రొమ్ము క్యాన్సర్‌ తగ్గాక గర్భం ధరించవచ్చా..?

రొమ్ము క్యాన్సర్‌ తగ్గాక గర్భం ధరించవచ్చా..?


పరిపరిశోధన



రొమ్ము క్యాన్సర్‌ వచ్చి తగ్గాక గర్భం ధరించాల్సి వస్తే... మహిళలు నిర్భయంగా ఆ పరిస్థితిని ఆహ్వానించవచ్చు అంటున్నారు అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ క్లినికల్‌ ఆంకాలజీ నిపుణులు. నిజానికి క్యాన్సర్‌ తగ్గిన మహిళలు గర్భం ధరిస్తే... రొమ్ము క్యాన్సర్‌ తిరగబట్టే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని 1,207 మంది మహిళలపై నిర్వహించిన తమ అధ్యయనంలో తేలిందని వారు అంటున్నారు.ఈ అధ్యయన ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఉదాహరణకు క్యాన్సర్‌ వచ్చి తగ్గాక గర్భం ధరించిన 333 మందిని ఒక గ్రూపుగానూ, గర్భం ధరించని వారిని మరో గ్రూపుగానూ విభజించి, ఈ రెండు గ్రూపులలోని వారిని నిశితంగా  పరిశీలించారు. ఈ పరిశీలన దాదాపు పన్నెండున్నర ఏళ్ల పాటు సాగింది.



రొమ్ముక్యాన్సర్‌ వచ్చి తగ్గాక గర్భం ధరిస్తే... ఆ పరిణామం కారణంగా వెలువడే అధిక హార్మోన్‌ స్రావాల వల్ల రొమ్ములోని క్యాన్సర్‌ గడ్డలు తిరగబెట్టి, మళ్లీ క్యాన్సర్‌కు దారితీయవచ్చేమోనని అంతకుమునుపు ఆందోళన చెందేవారు. అయితే అది అంతగా భయపడాల్సిన అంశం కాదని ఈ పరిశోధనలో తేలింది. క్యాన్సర్‌ వచ్చి తగ్గాక గర్భధారణ జరిగిన మహిళల్లో అది తిరగబెట్టిన కేసులు మిగతా వారిలో ఎన్ని ఉన్నాయో గర్భధారణ జరగని వారిలోనూ దాదాపు అంతే ఉన్నాయి. ఇక రొమ్ము క్యాన్సర్‌ వచ్చి తగ్గాక గర్భం ధరించినవారిలో (ఈ అధ్యయనంలో పాల్గొన్న వారు) 25 మంది మహిళలు మిగతా అందరిలాగే తమ బిడ్డలకు రొమ్ముపాలు పట్టించగలిగారు.



‘‘మా అధ్యయన ఫలితాలను బట్టి రొమ్ము క్యాన్సర్‌ వచ్చి తగ్గాక గర్భం ధరించిన మహిళల్లో ఆ తర్వాత ఆ క్యాన్సర్‌ తిరగబెట్టే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని తేలింది.  కాబట్టి గర్భం ధరించాలనుకున్న వాళ్లను నిరుత్సాహపరచాల్సిన అవసరం లేదని మా అధ్యయనం చెబుతోంది’’ అని నిపుణుల బృందం వివరించింది. అయితే ఇలా గర్భం ధరించాల్సిన మహిళలు ముందుగా డాక్టర్‌ను సంప్రదించాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top