కలెక్టర్‌గారి భోజనం

Collector lunch with hostel students  - Sakshi

లంచ్‌ బెల్‌

ఆయన జిల్లా కలెక్టర్‌. రోజూ ఆఫీస్‌కు వస్తారు. క్యారేజీ తెచ్చుకోరు. హోటల్‌ నుంచి పార్శిల్‌ రాదు. సరిగ్గా భోజన సమయానికి ఆఫీస్‌ నుంచి మాయం అవుతారు. ఎక్కడికి వెళతాడు అనేగా మీ డౌట్‌! ఆయన స్కూల్‌కు వెళతారు. అవును. సరిగ్గా భోజనం సమయానికి స్కూల్‌కు వెళ్లే ఆ కలెక్టర్‌ అక్కడ పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు. బిజీ షెడ్యూళ్లలో తప్పితే మిగతా ఎక్కువ రోజులు ఇలాగే చేస్తారు. ఇంతకీ ఎవరా కలెక్టర్‌?!

కేరళ రాష్ట్రం అలపుళ జిల్లా. కలెక్టర్‌ ఎస్‌.సుహాన్‌. 2012 ఐ.ఎ.ఎస్‌. బ్యాచ్‌కి చెందిన ఈయన ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. వచ్చీరాగానే జిల్లాలోని పాఠశాలల్లో బోధన, సౌకర్యాలపై దృష్టి పెట్టారు. మొన్నటికి మొన్న మధ్యాహ్న సమయంలో నీరుకున్నమ్‌లోని శ్రీ దేవి విల్సమ్‌ అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌కు వెళ్లారు.. సరిగ్గా పిల్లలు భోజనం చేసే సమయంలోనే. కలెక్టర్‌ వచ్చారని అందరూ హడావుడి చేస్తుంటే.. సుహాన్‌ నేరుగా డైనింగ్‌ హాలులోకి వెళ్లారు. ఓ ప్లేట్‌ తీసుకున్నారు. పిల్లల మధ్య కూర్చుని భోజనం చేశారు. ఆ రోజు కూరలు దోసకాయ, ఆలుగడ్డ. పెరుగు కూడా ఉంది. పిల్లల మధ్య మధ్యాహ్న భోజనం చేస్తూనే.. ‘ఎలా ఉంది?’ అని అడిగి తెలుసుకున్నారు.

ఇది ఒక్క రోజు జరిగిన ‘డ్రైవ్‌’ కాదు. అంతకుముందు ఆయన వయనాడ్‌ జిల్లా కలెక్టర్‌గా కూడా పనిచేశారు. అప్పుడు కూడా ఇలాగే గిరిజన పాఠశాలలపై దృష్టి పెట్టారు. రోజుకొక గిరిజన పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తూ ఉపాధ్యాయులకు షాక్‌ ఇచ్చేవారు. దీంతో అటవీ ప్రాంతంలోని గిరిజన పాఠశాల విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఒక్కో పాఠశాలలో 30 మంది స్టూడెంట్స్‌ చేరారు. జస్ట్‌ ఒక్క సంవత్సరంలోనే ఈ మార్పు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఇటీవలే అలపుళ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు కలెక్టర్‌ సుహాన్‌. దీని వల్ల మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెరుగు తుందని, విద్యార్థుల చదువుపైనే కాకుండా ఆరోగ్యంపైన కూడా శ్రద్ధ పెట్టటానికి వీలవుతుంది అన్నారు. పిల్లల తల్లిదండ్రుల్లోనూ ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం ఏర్పడుతుం దన్నారు.   

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top