పాప ముక్కు నుంచి తరచూ రక్తం?

Blood from the nose is often blood - Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

ఈఎన్‌టీ కౌన్సెలింగ్‌

మా పాప వయసు ఎనిమిదేళ్లు. ఆమె ముక్కు నుంచి తరచూ రక్తం కారుతోంది. డాక్టర్‌కి చూపించి ట్రీట్‌మెంట్‌ తీసుకున్నాం. కానీ మళ్లీ వెంటనే నాలుగు నెలల్లో తిరిగి రక్తస్రావం మొదలైంది. జలుబు కూడా తరచూ వస్తుంటుంది. ముక్కులో వేళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. దీనివల్ల ఇలా అవుతోందా లేక ప్రమాదకరమైన జబ్బు వేరే ఏదైనా ఉండవచ్చా? మా సమస్యకు పరిష్కారం చూపండి.
– రాగిణి, నిజామాబాద్‌

ముక్కు చాలా సున్నితమైన భాగం. ముక్కులోని భాగాలు కూడా చాలా సున్నితంగా ఉంటాయి. కొన్నిసార్లు చిన్న ఒత్తిడికి లోనైనా రక్తస్రావం అవుతుంటుంది. ముక్కులో వేళ్లు పెట్టుకునే అలవాటు ఉన్న వారిలో చేతి గోళ్ల వల్ల, గట్టిగా తిప్పడం వల్ల లోపలి భాగాలకు దెబ్బతగలడం వల్ల రక్తస్రావం అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇలా ముక్కు నుంచి రక్తం కారడాన్ని వైద్య పరిభాషలో ఎపిస్టాక్సిస్‌ అంటారు. ఈ ఒక్క సమస్య మాత్రమే గాక పాపకు తరచూ జలుబు చేస్తుందంటున్నారు కాబట్టి మీ పాపకు అడినాయిడ్‌ ఇన్ఫెక్షన్‌ కూడా ఉండవచ్చేమో చూడాలి. దీనివల్ల కూడా తరచూ జలుబు రావడానికి అవకాశం ఉంది. మీరు మొదట ఈఎన్‌టీ వైద్య నిపుణులను సంప్రదించి వారితో చెవి, ముక్కు, గొంతు భాగాలలో వారు సూచించిన విధంగా అవసరమైన పరీక్షలు చేయించుకోండి. అడినాయిడ్స్‌ ఉన్నట్లయితే అడినాయిడ్‌ ఎక్స్‌రే, ఎండోస్కోపీ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. మొదట మీరు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. మీ పాప ముక్కులో వేళ్లు పెట్టుకోకుండా చూడండి. తన గోళ్లు ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండండి. అలాగే రక్తం రావడం మొదలు కాగానే వెంటనే ముక్కు రంధ్రాలను కాస్త ఒత్తిడి కలగజేస్తూ గట్టిగా పట్టుకోవాలి. తర్వాత ఐస్‌ క్యూబ్స్‌తో ముక్కుపై అద్దండి. ఇలా ఐస్‌ప్యాక్‌తో ముక్కు పైభాగంలో రుద్దుతూ ఉండటం వల్ల పాపకు ఉపశమనం కలుగుతుంది. అయితే ముక్కు నుంచి రక్తస్రావం అన్నది ఇతర కారణాలతో జరిగినప్పుడు దానికి తగిన చికిత్స ఇప్పించడం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అలాంటి సమస్య ఏదైనా ఉందేమో తెలుసుకోవడం కోసం ఒకసారి ఈఎన్‌టీ నిపుణుడిని సంప్రదించండి.

మాటిమాటికీ జలుబు..?
నాకు తరచూ జలుబు చేస్తోంది. గత ఐదేళ్ల నుంచి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. దాంతో చాలా బలహీనంగా మారుతున్నాను. రోజువారీ పనులు కుదరడం లేదు. జలుబు టాబ్లెట్‌ వేసుకుంటే తగ్గుతుంది. ఆ తర్వాత మళ్లీ మళ్లీ వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి.
– సంతోష్, కొత్తవలస

మీరు చెప్పిన వివరాలను పరిశీలిస్తే మీకు ‘నేసల్‌ అలర్జీ’ ఉండవచ్చు అనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఈ సమస్య బాధిస్తోందనీ, దీనివల్ల మీకు ఇబ్బంది ఉందంటున్నారు కాబట్టి దీనికి మీరు సరైన చికిత్స తీసుకోలేదని అనిపిస్తోంది. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందంటే... ముక్కు, చెవి, గొంతు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి. దాంతో ఒక భాగంలో సమస్య వస్తే అది మిగతా రెండు చోట్లా సమస్యలకు దారితీయవచ్చు. యాంటీ అలర్జిక్‌ టాబ్లెట్‌ వాడటం శాశ్వత పరిష్కారం కాదు. దాన్ని ఎక్కువగా వాడటం వల్ల కొన్ని ఇతర సమస్యలు కూడా రావచ్చు. దీనికంటే ‘నేసల్‌ స్ప్రే’లు వాడటం కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. వాటితో సైడ్‌ఎఫెక్ట్స్‌ కూడా తక్కువ. మీరు ముందుగా నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రకారం చికిత్స తీసుకోండి. మీకు అలర్జీ కలిగించే అంశాలను గుర్తించి వాటి నుంచి దూరంగా ఉండండి. అదే  ప్రస్తుతానికి మీకు ఉత్తమమైన పరిష్కారం.

ముక్కు ఎప్పుడూ దిబ్బడ పడ్డట్లు ఉంటోంది!
నాకు ముక్కులో తెలియనిదేదో ఎప్పుడూ అడ్డం పడినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ ముక్కు దిబ్బడ సమస్య నుంచి బయటపడటానికి చాలా రకాల మందులు వాడాను. ప్రస్తుతం మెడికల్‌ షాపుల్లో దొరికే చుక్కల మందు వాడుతున్నాను. అది వాడినప్పుడు మాత్రం సమస్య తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తోంది. ఆ మందుకు అలవాటు పడతానేమోననే  ఆందోళనతో మానేశాను. దాంతో రాత్రంతా ముక్కు రంధ్రాలు మూసుకుపోతున్నాయి. చాలాసార్లు నోటితో గాలి తీసుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నాను. నాకు ఎందుకీ సమస్య? తగిన సలహా, పరిష్కారం సూచించండి.
– పి. రామారావు, నకిరేకల్‌

ఇటీవల వాతావరణ కాలుష్యం పెరిగిపోవడం వల్ల మీరు చెబుతున్న సమస్య చాలా మందిలో కనిపిస్తోంది. పైగా చాలామందిలో అలర్జీ సంబంధిత సమస్యల వల్ల ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలర్జీ సంబంధిత సమస్యలలో బయటపడే లక్షణాలలో ముక్కుకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు ముక్కుదూలం వంకరపోవడమో లేదా అలర్జీ ఉండటమో లేదా ముక్కులో పాలిప్స్‌ ఉండటమో లేదా ఈ సమస్యలన్నీ ఉండటమో జరగవచ్చు. మొదట మీరు నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించి ముక్కుకు సంబంధించిన పరీక్షలు చేయించి, అవసరమైతే సీటీ స్కాన్‌ (పీఎన్‌ఎస్‌) కూడా తీయించాక మీ వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.మీకు ముక్కుదూలం వంకరపోతే దాన్ని ఒక చిన్న ఆపరేషన్‌తో సరిచేయవచ్చు. దీనినే సెప్టోప్లాస్టీ అంటారు. లేదా ముక్కులో పాలిప్స్‌ ఉన్నట్లయితే వాటిని కూడా ఆపరేషన్‌తో తొలగించవచ్చు. అలర్జీ వల్ల వచ్చే సమస్య అయి ఉంటే అందుకు కారణమైన అంశాలకు దూరంగా ఉండటం, ముఖ్యంగా కాలుష్యానికి దూరంగా ఉండటం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తాజా పదార్థాలు మాత్రమే తినడం, చల్లటి వాతావరణానికి, వస్తువులను దూరంగా ఉండటం వంటి చేయడం వల్ల మీ సమస్యను నివారించవచ్చు. కొన్ని రకాల నేసల్‌ స్ప్రేలు వాడటం వల్ల మీ సమస్యను అదుపులో ఉంచవచ్చు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– డాక్టర్‌ ఇ.సి. వినయ కుమార్,
హెచ్‌ఓడి – ఈఎన్‌టి సర్జన్,
అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top