ఫ్యామిలీ సర్కస్‌

Childrens Are Wandering Around In The Virtual World As Parents Talk About The Real World - Sakshi

‘‘మా చిన్నప్పుడు పిల్లల్లో దేవుడుంటాడు అనేవారు.. ఇప్పుడు పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటున్నారు’’ అంటాడు మనోజ్‌ బాజ్‌పాయ్‌  అమెజాన్‌ ప్రైమ్‌ ఒరిజనల్‌ ‘‘ది ఫ్యామిలీ మ్యాన్‌’’ అనే వెబ్‌సిరీస్‌లో! ఆయన అలా అనడానికి కారణం.. టెక్నోయేజ్‌లో  పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య ఉన్న గ్యాప్‌! కాలంతో పోటీపడ్డా అంతరాన్ని అధిగమించలేకపోతున్నాం.. పిల్లల ఫ్రెండ్‌లిస్ట్‌లో ప్లేస్‌ సంపాదించలేకపోతున్నాం.. ఇది వెబ్‌స్క్రీన్‌ ఫాదర్‌ బాధే కాదు... రియల్‌ పేరెంట్స్‌ ప్రాబ్లమ్‌ కూడా! నిజ జీవితాన్ని మరిపించే ఆ సిరీస్‌ సీన్స్‌ కొన్ని..

ఒకరోజు పిల్లల్ని స్కూల్లో డ్రాప్‌ చేయడానికి ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ ఫాదర్‌ మనోజ్‌ బాజ్‌పాయ్‌ కార్లో వెళ్తుంటే.. ట్రాఫిక్‌లో ఓ బైక్‌ రైడర్‌ వచ్చి వీళ్ల కారుకు డాష్‌ ఇస్తాడు. రేర్‌ వ్యూ మిర్రర్‌ దెబ్బతింటుంది. కోపంతో అతను ‘‘మాద....’’ అంటూ తిట్టబోయి పక్కనే పిల్లలున్నారన్న ఇంగితంతో తమాయించుకుంటాడు. కాని పిల్లలు తమ తండ్రి నోటి వెంట ఆ మాట వినగానే ఉత్సాహంగా తండ్రి వైపు చూస్తుంటారు అతను అలా తిడ్తుంటే విందామని. తిట్టకుండా ఆగిపోయేసరికి తీవ్ర నిరుత్సాహానికి గురవుతారు పిల్లలు. ఈలోపు మనోజ్‌ బాజ్‌పాయ్‌ నోటివెంట ఏదో అనరాని మాట వినపడబోయిందని.. దానికి తప్పు తనదే అయినా బైక్‌ ఆపి మరోజ్‌ బాజ్‌పాయ్‌ మీదకి గొడవకి వెళ్తాడు ఆ బైక్‌రైడర్‌ బూతులు తిడ్తూ. ‘‘భాయి సాబ్‌.. ఏంటా మాటలు పక్కన పిల్లులున్నారు..’’ అని మనోజ్‌ సర్ది చెప్తున్నా వినకుండా అరుస్తుంటాడు. తప్పు అవతలి వ్యక్తిదే అయినా.. తను తగ్గకపోతే ఆ పిచ్చిమాటలతో పిల్లల మెదళ్లు కలుషితమైపోతాయని ‘‘సారీ భాయిసాబ్‌.. పోనీండి’’ అని విండో మిర్రర్‌ ఎక్కిచ్చేస్తాడు.

పక్కనే కూర్చున్న అతని ఎనిమిదేళ్ల కొడుకు ‘‘తప్పు అతనిదైతే నువ్వు సారీ ఎందుకు చెప్తావ్‌? అసలు అతణ్ణి తిట్టబోయి ఎందుకు ఆపావ్‌? నేను తిడ్తానుండు..’’ అంటూ విండోలోంచి తల బయటకు పెట్టి తండ్రి పూర్తిచేయలేని మాటను అనేస్తాడు. హతాశుడవుతాడు మనోజ్‌ బాజ్‌పాయ్‌.తర్వాత..కార్లో వెనక సీట్లో కూర్చున్న కూతురు ఫోన్లో మునిగిపోయి ఉంటుంది. ‘‘బయట కూడా ఓ ప్రపంచం ఉంది.. ఫోన్‌లోంచి తల తిప్పి చూడు’’ అని చురకంటిస్తాడు తండ్రి.‘‘బయట ప్రపంచం చూస్తే బాయ్‌ఫ్రెండ్‌తో చాటింగ్‌ ఎవరు చేస్తారు?’’ అని అక్క అలవాట్ల మీద సెటైర్‌ వేస్తాడు తమ్ముడు. తండ్రికి మళ్లీ షాక్‌.. ‘‘ఎఫ్‌బీలో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపిస్తే యాక్సెప్ట్‌ ఎందుకు చేయలేదు?’’ కూతురిని అడుగుతాడు. ‘‘నువ్వు నాకు నాన్నవు.. ఫ్రెండ్‌వి కావు’’ ఫోన్‌లోంచి తలెత్తకుండానే చాలా కాజువల్‌గా ఆన్సర్‌ చేస్తుంది ఆ కూతురు. ‘‘ నిన్ను యాక్సెప్ట్‌ చేస్తే.. అక్క బాయ్‌ ఫ్రెండ్స్‌ లిస్ట్‌.. చాటింగ్‌ మ్యాటర్స్‌ నీకు తెలుస్తాయ్‌ కదా నాన్నా..’’ తమ్ముడి వ్యంగ్యం మళ్లీ. షరామామూలుగా తండ్రికి శరాఘాతం.

ఈ సంభాషణలో ఉండగానే స్కూల్‌ వస్తుంది.. కాంపౌండ్‌ లోపలికి కారును పోనిస్తుంటే పిల్లలిద్దరూ ‘‘వద్దూ.. ఇక్కడే ఆపు’’ అంటూ అరుస్తారు.‘‘మరీ అంతా పిచ్చి కారేం కాదు.. మీరు చాలా అదృష్టవంతులు. నేనైతే నా చిన్నతనంలో అయిదు కిలోమీటర్లు నడిచి వెళ్లేవాడిని స్కూల్‌కు’’ అంటూ స్కూల్‌ గేట్‌ బయటే కారు ఆపుతాడు తండ్రి. ‘‘అవును.. మా తాత అయితే ఈదుకుంటూ వెళ్లేవాడు’’ అంటూ కారు దిగి ఫడేలుమని డోర్స్‌ వేసేసి లోపలికి నడుస్తారు పిల్లలు. ‘‘ఏంటో ఈ కాలం పిల్లలు’’ అంటూ కారు రివర్స్‌ తిప్పుకుంటాడు మనోజ్‌ బాజ్‌పాయ్‌. ఇంకోసారి.. పిల్లలిద్దరినీ తీసుకొని సూపర్‌మార్కెట్‌కు వెళ్తాడు ఆ తండ్రి. అక్కడా అంతే! అమ్మాయి ఫోన్‌లోనే ఉంటుంది. కొడుకు మాత్రం ఆ ర్యాక్స్‌లో ఉన్న వస్తువుల పట్ల విపరీతమైన కుతూహలం ప్రదర్శిస్తూంటాడు. ఒక ర్యాక్‌లో ఉన్న శానిటరీ నాప్‌కిన్స్‌ ప్యాక్‌ తీసి ‘‘నాన్నా.. ఇదేంటి?’’ అని అడుగుతాడు. ఉలిక్కిపడి.. ఎవరైనా విన్నారా... అన్నట్టుగా అటూ ఇటూ చూసి ‘‘ఏయ్‌.. అక్కడ పెట్టేసెయ్‌ అది’’ అని నెమ్మదిగానే గద్దిస్తాడు తండ్రి.

‘‘యు నో నాన్నా.. దీని గురించి టీవీలో యాడ్‌ చూశా. ఒకమ్మాయి చాలా టెన్షన్‌గా, స్ట్రెస్‌గా కనిపిస్తుంది. ఇది యూజ్‌ చేశాక.. రిలీఫ్‌గా.. పిచ్చి పిచ్చిగా గంతులేస్తూ పరిగెత్తుతూ ఉంటుంది. అసలు ఇదేంటి నాన్నా..’’ అంటూ పట్టువదలని విక్రమార్కుడవుతాడు పిల్లాడు. ‘‘పిచ్చిపిచ్చివన్నీ ఎందుకు చూస్తున్నావ్‌ టీవీలో? దాన్నక్కడ పెట్టేయ్‌ అన్నానా?’’ అంటూ పిల్లాడి చేతిలోంచి ఆ ప్యాక్‌ను లాక్కొని ర్యాక్‌లో పెట్టేస్తాడు తండ్రి. అప్పుడు ఫోన్‌లోంచి తల బయట పెట్టిన కూతురు.. ‘‘ఎందుకు దాస్తున్నావ్‌ నాన్నా? చెప్పు వాడికి.. ఇది శానిటరీ నాప్కిన్‌ అని.. అమ్మాయిలకు పీరియడ్స్‌ వస్తాయని.. వచ్చినప్పుడు వీటిని వాడ్తారని చెప్పు.. లేకపోతే వెర్రివెధవలా తయారవుతాడు’’ అంటుంది. కూతురి రియాక్షన్‌కు నోట మాటరాదు తండ్రికి. ‘‘అసలు ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటున్నావ్‌?’’ తండ్రి. ‘‘మీరు చేర్పించిన గొప్ప స్కూల్లోనే’’ వెటకారంగా సమాధానమిచ్చి మళ్లీ ఫోన్‌లో తల దూరుస్తుంది. అమ్మాయి కాస్త ముందుకెళ్లాక అడుగుతాడు కొడుకుని ‘‘నిజంగానే అక్కకు బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడా?’’ అని. ‘‘ఊ.. ఉండొచ్చు’’ అంటాడు కొడుకు.

అంతే.. తండ్రి ఫ్యూజులు ఎగిరిపోతాయి. కూతురి వెనకాలే వెళ్లి ఆ పిల్ల ఫోన్లోకి తొంగి చూసే ప్రయత్నం చేస్తూంటాడు. ‘‘నాన్నా.. ప్రైవసీ అనే మాటొకటుంటుంది’’ అంటుంది. పిల్లలు ఇచ్చే ఈ షాక్‌లు తట్టుకోలేక వెంటనే తన ఫోన్‌లోని నియర్‌ డివైజెస్‌ అనే యాప్‌ను ఓపెన్‌ చేస్తాడు. అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోస్‌ అప్‌లోడ్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది అతనికి. ఇవన్నీ గుర్తుపెట్టుకొనే ఆ పైన చెప్పినమాట అంటాడు ఇవ్వాళ్రేపటి పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటున్నారు అని. ‘‘వెబ్‌సిరీస్‌లోని ఫ్యామిలీ మ్యాన్‌ మాట కరెక్టే. రియల్‌ లైఫ్‌ ఫ్యామిలీస్‌లోని పిల్లలు అలాగే ఉంటున్నారు. తరానికి, తరానికి మధ్య అంతరం ఎప్పుడూ ఉంటుంది. అయితే కిందటి తరాల్లో పెద్దల పట్ల భయం, భక్తి, గౌరవం ఉండడం వల్ల ఈ అంతరం అంతగా బాధించలేదు. ఒత్తిడి పెంచలేదు. కాని ఈ తరంతో పరిస్థితి భిన్నంగా ఉంది. సంభాళించడం కష్టంగా ఉంది. కౌమార దశలో ఉన్న పిల్లలను తల్లిదండ్రులు స్నేహితుల్లా చూడాలని సైకాలజీ కౌన్సెలింగ్‌లు, పేరెంటింగ్‌ లెసన్స్‌ బోధిస్తున్నాయని పిల్లలను స్నేహితుల్లా చూడ్డానికి సిద్ధపడ్డా పిల్లలు..పెద్దలతో ఫ్రెండ్‌షిప్‌ చేయట్లేదు.

ఫ్యామిలీ మ్యాన్‌లోలా ఎఫ్‌బీ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేయట్లేదు. ఫ్రెండ్‌లిస్ట్‌లో పేరెంట్స్‌ ఉండడమేంటని రిజెక్ట్‌ చేస్తున్నారు. ఒకవేళ పోనీ పాపం అని యాక్సెప్ట్‌ చేసినా.. ఫ్రెండ్స్‌ కోసం ఇంకో పర్సనల్‌ అకౌంట్‌ను క్రియేట్‌ చేసుకుంటున్నారు. సైబర్‌ నేరాల గురించి విన్నప్పుడల్లా గుండె దఢేలు మంటోంది.. పిల్లల చూస్తేనేమో ఇట్లా? టీన్స్‌లో ఉన్నవాళ్లే కాదు. పదేళ్లు నిండని వాళ్లూ పరమ ముదుర్లలా ప్రవర్తిస్తున్నారు. వాళ్ల కోసం మెయిల్స్‌ పెట్టడం, వాట్సప్‌లు చూసుకోవడం, యూట్యూబ్‌ను ఫాలో అవడం, ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉండడం, ట్వీట్లు చేయడం, ఇన్‌స్టాలో ఇన్‌వాల్వ్‌ అవడం చేస్తున్నా.. పిల్లల వైఖరి ఊహకందట్లేదు. ఈ కాలానికి తగ్గట్టు అడ్వాన్స్‌ అయ్యామని మురిసిపోవడమే తప్ప పిల్లలు నడుస్తున్న దారిని ట్రాక్‌చేయడం తరమవ్వట్లేదు. పిల్లలకు అన్నీ చెప్పాలి.. వాళ్ల మనసులో ఉన్నవి పంచుకోనివ్వాలి అనేది వినడానికి బాగుంటోంది. కాని చెప్పే చాన్స్‌నివ్వట్లేదు..చెప్పకముందే తెలుసుకుంటున్నారు. మంచిదే. కాని ఏ సమయానికి ఏ విషయం తెలియాలో అనే సందర్భం ఉంటుంది. ఆధునికత దాన్ని చెరిపేస్తోంది. పాతకాలం మరీ స్లో అయితే ఈ కాలానికి వేగం మరీ ఎక్కువ. సంధికాలంలో ఉన్న తరానికి ఇదో అవస్థ’’ అంటూ వాపోతున్నారు పేరెంట్స్‌.

కౌంటర్‌ యాప్‌లు
తప్పనిసరి అయితేనే పిల్లలకు స్మార్ట్‌ ఫోన్స్‌ ఇవ్వాలి. కమ్యూనికేషన్‌ కోసమే అయితే మామూలు ఫోన్స్‌ చాలు. ఇప్పుడు స్కూల్లో ప్రాజెక్ట్‌ వర్క్స్, హోమ్‌ వర్క్స్‌ కూడా నెట్‌ బేస్డ్‌గా ఉంటున్నాయి కాబట్టి.. నెట్‌ యాక్సెస్‌ ఇస్తున్నప్పుడు అవసరమైనవి తప్ప మిగిలిన ఏ సైట్స్‌ ఓపెన్‌ కాకుండా డౌన్‌లోడ్‌ కాకుండా పాస్‌వర్డ్స్‌తో లాక్‌ చేసేయాలి.  అలాగే ఎఫ్‌బీ, ఇన్‌స్టా, ట్విట్టర్‌ వాడుతుంటే ఫేక్‌ ఫ్రెండ్స్‌ గురించి, దానివల్ల ఉండే ప్రమాదాల గురించీ పిల్లలకు చెప్పాలి. ముక్కూమొహం తెలియని అలాంటి ఫ్రెండ్స్‌ కంటే క్లాస్‌లో, ఇంటి దగ్గర రోజూ కనపడుతూ, బాగా పరిచయం ఉన్న వాళ్లతో స్నేహం చేసేలా చూడాలి. సోషల్‌ మీడియాలో టైమ్‌ పాస్‌ చేయకుండా చూడాలి.
– కె. విజయ వర్థన్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌
పోలీస్, సైబర్‌క్రైమ్‌ డిపార్ట్‌మెంట్, సైబరాబాద్‌.

పిల్లలతో ట్రావెల్‌ చేస్తూనే..
పేరెంటింగ్‌ ఇప్పటి పేరెంట్స్‌కి నిజంగానే పెద్ద చాలెంజ్‌గా మారింది. తల్లిదండ్రులు వాస్తవ ప్రపంచం గురించి చెప్తూంటే  పిల్లలు వర్చువల్‌ వరల్డ్‌లో విహరిస్తున్నారు. అందుకే అంత గ్యాప్‌ ఉంటోంది. ప్రాక్టికాలిటీకి భిన్నంగా మనం వాళ్లతో ప్రవర్తిస్తే ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి. సోషల్‌నెట్‌వర్క్‌ సిస్టమ్‌ ద్వారా ఏదోవిధంగా  ఎక్స్‌పోజ్‌ అవుతారు. కాబట్టి దాచిపెట్టకుండా పిల్లలు ఎక్స్‌పోజ్‌ అవుతున్న విషయాలు, పరిస్థితులను ఎక్స్‌ప్లెయిన్‌ చేయాలి. దానికి ముందు పిల్లల మానసిక సామర్థ్యాన్ని అంచనా వేయాలి. అలాగే బయట వాళ్లకు కనపడ్తున్న, ఎక్స్‌పీరియెన్స్‌ అవుతున్న వాతావరణాన్నీ గమనించాలి. మనం చెప్పకముందే వాళ్లు తెలుసుకోగల అంశాలేంటో విశ్లేషించుకుని  సమయం, సందర్భానుసారంగా వాళ్లకు వివరించాలి. పేరెంట్స్‌కి, పిల్లలకు మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ పారదర్శకంగా ఉండాలి. అప్పుడే ఈ గ్యాప్‌ తగ్గుతుంది.. తల్లి, తండ్రి ఇద్దరి మాటా ఒక్కటిగానే ఉండాలి. తప్పుల నుంచీ నేర్చుకునేలా చూడాలి. ప్రీచింగ్స్‌లా కాకుండా పిల్లల భాషలోనే చెప్తూ, పిల్లలతోనే ట్రావెల్‌ చేస్తూ వాళ్లను సరిదిద్దాలి తప్ప అధికార దర్పం  ఉండకూడదు.
– డాక్టర్‌ కళ్యాణ్‌ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top