ముఖమా! ముత్యమా!

Beauty Tips All Teenagers Need to Follow - Sakshi

బ్యూటిప్స్‌

మార్చి, ఏప్రిల్, మే.. మూడు నెలలు ఎండలు దంచి కొట్టాయి. రోట్లో స్వయానా మనమే ఎండు మిరపకాయలు దంచి కొట్టినా ఇంతగా మంటెత్తిపోదేమో. ప్రచండుడు ప్రతాపం చూపించాడు. రెండు మూడు రోజుల్లో రుతు ³వనాలు అంటున్నారు. వానలే వానలు. సంతోషమే కదా. భూమి చల్లబడుతుంది. మన ఇళ్లూ, ఒళ్లూ చల్లబడతాయి. అయితే ఇన్నాళ్లూ ఎండలకు ఛాయ తగ్గిన మోము మాటేమిటి? మెల్లిగా మునుపటి మెరుపులోకి తెచ్చుకోవలసిందే. అయితే అందుకోసం గొడుగు వేసుకుని సూపర్‌ బజార్‌కి పరుగెత్తే పని లేదు.

ఇంట్లో ఉండి, ఇంట్లో ఉండేవాటితో ముఖ కాంతిని చల్లని చంద్రకాంతిలా వెలిగించుకోవచ్చు. ‘ఒట్టిమాటలు కట్టిపెట్టోయ్‌.. గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌’ అంటున్నారా.. ఇంటి క్రీమ్‌లు అనగానే! క్రీమ్‌లు కావివి. కీర దోసకాయలు, బేసన్‌ ఫ్లోర్‌.. (సెనగపిండి), పసుపు, పెరుగు, తేనె, నిమ్మ, పాలు. అంతే! అన్నిటినీ కలిపి ముఖానికి టచింగ్‌ ఇవ్వమనడం లేదు. కాంబినేషన్‌లతో మూడు రకాలుగా ప్రయోగిస్తే చాలు. వా..డా..య్‌.. అంటూ మీ ముఖంలోకి కాటుక లేని అందమైన చంద్రముఖి వచ్చేస్తుంది.

దోస్కాయ్‌ తీస్కోండి
దోసంటే కీర దోస. రౌండ్‌గా చక్రాల్లా కొయ్యండి. రౌండ్‌గా ఎలా కొయ్యాల్రా దేవుడా అని కంగారు పడకండి. కళ్లు మూసుకుని కోసినా.. కీర చక్రాలు చక్రాలుగానే వస్తుంది. ఆ చక్రాలను కళ్ల మీద పెట్టుకోనవసరం లేదు. మెల్లిగా ముఖమంతా రుద్దండి. ఒకే చక్రాన్ని కాదు. ముఖానికంతటికీ చాలినన్ని చక్రాలు. ఇప్పుడు ముఖమంతా కీరా అయింది కదా. అదే.. కీరా రుద్దడంతో తడితడిగా అయింది కదా. ఆ తడిని పది నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేయండి. వెంటనే మెరిసిపోతుందా ముఖం?! మెరుపు కనిపిస్తుంది.. మంచి మెరుపు కోసం వారానికి రెండుసార్లైనా కీరాను కొయ్యాల్సిందే.

సెనగ ప్యాక్‌ వేస్కోండి
కీరాతో రుద్ది కడిగాక సెనగ ప్యాక్‌ వెయ్యమని కాదు. అది వేరు. ఇది వేరు. ఇదింకో టైప్‌ ఆఫ్‌ ట్రీట్‌మెంట్‌. ట్రీట్‌మెంట్‌ అనే మాట బాగోలేదా! అయితే సౌందర్యసాధనం అందాం. రెండు టేబుల్‌స్పూన్‌ల సెనగ పిండి తీసుకోండి. బజ్జీలు వేసే సెనగపిండే. ఇక రెండు టేబుల్‌స్పూన్లంటే రెండు రెండు చిన్న కూరగరిటెలంత. టీస్పూన్‌ లెక్క వేరు. కాఫీని, టీని కలపడానికి ఉపయోగించే స్పూన్‌ టీస్పూన్‌. సరే, ఇవి మీకు తెలియనివా కానీ, ఇప్పుడేం చేస్తారంటే సెనగపిండిలో టీ స్పూను పసుప్పొడి కలపండి.

అందులోనే ఒక టేబుల్‌ స్పూన్‌ పెరుగు వెయ్యండి.మూడింటినీ మిక్స్‌ చెయ్యండి. బాగా పేస్ట్‌లా వచ్చేయాలి. ఆ పేస్ట్‌ని బ్రష్‌తో ముఖానికికంతటికీ అద్దండి. మళ్లీ ఈ బ్రెష్‌ ఎక్కడి నుంచి తేవాలి! ఫేస్‌ప్యాక్‌ బ్రెష్‌ అని బయట అమ్ముతారు కానీ.. అక్కర్లేదు, వేళ్లతో మృదువుగా ముఖానికి పామేయండి. అదంతా ఆరిపోయేవరకు ఆగి,  ఆ తర్వాత శుభ్రంగా కడిగేయండి. చల్లని నీళ్లతోనే. ముఖం తళతళ. మార్పు ఇమ్మీడియెట్‌గా కనిపిస్తుంది.

తేనె, నిమ్మ రాస్కోండి
రెండు చిన్నగరిటెల తేనె, ఒక టీస్పూన్‌ నిమ్మరసం కలపండి. మంచి వాసనొస్తుంది. తినబుద్ధవుతుంది. తినకండి. మనం పెట్టుకున్న పని వేరే కదా. ఆ సెషన్‌ (తినే సెషన్‌) మరోసారెప్పుడైనా పెట్టుకుందాం. ఇప్పుడైతే ముఖానికి పూసుకోండి. పావు గంట తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.ఈ మూడు ట్రిక్‌లలో (మీ ముఖం ఎలా ఇంతగా మెరిసిపోతుంది అని అడిగినవారికి చెప్పకపోతే అది ట్రిక్కే కదా).. ‘చల్లటి నీరు’ అనే మాట కనిపించింది కదా. చల్లటి నీరు అంటే ఫ్రిజ్‌లోని వాటర్‌ కాదు. ముఖానికి హాయినిచ్చేంత చల్లగా ఉండే నీరు.

ఎటూ వర్షాలు మొదలై వాతావరణ చల్లబడబోతోంది కాబట్టి ట్యాంకులోని నీళ్లు, తొట్లలోని నీళ్లు, బిందెల్లోని నీళ్లు చల్లగానే ఉంటాయి. అవి చాలు. ఓ మగ్గు నీటితో మెరిసేయొచ్చు.. ఒకవేళ వర్షాలొచ్చినా.. మీ కాలనీలో నీళ్లు రాకపోతుంటే.గుర్తుంచుకోండి.. ఈ మూడు ఒకేసారి, ఒకే రోజు చేయవలసినవి కాదు. మీ మూడ్‌ని బట్టి, మీ టైమ్‌ని బట్టి, కిచెన్‌లో మీకు అందుబాటులో ఉన్నవాటిని బట్టి ఏదో ఒకటి ఎంచుకుని చెయ్యండి. ఇంకో రోజు ఇంకోటి.. తర్వాత ఇంకోటి.. ఇలా!వెలిగిపోతున్న మీ ముఖాన్ని చేసి, అంత కాంతిని భరించలేక సూర్యుడే తన కళ్లకు చెయ్యడ్డు పెట్టకోవాలి. దెబ్బకు దెబ్బ తియ్యకుండా ఊరుకుంటామా మరి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top