ప్రశ్నించడమే దళిత కవిత్వం...

ప్రశ్నించడమే దళిత కవిత్వం...


సంభాషణ: తుల్లిమిల్లి విల్సన్ సుధాకర్

 

భారతీయ సాహిత్యంలో దళిత కవిత్వపు అధ్యాయం 1960లలో మహారాష్ట్రలో ప్రారంభమైంది. తరువాతి దశాబ్దాలలో కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో విస్తరించింది. ఈ నేపథ్యంలో 2006లో మహారాష్ట్రలోని ఖైర్లాంజీ అనే మారుమూల గ్రామంలో ఒక దళిత కుటుంబాన్ని అమానుషంగా హింసించి, హత్యచేసిన వైనం మరాఠీయులకు తెలిసింది ఒక తెలుగు కవి వల్ల. అతడి పేరు విల్సన్ సుధాకర్ తుల్లిమిల్లి. ఆయన తెలుగులో రాసిన కవిత ‘సూది బెజ్జంలో ఒంటెలు’ గురించి తెలుగు మిత్రులద్వారా తెలుసుకున్న మహారాష్ట్ర దళితులు ‘ఖైర్లాంజీ’ సంఘటనపై ఉద్యమించారు. ఏలూరులో హైస్కూల్ విద్య, విజయవాడలో డిగ్రీ, మనీలాలో ఎం.బి.ఎ చదివిన విల్సన్ సుధాకర్ ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ టూరిజంలో డెరైక్టర్‌గా బెంగళూరులో పనిచేస్తున్నారు. దళిత వ్యాకరణం, మాకూ ఒక భాష కావాలి కవితా సంకలనాలు రచించిన విల్సన్ సుధాకర్‌ను ‘దళిత కవిత్వపు వెలుగు రవ్వ’గా అభిమానులు అభివర్ణిస్తారు. సుధాకర్‌తో సంభాషణాసారాంశం: తెలుగునేలపై ఆధునిక దళిత కవిత్వం తొలిదశ బాధను చెప్పుకోవడానికి పరిమితమైంది. ‘నన్నెంతో ప్రేమించే అమ్మా వెళ్లిపోయావా...’ తరహాలో కవిత్వాలు వచ్చేవి. ‘మమ్మల్ని అవమానిస్తే మేం ఊరుకోం. మావాళ్లను చంపేస్తే మేం సహించం, మీరు చేసే అకృత్యాలను అనుమతించబోం’ అని స్పష్టం చేసే తిరుగుబాటు కవిత్వం రెండవ దశ. ఇందుకు శ్రీకారం చుట్టింది గద్దర్.  కారంచేడు సంఘటన నేపథ్యంలో ‘దళిత పులులమ్మా...’ అని ఆయన రాసిన కవిత్వం, పాడిన పాట తెలుగు దళిత సాహిత్యంలో మైలురాయి! దళితులు సైతం చైతన్యం పొందడం అనే  మూడవ దశ చుండూరు సంఘటన నుంచి ప్రారంభమైంది.

 

కవిత్వం ఏమి చేయగలదు?ఇప్పటికీ కొందరు దళిత కవిత్వం అంటే ఏమిటి? అని ప్రశ్నిస్తారు. ప్రశ్నించడమే దళిత కవిత్వం. ప్రశ్నించినందువలన ఏమిటి ఫలితం అంటారు మరికొందరు. ప్రశ్నించే కవిత్వం సమాధానాన్ని రాబడుతుంది. అత్యాచారాలకు పాల్పడిన వారిని శిక్షించేలా చేస్తుంది. అలాంటి అనుభవాలు నా కవిత్వం ద్వారా చూశాను. ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో పనిచేస్తోన్న దళిత అధికారి కూడా అంటరానితనానికి గురయ్యే వాస్తవికతను ‘సవర్ణ దీర్ఘసంధి’ అనే కవితలో రాశాను. మీ కవిత ఎంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చిందని అనేకులు ఫోన్ చేశారు. పదవతరగతి టాపర్ అయిన బాలికను ఆమె తల్లిని కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసి, బాలిక అన్నను అందుకు పురికొల్పారు ఆధిపత్యకులాలవారు. ఖైర్లాంజీలో జరిగిన ఈ దుర్మార్గాన్ని విన్న వెంటనే నేను కవిత రాశాను. అది మరాఠీలోకి, ఇతర భాషల్లోకి అనువాదమైంది. ఆ తర్వాతే అక్కడ ఉద్యమం రగిలింది. కవిత్వం ఏమి చేయగలదు అనేందుకు స్వానుభవంలోని ఉదాహరణ ఇది. కవిత్వమే కదా తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతం చేసింది. ఇంటివారిని ఇంట్లోకి పిలుస్తారా? మత స్వేచ్ఛ ఉంది అని రాజ్యాంగంలో లిఖించుకుని ఆచరణలో మాత్రం తూట్లు పొడవడం ఎంతవరకు సబబు? పూర్వమతంలోకి మళ్లీ తీసుకురావడాన్ని ‘ఘర్‌వాపసీ’ అంటున్నారు. ఘర్ వాపసీ అంటే విదేశాల్లోని భారతీయులను వెనక్కు రప్పించడం! కాని మనదేశంలోనే ఉన్నవారిని వెనక్కు రప్పించడాన్ని ఘర్‌వాపసీ అంటున్నారు. ఇంతకీ ఈ ఇల్లు ఎవరిది? ‘మా మూలవాసుల నేల మాది కానప్పుడు వలస వాసులతో జీవనం సాగించలేం’ అనే అంతర్వాణిని వినరా!ప్రశ్నల దీపాలు వెలిగించండితెలంగాణ -ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఒకరిని చూసి మరొకరు మైనారిటీ వర్గాలు, మతాల పేరుతో ‘భవనాలు’ నిర్మిస్తామంటున్నాయి. ఆయా కులాల, సమూహాల పేరుతో భవనాలు నిర్మిస్తే సరా? గ్రామాల్లో ఆడబిడ్డలకు మరుగుదొడ్లు, స్నానాల గదులు ఎవరు నిర్మిస్తారు? చైనా తర్వాత అత్యధిక బౌద్ధారామాలున్న ప్రాంతంలో కొత్తరాష్ట్ర రాజధానిని నిర్మిస్తూ దానికి పెట్టే పేరు కోసం బుద్ధుని పేరును విస్మరించడం  రాజకీయమా? మతిమరుపా? ఇక్కడ పేదలకిచ్చిన పట్టాభూములను సైతం స్వాధీనం చేసుకునే రీతిలో రాజధాని జైత్రయాత్ర సాగుతోంది. రిజర్వేషన్లకు మంగళం పాడుతూ ప్రభుత్వ సంస్థలను మూసేస్తున్నారు. ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్ల ఊసే లేదు. చదువుకున్న యువత నైరాశ్యంలో ఉంది. ఈ పరిస్థితుల్లో దళితకవి ప్రశ్నల దీపాలు వెలిగించాలి. తరతరాల బాధాతప్తులకు కావాల్సిందిప్పుడు భవనాలు కాదు! భువనం! రాజ్యాధికారం!

 - పున్నా కృష్ణమూర్తి

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top