ఆత్మకు లేదు శాంతి

Bhanwari Devi Kidnapped And Murder Case - Sakshi

భన్వారీదేవి

రాజస్తాన్‌లోని జోద్‌పూర్, ఆ చుట్టుపక్కల పరిసరాలను కలిపి ‘మర్వార్‌’ అంటారు. మర్వార్‌ అంటే ‘ఎడారి ప్రాంతం’ అని అర్థం. ఆ ప్రాంతంలో ఇప్పుడు ఓట్ల పంట పండించుకునేందుకు రెండు కుటుంబాల వారు ప్రయత్నిస్తున్నారు. రాజస్తాన్‌లో డిసెంబర్‌ 7న అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులుగా జో«ద్‌పూర్‌ డివిజన్‌లోని ఓసియాన్‌ స్థానానికి దివ్య మదెర్నా, లూనీ స్థానానికి మహేంద్ర బిష్ణోయ్‌ పోటీ చేస్తున్నారు. దివ్య.. మహిపాల్‌ మదెర్నా కూతురు. మహేంద్ర.. మల్ఖాన్‌ బిష్ణోయ్‌ కుమారుడు.

ఆ అమ్మాయి తండ్రి, ఈ అబ్బాయి తండ్రి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఒక సెక్సు కుంభకోణంలో ఏడేళ్ల క్రితం జో«ద్‌పూర్‌ డివిజన్‌లో జరిగిన భన్వారీ దేవి అనే నర్సు కిడ్నాప్‌–హత్య కేసులో వీళ్లిద్దరూ.. విచారణకు పెద్దగా సమయం పట్టకుండానే.. దోషులుగా నిర్ధారణ అయి, ఆరేళ్లుగా జైలు శిక్షను అనుభవిస్తున్నారు. భన్వారీ హత్య జరిగే నాటికి మహిపాల్‌.. అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రి. మల్ఖాన్‌.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే. వాళ్లు జైల్లో ఉండగానే 2013 ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు 2018 ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ రెండు ఎన్నికల్లోనూ తమ స్థానాలలో తమ వారసులకే టికెట్‌లు లభించేలా జైలు నుంచే వీళ్లు మంతనాలు జరపగలిగారు. ‘‘మా నాన్నను కుట్ర పన్ని ఇరికించారు. ఆయన నా దగ్గర లేకపోవడం నా జీవితంలో పెద్ద లోటు. ఈ ఎన్నికల్లో గెలిచి ఆయన పరువు నిలబెడతాను’ అని మహిపాల్‌ కూతురు దివ్య అంటోంది. మహిపాల్‌ను అరెస్ట్‌ చేసినప్పుడు జాట్‌ కులస్థులు ఆగ్రహోదగ్రులయ్యారు. మల్ఖాన్‌ అరెస్టు సమయంలో బిష్ణోయ్‌లు ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు చేశారు. ఈ రెండు కులస్థులదీ ఓ మోస్తరు ఓటు బ్యాంకు.

ఆ వోటు బ్యాంకును కాపాడుకుంటూ వస్తున్న క్రమంలోనే ఇప్పుడూ ఆ రెండు కుటుంబాల్లోని పిల్లలకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ఇచ్చింది. 2013 ఎన్నికల్లో మహిపాల్‌ భార్య లీల, మల్ఖాన్‌ తల్లి ఆమ్రీదేవి కాంగ్రెస్‌ అభ్యర్థులుగా పోటీ చేశారు. ఆశించిన విధంగా సానుభూతి దక్కకపోవడంతో ఇద్దరూ ఓడిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో నిలబడిన దివ్యదీ, మహేంద్రదీ సుసంపన్నమైన అనువంశిక రాజకీయ వారసత్వం. దివ్య తాతగారు పరాశ్రమ్‌ మదెర్నా తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్‌కి ఆయన శక్తిమంతమైన జాట్‌ అభ్యర్థి.

దివ్య తండ్రి రెండుసార్లు ఎమ్మెల్యేగా, కొంతకాలం మంత్రిగా ఉన్నారు. దివ్య తల్లి లీల కాంగ్రెస్‌లో క్రియాశీల కార్యకర్త. మహేంద్ర బిష్ణోయ్‌ తాతగారు రామ్‌సింగ్‌ బిష్ణోయ్‌ ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. మహేంద్ర తండ్రి మల్ఖాన్‌ జైలుకు వెళ్లబోయేముందు వరకు కూడా ఎమ్మెల్యే. ‘‘నా తండ్రి కోసమైనా నేను ఈ ఎన్నికల్లో గెలిచితీరుతాను’’ అని మహేంద్ర అంటున్నాడు. అయితే భన్వారీ ‘ఆత్మ’ ఘోష వీళ్లను గెలవనివ్వదన్న ప్రచారం జోద్‌పూర్‌ డివిజన్‌లో జరుగుతోంది.

భన్వారీ కిడ్నాప్‌ – హత్య కేసు
2011 సెప్టెంబర్‌ 1న భన్వారీదేవి అదృశ్యం అయ్యే నాటికి ఆమె వయసు 36 ఏళ్లు. జోద్‌పూర్‌ జిల్లాలోని జలివాడ ఉప ఆరోగ్య కేంద్రంలో నర్సుగా పనిచేస్తున్నారు. డెక్కన్‌ హెరాల్డ్‌ కథనం ప్రకారం.. రూపవతి అయిన భన్వారీకి అధికార కాంగ్రెస్‌ పార్టీలోని రాజకీయనాయకులతో సన్నిహిత పరిచయాలున్నాయి. ఆ పలుకుబడితో రెండేళ్ల తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ కోసం ప్రయత్నించి ఆమె నిరాశకు గురై, తనని నమ్మిన రాజకీయ నాయకుల్ని బ్లాక్‌మెయిల్‌ చెయ్యడం మొదలు పెట్టారు. ఆ క్రమంలోనే ఓ సెక్సు కుంభకోణానికి సాక్షిగా మారారు. అది ఆమె కిడ్నాప్‌కు, హత్యకు దారి తీసింది. ఇందుకు కుట్ర పన్నారన్న నేరారోపణ నిజం కావడంతో మహిపాల్‌ మదెర్నా, మల్ఖాన్‌ బిష్ణోయ్‌లకు జైలు శిక్ష పడింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top