చితికిన బతుకు చిత్రం! | Closed consider the picture | Sakshi
Sakshi News home page

చితికిన బతుకు చిత్రం!

Nov 24 2014 12:20 AM | Updated on Sep 2 2017 4:59 PM

చితికిన  బతుకు చిత్రం!

చితికిన బతుకు చిత్రం!

రంగురంగుల దుస్తులు... ముఖం నిండా రంగుల పూతలు...

రంగురంగుల దుస్తులు... ముఖం నిండా రంగుల పూతలు... ఎవరికోసమో చూపులు... దేనికోసమో పాట్లు. కలలు ఉంటాయి... కానీ కన్నీళ్లు వాటిని మింగేస్తాయి. ఆశలు ఉంటాయి... కానీ అగచాట్లు వాటిని అదిమిపెట్టేస్తాయి. వేశ్యావాటికల్లో బతుకులు బండలైపోతుంటే... విటుల చేతుల్లో తనువులు గుల్లలవుతుంటే... పంటి బిగువున బాధను అదిమిపెట్టి... కంటిరెప్పల మాటున కన్నీటి సంద్రాలను దాచిపెట్టి... బతకలేక చావలేక అల్లాడుతున్న ఎన్నో జీవచ్ఛవాలు ప్రపంచపు నలుమూలలా ఉన్నాయి. వారిని వెతుక్కుంటూ వెళ్లాడు బెంగాలీ ఫొటోగ్రాఫర్ జీఎంబీ ఆకాశ్. వేదనాపూరితమైన వారి జీవితాలను తన కెమెరాలో బంధించే ప్రయత్నం చేశాడు. అతడు తీసిన గొప్ప ఫొటోల్లో ఇదొకటి.

ఈ అమ్మాయి పేరు నోదీ. పన్నెండేళ్ల వయసున్నప్పుడు సవతి తల్లి నోదీని తీసుకుని బంధువుల ఇంటికి వెళ్లింది. కొన్నాళ్లు వాళ్ల దగ్గరే ఉండమంటూ నోదీని అక్కడే వదిలి వెళ్లింది. వారం తర్వాతగానీ తెలియలేదు ఆ చిట్టితల్లికి... తల్లి తనను పదివేలకు అమ్మేసిందని. వేశ్యగా బతకమంటూ శపించి వెళ్లిపోయిందని. రెండేళ్లు నరకయాతన పడింది నోదీ. తన ప్రమేయం లేకుండానే తన తనువు అమ్ముడైపోతోంటే మనసు రగిలిపోయేది. కానీ ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయేది. అలాంటి సమయంలోనే ఓ కస్టమర్ ఆమె కష్టాన్ని తెలుసుకుని ఓదార్చాడు. నిన్ను నేను కాపాడతానంటూ హామీ ఇచ్చాడు. పద్నాలుగేళ్ల లేత మనసు అతడి మీద ప్రేమ పెంచుకోవడం మొదలుపెట్టింది. అతడితో జీవితాన్ని అందంగా ఊహించుకోసాగింది. ఓ రోజు అతడు వచ్చాడు. నోదీని అక్కడ్నుంచి తప్పించాడు. తనతో తీసుకెళ్లి ప్రేమంటే ఏమిటో చూపించాడు. సంతోషం ఎలా ఉంటుందో తెలియజేశాడు. ఇక తనకు ఏ సమస్యా లేదనుకుంది నోదీ. కానీ కన్నుమూసి తెరిచేలోగా ఆమె కలలు బూడిదయ్యాయి. తనను జీవితాంతం కంటిరెప్పలా కాపాడతాడనుకున్న ఆ వ్యక్తి... నోదీని యాభైవేలకు మరో వ్యక్తికి అమ్మేశాడు. దాంతో నోదీ జీవితం మళ్లీ మొదటికి వచ్చింది. ఆమె లేత జీవితం నేటికీ బంగ్లాదేశ్‌లోని ఒక వేశ్యావాటికలో నలిగిపోతోంది. అయినవాళ్లు, ప్రేమించినవాళ్ల చేతుల్లో వంచనకు గురై, కామాంధుల కోరలకు బలైపోయే అబలల బతుకులకు అద్దం పట్టిన ఈ ఫొటో... ఆకాశ్‌కి ఎన్నో అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టింది!

Advertisement
 
Advertisement
Advertisement