జగన్, కేటీఆర్‌ భేటీపై ఎందుకీ రచ్చ?

Chandrababu Naidu Propaganda On YS Jagan KTR Meet - Sakshi

డేట్‌లైన్‌ హైదరాబాద్‌

ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి 14 మాసాలు 3,648 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి దాదాపు రెండు కోట్లమంది సామాన్య ప్రజలను ముఖాముఖి కలుసుకుని వాళ్ళ సమస్యలు విని వాటికి పరిష్కారాలు అన్వేషించే క్రమంలో పలు కార్యక్రమాలను ప్రకటించి అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని పేర్కొని, అపూర్వ ప్రజాదరణ పొందడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డ అధికార పక్షం, దాని అధినేత చంద్రబాబు కేటీఆర్‌ జగన్‌ను కలవడంతో ఆయనను అప్రతిష్టపాలు చెయ్యడానికి ఒక అవకాశం దొరికిందని సంబరపడ్డారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం అనే అంశాన్ని అర్జెంటుగా తెర మీదకు తెచ్చారు.

పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తెలంగాణ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఆయన కుమా రుడు, టీఆర్‌ఎస్‌ కార్యాధ్యక్షుడు కే.టీ. రామారావు మరికొంతమంది పార్టీ నాయకులతో కలిసి లోటస్‌ పాండ్‌లోని ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. చర్చల అనంతరం జగన్, కేటీఆర్‌ ఇద్దరూ కలిసే మీడియాతో మాట్లాడారు. చంద్రశేఖర్‌ రావు ఒక సంవత్సర కాలంగా దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌ రెండు పార్టీలూ లేని ఒక ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేద్దాం కలిసి రండి అని దేశంలో పలువురు నాయకులను కలు స్తున్నారు, చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగానే ఆయన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను, ఉత్తర ప్రదేశ్‌లో ఎస్‌పీ నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌ను, బీఎస్‌పీ నాయకురాలు మాయావతిని, తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ను స్వయంగా వెళ్లి కలిశారు.

రాష్ట్రాల పరిధిలో ఉండాల్సిన అంశాలను కేంద్రం తన అధీనంలో ఉంచుకుని సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నది కాబట్టి ఆ అధి కారాలను సాధించుకోవడానికి కేంద్రం మీద పోరాటానికి అవసరమైన శక్తిని సమకూర్చుకుందాం రండి అని కేసీఆర్‌ ఈ నాయకులను కోరారు. ఆయనా, ఆయన కలిసిన నాయకులూ కూడా ఇవి ప్రాథమిక చర్చలు మాత్రమే, ముందు ముందు మళ్ళీమళ్ళీ కలిసి చర్చించుకుంటాం, సమాఖ్య స్ఫూర్తికి ఉపయోగపడే విధంగా రాష్ట్రాలకు మరిన్ని హక్కులు సాధించుకునే క్రమంలో ఈ చర్చలు తోడ్పడతాయి అని చెపుతున్నారు. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ, బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వాల వల్ల రాష్ట్రాలు ఈ లక్ష్యం సాధించుకోలేక పోతున్నాయి కాబట్టి ఒక బలమైన మూడో ప్రత్యామ్నాయం అవసరం అని చాలామంది నాయకులు భావిస్తున్నారు. అది నిజం కూడా.

జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీల నాయకత్వాల మీద ఒత్తిడి తెచ్చి తమ తమ రాష్ట్రాలకు కావలసిన మొత్తంలో నిధులు కానీ ఇతర సౌకర్యాలు కానీ రాబట్టుకోలేవు. అక్కడక్కడా, అప్పుడప్పుడూ కొద్దిమంది సమర్థులయిన నాయకులు సీఎంలుగా ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర నాయకత్వాలను ప్రభావితం చేసి కావలసిన పనులు చేయించుకోవడం చూశాం. కానీ అన్నివేళలా అది సాధ్యం కాదు. అందుకే కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రత్యామ్నాయం ఒకటి ఈ దేశానికి అవసరమే. అయితే ఆ దిశగా గతంలో జరిగిన ఒకటి రెండు ప్రయత్నాలు విఫలం అయిన మాట నిజం. అట్లాంటి ఒక ప్రయత్నం యునైటెడ్‌ ఫ్రంట్‌ (యుఎఫ్‌)ను నట్టేట ముంచి పోయిన నాయకుడు చంద్రబాబు. ఆ ఫ్రంట్‌ కన్వీనర్‌ పదవికి రాజీనామా కూడా చెయ్యకుండానే బీజేపీతో జతకట్టిన నాయ కుడు ఆయన. ఒక ప్రయత్నం విఫలం అయిందని, ఒక నాయకుడు మోసం చేశాడని వదిలెయ్యకూడదు కదా. ఇప్పుడు కేసీఆర్‌ మళ్ళీ ఒక ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం చేస్తున్నానని చెపుతున్నారు. ఇంకా దానికి ఒక స్వరూపం అంటూ రాలేదు. 

అందులో భాగంగానే ఆయన  ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్‌కి స్వయంగా ఫోన్‌ చేసి తన పార్టీ ప్రతినిధి బృందాన్ని పంపుతున్నానని చెప్పారు. జగన్, కేటీఆర్‌ బృందాల సమాలోచనలు జరుగుతున్న సమ యంలోనే మళ్ళీ ఒకసారి కేసీఆర్‌ జగన్‌కు ఫోన్‌ చేసి తాను స్వయంగా అమరావతికి వచ్చి మరొకసారి జగన్‌తో చర్చలు జరుపుతాననీ, ఇవి ప్రాథమిక సమాలోచనలు మాత్రమే అని చెప్పారు. ఇంటికి వస్తామన్న కేటీఆర్‌ బృందాన్ని జగన్‌ భోజనానికి ఆహ్వానించారు. అమరావతికి వస్తానన్న కేసీఆర్‌నీ జగన్‌ తన నూతన గృహ ప్రవేశానికి ఆహ్వానించారు. భేటీలో ఏం మాట్లాడుకున్నారో జగన్, కేటీఆర్‌లు మీడియాకు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు, సమస్యలు పరిష్కారం కావని, దాన్ని సాధించుకోవడానికి ఏపీలోని 25 లోక్‌సభ స్థానాలకు మరింత సంఖ్యాబలం తోడైతే బాగుంటుంది కాబట్టి, అందుకు తాము సిద్ధంగా ఉన్నాం అని టీఆర్‌ఎస్‌ కూడా చెపుతున్నది కాబట్టి వాళ్ళతో ఆ పరిమితుల్లో కలిసి పనిచేసే విషయం పరిశీలిస్తామని జగన్‌ చెప్పారు. రాజ్యసభలో తమ నాయకుడు కేశవరావు, లోక్‌సభలో తమ సభ్యురాలు కవిత ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారనీ, కేసీఆర్‌ కూడా ప్రధానికి లేఖ రాయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారనీ కేటీఆర్‌ చెప్పారు. ఇదీ జరిగింది. 

వేర్వేరు పార్టీల నాయకులు తమ తమ పార్టీల ప్రయోజనం కోసం, తమ తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల సంక్షేమం కోసం సైద్ధాంతిక విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచెయ్యడం కొత్త విషయం ఏమీ కాదు. టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుల మధ్య జరిగిన తొలి సమావేశాన్ని ఆ కోణంలో నుండే చూడాలి. రెండు రాష్ట్రాల ప్రజలూ అలాగే చూస్తారు. ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య సంఘర్షణ కాకుండా సహజీవనం కోరుకుంటున్నారు కాబట్టి. ఈ సమావేశం ముగిసిన వెంటనే పెద్ద ఎత్తున తెలుగు దేశం నాయకులు విరుచుకు పడ్డారు ఎందుకని? ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తు న్నారు? అధికారం శాశ్వతం చేసుకోవాలన్న దుగ్ధ. ప్రతిపక్ష నాయకుడు జగన్‌ 14 మాసాలు 3,648 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి దాదాపు రెండు కోట్లమంది సామాన్య ప్రజలను ముఖాముఖి కలుసు కుని వాళ్ళ సమస్యలు విని వాటికి పరిష్కారాలు అన్వేషించే క్రమంలో పలు కార్యక్రమాలను ప్రకటించి అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామనిపేర్కొని అపూర్వ ప్రజాదరణ పొందడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డ అధికార పక్షం, బాబు ఈ భేటీని అడ్డు పెట్టుకుని అప్రతిష్ట పాలు చెయ్యడానికి ఒక అవకాశం దొరికిందని సంబరపడ్డారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం అనే అంశాన్ని అర్జెంటుగా తెర మీదకు తెచ్చారు. 

చంద్రబాబు, ఆయన మంత్రులూ, నాయకులూ, వాళ్ళ అనుకూల మీడియా గగ్గోలు పెడుతున్నట్టుగా జగన్‌ టీఆర్‌ఎస్‌ నాయకులతో మాట్లాడటమే ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే పని అయితే ఈ నాలుగున్నర ఏళ్ళ కాలంలో ఆ పని చేసింది చంద్రబాబు, ఆయన పార్టీ వారే. రాష్ట్ర విభజన కోసం చంద్రబాబు ఇచ్చిన లేఖతోనే కదలిక వచ్చింది. బాబు లేఖ, సోనియా గాంధీ దురాలోచనా కలిసి తెలంగాణ ఏర్పాటును వేగవంతం చేశాయి. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నవాడని గెలిపించి అధికారం కట్ట బెడితే రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల సంక్షేమం కోసం పని చెయ్యకపోగా... అధికారంలోకి వచ్చిన కొద్దిరోజు ల్లోనే తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరత పాలు చెయ్యడం కోసం కుట్ర పన్ని రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయి రాత్రికి రాత్రి హైదరాబాద్‌ వదిలి వెళ్లి ఆంధ్ర ప్రజల ప్రతిష్ఠను దిగజార్చిన ఘనత చంద్రబాబుది. ఆ కేసు ముందుకు సాగకుండా సంధి చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను తాకట్టు పెట్టింది బాబు. తెలంగాణ సీఎంని అమరావతి శంకు స్థాపనకు ఆహ్వానించి శిలాఫలకం మీద ఆయన పేరు చెక్కించినప్పుడు దెబ్బతినని ఆత్మాభిమానం జగన్‌ ఒక్కసారి కేటీఆర్‌ను కలిస్తే దెబ్బతిన్నదా? 

పదేళ్ళు హైదరాబాద్‌లో ఉండటం కోసం కోట్లాది రూపాయల ఆంధ్రప్రదేశ్‌ ప్రజల డబ్బు ఖర్చు చేసి విలాసవంతంగా మరమ్మతులు చేయించిన కార్యాలయాలూ, వసతి గృహాలు, సొంత ఇల్లూ అన్నీ వది లేసి పారిపోవడం ఏ ఆత్మాభిమానాన్ని రక్షించడం కోసం? కేసీఆర్‌ దుర్గ గుడి దర్శనానికి వస్తే, తిరుమల వెంకన్న దర్శనానికి వస్తే అడుగులకు మడుగులొత్తిన మంత్రులు ఇప్పుడు జగన్‌ని ఏ ముఖం పెట్టుకుని నిందిస్తున్నారు? కేసీఆర్‌ నిర్వహించిన యజ్ఞ యాగాదులకు జగన్‌ కాదు వెళ్ళింది చంద్రబాబు ఆయన అనుచరులు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో జగన్‌ పనిగట్టుకుని కేసీఆర్‌ను కానీ ఆయన ప్రభుత్వంలో మరేవరి నయినా కానీ కలవలేదే! బావమరిది మృతదేహం దగ్గర కూర్చుని తాను ఈ స్థాయిలో నిలబడటానికి కారకుడయిన ఆయన మరణానికి చింతించకుండా టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం వెంపర లాడింది చంద్ర బాబు కానీ జగన్‌ కాదు కదా. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆత్మాభిమానం చంద్రబాబు కారణంగానే కదా పదేపదే దెబ్బతింటున్నది.

అధికారం చేజారిపోతుందని స్పష్టంగా తెలిసిపోయాక ప్రజలను రెచ్చగొట్టి మళ్ళీ ఓట్లు సంపా దించుకోవాలన్న దురాలోచనతో వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్‌ కలిసి పోతాయని నమ్మించే విఫలయత్నం బాబుది. బీజేపీతో కలిసినా, టీఆర్‌ ఎస్‌తో కలిసినా, కాంగ్రెస్‌తో కలిసినా అధికారం కోసం నీతిబాహ్యమైన పొత్తులు కుదుర్చుకున్న చరిత్ర చంద్రబాబుది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అత్యంత అవసరం అయిన ప్రత్యేక హోదాను నాలుగేళ్ళకు పైగా బీజేపీకి తాకట్టుపెట్టి, తప్పని పరిస్థితుల్లో మళ్ళీ ఆ నినాదాన్ని అందుకుని కొద్ది రోజుల్లోనే అది మరిచిపోయి దేశాన్ని, వ్యవస్థలనూ కాపాడటం పేరుతో కాంగ్రెస్‌ పంచన చేరిన చంద్రబాబు కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆత్మ గౌరవానికి పదేపదే భంగం కలిగిందనే విషయం గుర్తించాలి. తెలంగాణలో ఇంకో అయిదేళ్ళు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలూ సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. రాజకీయ అవసరాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలను పెంచకుండా సామరస్యం పెంచే పక్షం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావాలి. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆలోచించి ఎన్నికల వైపు అడుగు వెయ్యాలి.


- దేవులపల్లి అమర్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top