాడా (స్పెయిన్): ప్రపంచకప్ జూనియర్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ షూటర్ మద్దినేని ఉమామహేశ్ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది. సోమవారం జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఉమామహేశ్ బంగారు పతకం నెగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. మంగళవారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో కూడా పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో ఉమామహేశ్–ఇషా తక్సాలె (భారత్) జోడీ 16–8 పాయింట్ల తేడాతో అన్వీ రాథోడ్–అభినవ్ షా (భారత్) జంటను ఓడించి విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో ప్రస్తుతం భారత్ 3 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలతో టాప్ ర్యాంక్‌లో ఉంది. -
నాన్న ఎక్కుపెట్టిన గన్!
(బోణం గణేష్, సాక్షి ప్రతినిధి) : ఐదు కేజీల తుపాకీని చేత్తో పట్టుకుని.. 20 కేజీల బరువును ఒంటిపై మోస్తూ.. యాభై మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను గురి చూసి కొట్టడమంటే అంత తేలికైన విషయం కాదు. ఆ తుపాకీ నుంచి వచ్చే బుల్లెట్‌కు ఉన్నంత పవర్ దానిని పట్టుకున్న వ్యక్తికీ ఉండాలి. అత్యంత ఏకాగ్రతతో కఠోర సాధన చేస్తే తప్ప ఇలాంటి అద్భుతాలు సాధ్యం కావు. షూటర్‌గా 15 ఏళ్ల వయసులోనే జాతీయ స్థాయిలో ఒకేసారి ఇరవై ఈవెంట్లలో పాల్గొని వరల్డ్ రికార్డు సృష్టించిన విజయవాడకు చెందిన మద్దినేని ఉమా మహేశ్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ. ఆయన మాటల్లోనే.. నాన్న ప్రోత్సాహంతో తొలి అడుగు ఆరేడేళ్ల వయసు నుంచే నాన్న రామకృష్ణ ప్రోత్సాహంతో క్రీడలను సీరియస్‌గా తీసుకున్నాను. తొలుత క్రికెట్, కరాటే, బాస్కెట్‌బాల్ నేర్చుకున్నాను. పలు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని.. విజేతగా కూడా నిలిచాను. మా నాన్న సూచనతో 2017 నుంచి షూటింగ్‌పై దృష్టి సారించాను. మొదట గుంటూరులో శిక్షణ తీసుకున్నాను. 2018లో ఢిల్లీ వెళ్లి దీపక్ దూబియా వద్ద శిక్షణ మొదలుపెట్టాను. అప్పటి నుంచి పలు పోటీల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబరిచాను. జూనియర్ వరల్డ్‌కప్‌లో గోల్డ్ మెడల్.. ప్రముఖ షూటర్, ఒలింపిక్ పతక విజేత గగన్ నారంగ్ పూణేలో నిర్వహించే శిక్షణకు ఎంపికయ్యాను. దేశవ్యాప్తంగా కేవలం ఐదుగురినే ఆయన ఎంపిక చేసుకుంటారు. అప్పటి నుంచి నేహా దూబియా నాకు పర్సనల్ కోచ్‌గా ఉన్నారు. ఆమె శిక్షణలో 2022 షూటింగ్ జూనియర్ వరల్డ్‌కప్‌లో గోల్డ్‌మెడల్ సాధించాను. నాలుగు సార్లు ‘ఖేలో ఇండియా’లో పాల్గొన్నాను. యూనివర్సిటీలు, స్కూల్ నేషనల్స్‌లోనూ గోల్డ్ మెడల్స్ వచ్చాయి. 15 ఏళ్ల వయసులో భోపాల్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో 20 ఈవెంట్స్‌లో పాల్గొని వరల్డ్ రికార్డ్ సాధించాను. వరల్డ్ చాంపియన్‌షిప్, ఏసియన్ చాంపియన్íÙప్లోనూ మెడల్స్ వచ్చాయి. షూటింగ్ క్రీడలో ఇంత చిన్న వయసులో అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన ఏపీ ఆటగాడిని నేనొక్కడినే. ఇంటి కష్టం కన్నా గన్ బరువే ఎక్కువని తెలుసు ఈ ఆట కోసం 25 కేజీల బరువును దాదాపు గంటన్నర పాటు మోయాలి. గన్ బరువే 5 కేజీలుంటుంది. నా ప్రతిభ వెనుక అమ్మ మంజుల, నాన్న రామకృష్ణ కష్టం చాలా ఉంది. చిన్న వ్యాపారం చేసుకునే మా నాన్నే దగ్గరుండి నాకు కావాల్సినవన్నీ చూసుకునేవారు. షూటింగ్‌కు ఏకాగ్రత చాలా ముఖ్యం. అది దెబ్బతినకూడదని ఇంటి ఇబ్బందులు, ఆరి్థక పరిస్థితి గురించి నాకు చెప్పేవారు కాదు. ఆటల్లో పడి చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ప్రస్తుతం ఇంజనీరింగ్ చేస్తున్నాను. జర్మనీలో బొండెస్లేగా లీగ్‌లు జరుగుతుంటాయి. ఒక్కో క్లబ్ ఒక విదేశీ ఆటగాడిని ఎంపిక చేసుకుంటాయి. ఈ ఏడాది భారత్ నుంచి నన్ను ఒక్కడినే తీసుకున్నారు. ఐదు ఒలింపిక్స్ ఆడిన హంగేరీ కోచ్ పీటర్ సీడీ నన్ను అక్కడికి తీసుకువెళ్లారు. తమ దేశం తరఫున ఆడాలని జర్మనీ క్లబ్‌లు అడిగాయి. కానీ మన దేశం తరఫున ఆడి గెలవడమే నాకు ఇష్టం. ‘ఆడుదాం ఆంధ్రా’ గొప్ప కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా బాగుంది. ఈ కార్యక్రమం ద్వారా విజేతలకు భారీగా బహుమతులను అందించడం, క్రీడా సామగ్రిని సమకూర్చడం గొప్ప విషయం. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని తమలోని క్రీడా ప్రతిభను చాటి చెప్పాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి క్రీడాకారుల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. ఆర్థిక చేయూతనిస్తే.. అద్భుత విజయాలు సాధిస్తా 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ శిక్షణకు రోజుకు కనీసం రూ.10 వేలు ఖర్చుయ్యేది. నాకు గన్ కూడా లేదు. కొత్తది కొనాలంటే రూ.15 లక్షల వరకు అవసరం. దీంతో పోటీలకు పది రోజుల ముందే వెళ్లి గన్ను అద్దెకు తీసుకుని ప్రాక్టీస్ చేసేవాడిని. ఓల్డర్ కంపెనీ గన్స్నే షూటర్స్ ఎక్కువగా వాడుతుంటారు. ఆ కంపెనీ సీఈవో జర్మనీలో తమ సంస్థను సందర్శించేందుకు నన్ను ఆహ్వానించారు. ఆ కంపెనీ వాళ్లు నా కోసం ప్రత్యేకంగా గన్ను సిద్ధం చేశారు. కానీ దాన్ని కొనగలిగేంత ఆరి్థక స్థోమత మాకు లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరి్థకంగా చేయూతనిస్తే మరిన్ని అద్భుత విజయాలు సాధిస్తాను. భారత్ తరపున ఒలింపిక్స్ ఆడి గెలవాలనేది నా లక్ష్యం. -
మల్లెల తీరం
‘‘మల్లీ మల్లీ గాల్లో మేగమై తేలుతున్నది ....’’ పరభాషా గాయకుడి తెలుగుపాట మైకులోంచి వస్తోంది. ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరపు బీచ్ రోడ్లో వాలుజడేసుకున్న ‘అమ్మగార్ల’ గురించి మల్లిగాడి కళ్ళు చురుగ్గా వెతుకుతున్నాయి. మల్లి –అతని బయో డేటా అతనికి ప్రిపేర్ చేసుకోవడం రాదుగానీ, వస్తే, వయసు–పదకొండు, చదువు సర్కార్ స్కూల్లో ఆరు. తండ్రి – పైడిరాజు, భవన నిర్మాణ కూలీ. తల్లి– చంద్రి, పనిమనిషి. చంద్రి చిన్నప్పుడు మల్లెతోటలో పూలు కోసేది. వస్తూ వస్తూ రైతిచ్చిన గుప్పెడు పూలు కండువా కొంగుకి ముడేసి ఇంటికి తెస్తే వాళ్ళమ్మ దండ గుచ్చి ఓ ముక్క తను పెట్టుకుని మరో ముక్క చంద్రి తల్లో దోపేది. అలా తనకి చిన్నప్పటినుంచి మల్లెపూలంటే విపరీతమైన ఇష్టం. అందుకే కొడుకు పుట్టినా ‘మల్లి’ అనే పెట్టాలని పట్టుబట్టింది. అతికష్టం మీద రిజిస్టర్ లో ‘మల్లిఖార్జున’ అని మాత్రం రాయించగలిగేడు పైడిరాజు. తప్పెవరిదో తెలియదు కానీ, మల్లెపూలంటే ఠక్కుమని అందరికీ గుర్తొచ్చేది శృంగారం. నిజానికి మండు వేసవిలో మల్లెల్ని చూస్తే అదో ఆహ్లాదం. తోటలు పెంచే రైతులు, పూలు కోసే ఆడకూలీలు, టోకున కొనే పూల కొట్టోళ్ళు, వాళ్ళకి రోజువారీ వడ్డీకి పెట్టుబడి పెట్టేవాళ్ళు, మూరల్లో అమ్మే ‘అమ్మ’లు, అమ్మల కష్టాన్నీ తగ్గించాలనుకునే కుర్రాళ్ళు, తెల్లవారితే వాడిపోయే లాభాలు–ఇంత మానవీయకోణం ఉంది ఆ తెల్లటి పూలవెనుక. చదువుకి, సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధం లేదని కారులోంచి అరటిపండు తొక్క విసిరేసే వాళ్ళు ఎలా ప్రూవ్ చేస్తారో, ఒక్క బిడ్డతో ఆపేసి చంద్రి మరోలా ప్రూవ్ చేసింది. పైడిరాజు ఆదాయం, కమిషన్ పోను రోజుకి మూడువందల ఏభై, సగటున నెలకి ఇరవై రోజుల పని. చినవాల్తేర్ లో ఆరు పోర్షన్ల ఆస్బెస్టాస్ ఇంట్లో ఓ గదిపట్టు వాటాకి పదిహేనొందలు అద్దె. నాలుగిళ్ళలో పనిచేసే చంద్రి సంపాదన మూడువేలూ అమ్మగార్ల దగ్గర ఇన్సా›్టల్మెంట్లో కొన్న పాత టి.వి కో, పాడిన చీటీలకో కడుతూ ఉంటుంది. పైడిరాజుకి ప్రతీ శుక్రవారం పేమెంట్. వారంలో ఆ ఒక్కరోజూ, ముగ్గురూ చాలా సంతోషంగా గడుపుతారు. పైడిరాజు వస్తూ వస్తూ తెల్ల కవర్లో మూర మల్లెపూలు, నల్ల కవర్లో పావుకేజీ చికెన్, కొడుక్కి ఓ పకోడీ పొట్లం, తనకో క్వార్టర్, తెచ్చే ప్రతీ శుక్రవారం వాళ్లకి పండగే. ఈ నాలుగింటి ఖర్చు సుమారు నూటఏభై. ఆనందం విలువెంత అంటే మేధావులు తడుముకోవచ్చేమో కానీ మల్లిగాడు మాత్రం నూటేభై అని ఠక్కున చెప్తాడు. ఆరోజు చంద్రి చక్కగా ముస్తాబై, ముగ్గురూ కబుర్లు చెప్పుకుంటూ అన్నం తిని, టి.వి చూస్తూ గడుపుతారు. అందుకే పిల్లలందరూ ఆదివారం ఇష్టపడితే వాడికి మాత్రం శుక్రవారం అంటే మహా ఇష్టం. తట్టలు తట్టలు ఇటుకలు మోసే ఆ తండ్రి చేతులు ఆటలతో అలసిపోయిన వాడి కాళ్ళు పడుతూ ఉంటే, గుట్టలు గుట్టలుగా అంట్లు తోమే ఆ తల్లి చేతులు వాణ్ణి జోలపాడతాయి. అలాంటి ఓ శుక్రవారం గాజుల్లేని ఆమె చేతుల్ని మల్లిగాడు అదేపనిగా గమనించడం చూసి, చంద్రి భర్తతో ‘‘ఏమయ్యో, వచ్చేవారం పూలు కొనమాక. మంగళవారం పోలమాంబ తీర్థంలో గాజులేయించుకుంటా’’ అంది. ప్రేమెక్కువైనచోట సొంతవసరాలెప్పుడూ వెనక సీటే. ఇవన్నీ చూసి, వాడి తోటివాళ్లంతా న్యూస్ పేపర్లు వెయ్యటానికో, బ్రాందీ కొట్లోనో, మరోచోటో పనిచేస్తున్నట్టే తానూ పన్లోకెళ్తానమ్మా అని ఎప్పుడైనా మల్లిగాడంటే, చంద్రి ఒకటే మాట చెప్తుంది. ‘‘మల్లీ, కరివేపాకు మొక్క అడుగంతున్నప్పుడూ, ఆరు మీటర్లయినాకా, దాని ఆకు రుచి ఒకటే. మొక్కగా ఉన్నప్పుడు కోసేస్తే ఎదగడం ఆగిపోద్ది లేదా ఒక్కరికే సరిపోద్ది. అదే ఓపిగ్గా ఎదగనిస్తే వంద మందికి పనికొస్తాది’’ అంటుంది నవ్వుతూ. అర్ధం కాకపోయినా అమ్మ చెప్పింది కాబట్టి వింటాడు మల్లిగాడు. ఆ తర్వాతి ఆదివారం. సూరి మల్లిగాడి ఫ్రెండ్. వాడు బీచ్‌లో పూలమ్ముతాడు. వాడితోబాటు పూలమ్మే ఇంకో కుర్రాడు జ్వరమని రాలేదు. అందుకే మల్లిగాణ్ణి తనతో తీసుకెళ్లాడు. ‘‘ఒరే మా యమ్మకి తెలిసిందంటే తంతాదిరా, నేను రానురా’’ అంటున్నా, ‘‘ఎహె, మీ యమ్మకి తెల్దు రా, ఈ రోజు ఆదివారం కదా, గిరాకీ బాగుంటాది. ఆరింటికి పదిమూర్లేసుకెళ్తే ఓ గంటలో అమ్మేసి ఇంటికెళ్లిపోవచ్చు. మూరకి ఐదు మిగుల్తాది’’ అంటూ మల్లిగాణ్ణి బలివిన లాక్కెళ్లాడు. అది పెద వాల్తేరు జంక్షన్లో ఓ పూల కొట్టు. ఓనరు పూల దండలు కడుతూ బిజీగా ఉన్నాడు. సూరి రెండు మూడు సార్లు పిలిచిన తర్వాత విసుక్కుంటూ, పది మూరల మల్లెపూల దండ కొలిచి, ఓ పాత బ్లేడ్ విరిపి ముక్క చేసిచ్చి, ‘‘ఏరా ఇంకోడేడీ , ఈడెవడు’’ అంటూ ఒకే ఆన్సర్ వచ్చే రెండుప్రశ్నలు వేసి కట్టిన దండలకి ముచ్చి దారంతో మెరుపులద్దే పనిలోపడ్డాడు. ‘‘అన్నా, ఆడు జొరవని రాలేదన్నా, ఈడిదీ మా పేటే అన్నా, ఇయాల ఈడికియ్యన్నా’’ అంటూ బతిమిలాడాడు సూరి. ‘‘ఈడు ఈ పనికి కొత్తలాగున్నాడు కదరా? సరే, ఈసారికి ఐదెత్తుకెళ్ళమను, అయి చెల్లితే, సూద్దారి’’ అంటూ ఓ ఐదు మూరలు కొలిచి కొట్టు కిందనున్న సామాన్లు వెతికి ఓ చిన్న పూలతట్ట, సూరిగాడికివ్వగా మిగిలిన బ్లేడ్ ముక్కా తీసిచ్చాడు. ‘‘ఒరే డబ్బులకి నీదే పూచీ, రేప్పొద్దున్న తెచ్చియ్యాలా. తెలిసిందా, ఎల్లండి టైమవుతోంది’’ అంటూ కట్టిన దండలమీద నీళ్ళు జల్లి మేకులకి తగిలించుకోసాగాడు. సాయంత్రం అయిదున్నర కావస్తోంది. ఇద్దరూ పూలతట్టలు పట్టుకుని వుడా పార్క్ మీదుగా బీచ్ కి హుషారుగా నడవసాగారు. డ్యూటీ దిగే సైనికుడు ఎక్కే సైనికుడికి హ్యాండ్ ఓవర్ చేసే ఆయుధాల్లా సూర్య కిరణాలు వాళ్ళ మీద ఏటవాలుగా పడుతున్నాయి. సూరి వాడికున్న సీనియారిటీతో మల్లిగాడికి ధైర్యం చెబుతున్నాడు. ‘‘ఒరే, ఇయాల ఆదివారం. బీచ్ మొత్తం కలకల్లాడిపోద్ది. అయిదు మూరలూ అరగంటలో అమ్మేత్తావు. మూర పాతిక జెప్పి ఇరవైకమ్ము. ఐదు పదేన్లు ఓనర్ కి జమేత్తే నీకు గంటలో పాతిక మిగుల్తాది. ఓనర్ సేత్తో కొలిసిన మూరకి, నీ సేత్తో కొలిసే మూరకి తేడాలో నీకో అరమూర మిగుల్తాది. అదో పది. మొత్తం ముప్పై ఐదు. రేపు మార్నింగ్ షో టికెట్‌కి సరిపోతాయి’’ అంటూ బిజినెస్ పాఠాలన్నీ పామ్ బీచ్ హోటల్ దగ్గరకొచ్చేసరికి చెప్పేసాడు. సూరిగాడు ఊరించిన సినిమా టెంప్టింగ్ గా ఉన్నా, ఆ ముప్పైఐదుతో మంగళవారం తీర్థంలో అమ్మకి గాజులు కొనొచ్చనే ఊహ మల్లిగాడి సినిమా సరదాని వెనకసీట్లోకి నెట్టింది. అంతే మల్లిగాడు మొదటిసారిగా వాళ్ళమ్మకిష్టమైన మల్లెపూల తట్టనెత్తుకుని వ్యాపారానికి బయల్దేరాడు. వాడికి ఇన్సి్పరేషనా అన్నట్టు బీచ్‌కి కొద్దిపాటి దూరంలో విదేశాల నుంచి వచ్చిన ఓడలు బొగ్గు దింపుతూ, వెళ్ళే ఓడలు కంటైనర్లలో రొయ్యలు పంపుతూ బిజీ గా ఉన్నాయి. బీచ్ రోడ్డెక్కేసరికి ఆరయ్యింది. ఆదివారం కావటంతో అప్పటికే కిలోమీటర్ మేర గ్రానైట్ గట్టంతా జనంతో నిండిపోయింది. ఫుట్ పాత్ మొత్తం ఐస్ క్రీంలు, మురీ మిక్సర్లు, మావిడికాయ ముక్కలు, వేరుశెనగ పప్పు బళ్ళతో నిండిపోయింది. ఆక్వేరియంలో ఆర్నమెంటల్ ఫిష్‌లా గట్టుమీద మనుషులు, ఏరోజు వల తప్పించుకుంటే ఆరోజు గడిచినట్టే అనుకునే చెరువు చేపల్లా రోజు వారీ వ్యాపారులు, అదే సముద్రపొడ్డున బిజీగా ఉన్నారు. భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగినట్టు ఓ అవ్వ మొక్కజొన్నపొత్తులని గుండ్రంగా తిరగేస్తూ, కుంపటంతా తిప్పుతూ కాలుస్తోంది. రోడ్డుకి అవతలవైపున ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చెఫ్ లు పొయ్యిలు సరిచూసుకుని, కలిపిన పిండిలో ఉప్పు, వర్ర సరిపోయిందో లేదో చేతిలో వేసుకుని నాకి చూసుకుంటున్నారు. అక్కడ వాహనాలు చేసే చప్పుళ్ళకి భయపడి సముద్రం సైలెంట్ అయిపోయింది. ‘‘అమ్మా మల్లెపూలు తీసుకోండమ్మా, మూర ఇరవైరూపాయలే’’ అంటూ మల్లిగాడు కొత్తగా నేర్చుకున్న పాఠం పూర్తిగా గుర్తురాకో, అబద్దం ఆడకురా అన్న అమ్మ మాట ఎక్కువ గుర్తుండో, అసలు రేటుతోనే అమ్మటానికి సిద్ధపడ్డాడు. అతని కళ్ళు ఓ ‘అమ్మగారి’ మీద ఆగాయి. ముందుకు వేసుకున్న జడ, మెరిసే పల్చటి సిల్క్ చీర, లో నెక్ జాకెట్టు, చీరకి మ్యాచింగ్ బొట్టు, నైల్ పాలిష్, గుప్పు మని కొట్టే సెంటు, అవసరానికి మించి రాయటం వల్ల చెమటకి అంటుకుపోయి అట్టలుకట్టిన పౌడర్‌తో ఒంటరిగా గట్టుమీద నిర్లక్ష్యంగా కూర్చుని, చీర కొంగుతో మొహాన్ని విసురుకుంటున్న ఆవిడెవరో పన్నెండేళ్ళ మల్లిగాడికి అర్థం కాలేదు కానీ, అక్కడున్న ఒంటరి మగవాళ్ళకి, సతీసమేతంగా వచ్చిన కారణంగా దొంగచూపులు చూసే కొంతమంది మర్యాదస్తులకీ కూడా అర్థమయ్యింది. ఇష్టం లేని ఉద్యోగం యూనిఫామ్‌తో చేసినట్టు ఇబ్బందిపడుతోందామె ఆ మేకప్‌తో . ‘‘అమ్మగారూ, మల్లెపూలు కావాలా ?’’ ఆశగా అడిగాడు మల్లి. ఆమె వద్దనలేదు. అలాఅని తీసుకోనూ లేదు. ‘‘కాసేపాగి రారా అంది’’ ‘‘నాదీ నీ పరిస్థితే’’ అనే అర్థం స్ఫురించేలా చూసి. అక్కడనించి ముందుకెళ్ళాడు మల్లి. ‘‘పూలు తీసుకోరాదూ’’ అడిగాడు ఓ భర్త తన భార్యకేసి చూస్తూ. అనగానే మల్లిగాడు ఆశగా ఆగిపోయాడు. ‘‘ఎందుకూ, ఇంట్లో తెల్లవార్లూ మీ అమ్మ ఖళ్ళు, ఖళ్ళు మని దగ్గుతూ ఉంటే, మీరు మాటిమాటికీ ఆవిడ రూమ్‌కి పరిగెత్తుతూ ఉంటే, ఈ పూలెట్టుకుని నన్నేం చెయ్యమంటారు ?’’ అందావిడ విసురుగా. ఇదంతా మల్లిగాడు వినడంతో ఆ భర్త చిన్నబుచ్చుకున్నాడు. బీచ్‌లో ఇంతమందుండగా తన గోడు కేవలం ఓ కుర్రాడు మాత్రమే విన్నందుకు ఆ భార్య నిరుత్సహపడింది. ఇదేమీ అర్థం కాకపోయినా, వాళ్ళు కొనరని మాత్రం అర్థమైన మల్లిగాడు, ముందుకు నడిచాడు. మరో రౌండ్ తిరిగాక ఓ ఇల్లాలు తన భర్తని ఆశగా అడిగింది పువ్వులు కొనమని. సినిమాలో యుద్ధం సీన్‌కి పీలగా ఉండే తనని తీసుకుంటారో తీసుకోరో అని టెన్షన్ గా ఎదురుచూస్తున్న జూనియర్ ఆర్టిస్ట్‌లా మల్లి మళ్ళీ ఆగాడు. ఆరంజ్ ఐస్ ఫ్రూట్ నోరంతా తెరిచి తింటున్న భర్త నాలుక(కూడా) మొద్దుబారిపోగా, ‘‘తెల్లారితే వాడిపోయేదానికి ఎందుకూ, ఆ డబ్బులెడితే ఓ పూట కూరొస్తాది’’ అన్నాడు హార్వార్డ్ లో ఎకనామిక్స్ ఆన్లైన్ లో చెప్పటానికి నేను రెడీ అన్నట్టు ఫేస్ పెట్టి. అతని నోట్లో పద్నాలుగు లోకాలూ చూడ్డం అయిపోగానే ఆవిడ గత పద్నాలుగేళ్లుగా చేస్తున్న పనే అన్నట్టు మౌనంగా ఉండిపోయింది. ఎవరొచ్చినా రాకపోయినా టైముకి తెరిచి టైముకి మూసే జిల్లా పౌర గ్రంధాలయంలా సముద్రపు అలలు ప్రశాంతంగా ఒడ్డుకొచ్చి మళ్ళీ వెళ్లిపోతున్నాయి. కోస్టల్ బాటరీ వైపుగా ఇంకొంచెం ముందుకెళ్ళాడు మల్లి. పొద్దున్నే ఆఫీస్‌కి వెళుతుంటే నిరుద్యోగ కొడుకు టి.విలో టెస్ట్ మ్యాచ్ చూడ్డం మొదలెట్టి, సాయంత్రం అలసిపోయి ఇంటికొచ్చే టైముక్కూడా ఇంకా అదే మ్యాచ్ చూస్తూ ఉంటే తలపట్టుకున్న తండ్రిలా, బీచ్‌లో కొత్తగా నాటిన కొబ్బరిచెట్లు రోజంతా అక్కడే కూర్చున్న ప్రేమికులకి నీడినిచ్చి వాలిపోయాయి. రోడ్డుకవతల శ్రీ శ్రీ గారి విగ్రహం ‘వస్తున్నా యొస్తున్నాయ్...’ అంటూ వాటిల్లో ఎప్పటికప్పుడు ధైర్యం నింపడానికి సిద్ధంగా ఉన్నట్టుంది. మరికొంత నిరీక్షణ తర్వాత మరొక అమ్మగారు మూర పది చొప్పున అరమూర ఇమ్మంది. తన గురువు పాఠం గుర్తొచ్చి మల్లిగాడు ఆవిడకే సమాధానమూ చెప్పకుండా ముందుకెళ్ళాడు. మొక్కుతీర్చుకున్న అమ్మగారిని, క్రాఫ్ చేయించుకున్న అమ్మగారిని, కొనమని అడగఖ్ఖర్లేదని తెలియడానికి వాడు ఎం.బి.ఏ చదవఖ్ఖర్లేదు. ఇక లాభం లేదని రోడ్డుకవతలవైపుకెళ్ళాడు. అక్కడందరూ నూడుల్స్, మంచురియా, చికెన్ సిక్సీ్ట ఫైవ్, కబాబ్‌లు తినడంలో బిజీగా ఉండి మల్లిగాణ్ణి చూసి విసుక్కున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం దగ్గర క్యూ లైన్ పెద్దగా ఉంది కానీ పూలు కొనే మూడ్ లో ఎవరూ లేరు. ‘విక్టరీ ఎట్ సీ’ దగ్గర ఎవరూ లేరు. మళ్ళీ బీచ్ సైడ్ సబ్ మెరైన్ మ్యూజియం దగ్గరకి వచ్చి ఈ సారి వుడా పార్క్ వైపు నడవసాగాడు. ఫిషింగ్ హర్బర్ నుంచి సముద్రం మీదుగా వచ్చే తేమగాలి వాసన ముందు మల్లిగాడి దగ్గరున్న అయిదుమూరల మల్లెలు చిన్నగీత లయ్యాయి. టైము అప్పటికి ఏడున్నరయ్యింది. ఇంకో అరగంట దాటితే అమ్మ కంగారు పడుతుంది. సూరిగాడు బహుశా కైలాసగిరి పైకెళ్ళిపోయుంటాడు. ‘‘ఎవరూ కొనకపోతే ఈ పూలేటిసెయ్యాల? రేపు ఓనర్ కి లెక్కెలా ఒప్పజెప్పాల?’’– మల్లి గాడికి టెన్షన్ స్టార్ట్ అయ్యింది. చైత్రమాసం వేడిలో అంతకంతకూ వాడిపోతున్న మల్లెలకేసీ, మల్లికేసి జాలిగా చూడ్డం తప్పిస్తే పైనించి పౌర్ణమి చంద్రుడు కూడా ఏమీ చేయలేకపోతున్నాడు. మురీ మిక్సర్ బండి వాడు ఉండుండి ఉల్లిపాయల్ని, నిమిషానికోసారి నిమ్మకాయని కోసి, బోను ఎలకని ఊరించినట్టు గట్టుమీదున్న జనాల్ని ఊరిస్తున్నాడు. వాడి అసిస్టెంట్ అందరి దగ్గరా ఆర్డర్ తీసుకుని ఓ పదినిమిషాల్లో కాగితం పొట్లంలో తాటాకు స్పూన్ పెట్టి అందిస్తున్నాడు. మధ్యాన్నం ఎప్పుడో ఇంతన్నం తిన్న మల్లిగాడికి ఆకలి గుర్తొచ్చింది. దాంతోపాటే ప్రొఫెషనల్ జెలసీ పుట్టుకొచ్చింది. ఎంతంటే, రేప్పొద్దున్న స్కూల్లో నువ్వు పెద్దయ్యాక ఏమవుతావ్ రా అంటే బీచ్ రోడ్ లో మురీ మిక్సర్ బండి ఓనర్నవుతా అని తడుముకోకుండా చెప్పేంత. నీరసం, నిరాశా తోడురాగా కొంచెం ముందుకెళ్లాడు. ఇంతకు ముందు కాసేపాగమన్న అమ్మగారు ఇంకా ఒక్కర్తే కూర్చుంది. సాటిలైట్ వ్యూయర్ షిప్ తోనైనా సినిమా హిట్ అవుతుందేమో అనే ఆశ పడే నిర్మాతలా మళ్ళీ ఆవిడ దగ్గరికెళ్ళి ‘‘అక్కా పూలక్కా, మూర ఇరవయ్యే అక్కా ..’’ అంటూ బతిమాలాడు. ఆవిడ ఓ నిమిషం వాడికేసి చూసి, జాకెట్ లోంచి పర్స్, అందులోంచి ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసింది. ‘‘సరే’’ అంటూ ఫోన్ పెట్టేసి, ‘‘రెండు మూరలు ఇవ్వరా’’ అని అదే పర్సు లోంచి ఏభై నోటు తీసిచ్చింది. చెమటకి తడిసిపోయిన ఆ నోటు పట్టుకుంటూ మొదటిసారి అచ్చయిన కథకి పారితోషికం అందుకున్న రచయితలా, మల్లిగాడి చెయ్యి వణికింది. తన తోటోళ్ళంతా ఎప్పటినుంచో సంపాదిస్తుండగా ఇదే తన మొదటి సంపాదన. గబ గబా రెండు మూరలకి కొంచెం కొసరు కొలిచి, బ్లేడ్ ముక్కతో కోసి ఆమెచేతికిచ్చి, ‘‘అక్కా పది చిల్లర లేదక్కా’’ అన్నాడు బాధగా. ‘‘మార్చివ్వరా’’ అందామె పూలు తల్లో తురుముకుంటూ. ఎక్కడలేని ఉత్సాహంతో ముందుకు నడిచాడు మల్లిగాడు. ఆవిడ బోణీ మహత్యమో ఏమో, ఇంతలో ఇద్దరు అమ్మాయిలు(?) ఎప్పుడొచ్చారో వచ్చి, జాకెట్ లోంచి చిన్న గుండ్రటి అద్దం తీసి ఓ సారి మేక్ అప్ సరి చేసుకుని, మల్లిగాణ్ణి ఆపి, అలవాటుగా వాళ్ళే బుట్టలోంచి చెరో మూర తీసుకుని తల్లో(?) పెట్టుకుని, వాడికి చెరో ఇరవై ఇచ్చి అక్కడ నుంచి జనం దగ్గరకి వెళ్ళి చప్పట్లు కొట్టి డబ్బులు అడగటం మొదలుపెట్టారు. ఆడవాళ్ళందర్నీ తినేసేలా చూసే మగాళ్ళు వీళ్ళని మాత్రం చూసి ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాని మల్లిగాడు ఆ విషయం తనకి సంబంధం లేకపోవడంతో వెంటనే మర్చిపోయి, డబ్బులు జేబులో కుక్కుకున్నాడు. వాడికి ధైర్యం వచ్చేసింది. ఇంక మిగిలింది ఒకటిన్నర మూర. అది అమ్ముడవకపోయినా, ఓనర్ డబ్బులు ఇచ్చేయొచ్చు. ఇంతలో ఎందుకో వెనక్కి తిరిగిన మల్లి కి ఇందాకలా రెండు మూరలు కొన్న అక్క ఎవరిదో బండి ఎక్కడం చూసి పరిగెత్తుకుని వెళ్ళి, ‘‘అక్కా నీకు పదివ్వాలక్కా’’ అంటూ జేబులోంచి నలిగిన నోట్లు ఉండలా తీసి అందులోంచి పది కాగితం చదును చేసి ఆమెకివ్వబోయాడు. మనసు పొరల్లో ఏ రక్తసంబంధాల తీపిగుర్తులు వెంటాడాయో, వయసు తొందర్లో జరిగిన ఏ కడుపుకోతల రక్తస్రావాలు పీడకలలా వేధించాయో, ఒక్క నిమిషం ఆమె కళ్ళు చెమర్చగా, ‘‘పర్లేదురా ఉంచుకో’’ అంటూ మల్లిగాడి తలనిమిరి వచ్చినతని బండెక్కి వెళ్ళిపోయింది. ఇదీ అని కారణం లేకపోయినా మల్లి గాడి మనసు ఏదోలా అయిపోయింది. అక్కడనుంచి రెండడుగులు వేశాడో లేదో, ఓ భార్యా, భర్తా. ఇద్దరికీ అరవై దాటుంటాయి, ఇద్దరూ బొట్టు పెట్టుకున్నారు. ‘‘ఏమండీ రేపు ఉదయం అమ్మవారికి పెట్టాలి పువ్వులు తీసుకోండి’’ అందావిడ. వెంటనే ఆ పెద్దాయన జేబులోంచి ఇరవై నోటు తీసిచ్చాడు. మల్లిగాడు ఓ మూర కొలిచి, బ్లేడ్‌తో కోసి ఆవిడ చేతిలో పెట్టాడు. మ్యాచ్ గెలిచిన క్రికెటర్ వికెట్లు పట్టుకుని డ్రెస్సింగ్ రూమ్ కేసి పరిగెత్తినట్టు మల్లిగాడు డబ్బులు జేబులో కుక్కుకుని ఖాళీ తట్ట పట్టుకుని వేగంగా బయల్దేరుతున్నాడు. ఇంతలో మూర పది చొప్పున అరమూర ఇమ్మన్నావిడ మళ్ళీ ఎదురుపడింది. ఎవరూ కొనకపోతే వాడే ఇస్తాడని ధీమాగా ఉన్నావిడ కాస్తా బుట్టలో పూలన్నీ అయిపోవడంతో డిమాండ్ అండ్ సప్లై థియరీ వల్ల కంగారు పడింది. మల్లిగాణ్ణి ఆపి పదిస్తా, ఆ అరమూరా ఇచ్చేయమంది. వాడు ఇవ్వనన్నాడు. ఆవిడకి పంతం హెచ్చింది. పదిహేనంది. వాడు ససేమిరా అన్నాడు. పక్కనే ఉన్న వాళ్ళాయన కలుగజేసుకుని, ‘‘సర్లేరా, చిన్నోడివని సరదాపడి ఇరవై ఇస్తున్నా, ఇచ్చేయ్’’ అన్నాడు భార్యకేసి భరోసాగా, వాడికేసి వరాలిచ్చేవాడిలా చూస్తూ. దానికి మల్లిగాడు ‘‘ఇది అమ్మడానికి కాదు సర్. అమ్మవారికి’’ అంటూ అక్కడనుంచి నేరుగా ఇంటికి పరిగెత్తాడు. అవును మరి. వాళ్ళమ్మే కదా వాడికి తెలిసిన అమ్మవారు. ఆ క్షణం వాడు ఎత్తులోనూ, వెలుగులోనూ లైట్ హౌస్‌తో పోటీ పడ్డాడు. -
ఇరుకు దారి
రెండు గ్రామాల మధ్య లోతైన కాలువ ప్రవహించేది. ఆ గ్రామాల మధ్య రాకపోకల కోసం రెండు గట్లు కలుపుతూ సన్నని తాటిచెట్లు వంతెనలా వేసి వాటి మీదుగా నడిచేవారు గ్రామస్తులు. ఒకసారి ఆ మార్గంలో ప్రయాణిస్తున్న ఇద్దరు పండితులు దుంగ మీద ఎదురయ్యారు. ఇరుకైన దారి కనుక ఎవరో ఒకరు వెనక్కు వెళ్లాలి. ‘‘ముఖ్యమైన పనిమీద వెళుతున్నాను. దారి విడుస్తారా’’ అన్నాడు ఒక పండితుడు దర్పంగా. ‘‘పెద్దవాళ్లను గౌరవించాలన్న సంస్కారం లేదా? నువ్వే అడ్డు తప్పుకో’’ అన్నాడు రెండో పండితుడు. ‘‘వయసు విషయం పక్కన పెట్టండి. సకల శాస్త్రాలు అధ్యయనం చేసి, పాతిక గ్రంథాలు రచించిన వాణ్ణి’’ అని గొప్పతనం చెప్పాడు మొదటి పండితుడు. అలా ఇద్దరూ పంతాలకు పోతున్నారు. వాళ్లకు మరి కొంత దూరంలో సన్నని వంతెన ఉన్న విషయం గమనించలేదు పండితులు. అది చూసి ‘అరే!’ అని మనసులో అనుకున్నారు కానీ అహంభావం అడ్డు వచ్చి ఇద్దరూ వెనక్కు తగ్గలేదు. కొంతసేపటికి రెండు కుక్కలు ఆ మార్గంలో వెళుతూ పండితులు ఎదురయినట్టే రెండూ వంతెన దుంగల మీద ఎదురయ్యాయి.కుక్కల వైపు చూసి ‘‘కొత్త కుక్క కనబడితే మరో కుక్క అరచి కలబడుతుంది. ఇప్పుడు దారి వదలమని కరుచుకుంటాయేమో’’ అనుకున్నారు పండితులు.అయితే ఆ రెండు కుక్కలూ అరుచుకోలేదు. కలబడి కరుచుకోలేదు. వాటి భాషలో ఏవో మాట్లాడుకున్నాయి. వెంటనే ఒక కుక్క దుంగల మీద ముందరి కాళ్లు పొడుగ్గా పరచి పడుకుంది. రెండోది దాని మీదుగా నడిచి వెళ్లింది. అప్పుడు రెండో కుక్క లేచి ముందుకు వెళ్లిపోయింది. ఆశ్చర్య పోవడం పండితుల వంతయింది. విలువైన సమయం వృథాకి ఇరుకైన దారి కారణం కాదని, ఇరుకైన హృదయాలే కారణమని, సంకుచితంగా ఆలోచించామని సిగ్గుపడ్డారు పండితులు. – ఉమా మహేశ్. -
గుండెపోటుతో యువ ఎస్సై మృతి
ఆదిలాబాద్: ఓ యువ ఎస్సై గుండెపోటుకు గురై మృతిచెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఆర్. ఉమా మహేష్(29) 2012 లో ఎస్సైగా ఉద్యోగం సాధించాడు. విధుల్లో భాగంగా ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి ఖానాపూర్‌కు వచ్చాడు. ఈ రోజు ఉదయం గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు నిర్మల్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతునికి భార్య ఒక పాప ఉంది. మహేష్ మృతితో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది.