బాలగోకులం | Balagokulam | Sakshi
Sakshi News home page

బాలగోకులం

Jan 20 2014 11:46 PM | Updated on Sep 2 2017 2:49 AM

బాలగోకులం

బాలగోకులం

పిల్లల భాషలో ఆనందంగా గడపడం అంటే ఆడుకోవడమొక్కటే. ఆటపాటలతో ఒళ్లు అలిస్తేనే వాళ్లకు మనసు ఉల్లాసంగా ఉంటుంది.

పిల్లల భాషలో ఆనందంగా గడపడం అంటే ఆడుకోవడమొక్కటే. ఆటపాటలతో ఒళ్లు అలిస్తేనే వాళ్లకు మనసు ఉల్లాసంగా ఉంటుంది. మనుషులంతా ఒక్కటే అన్న మాటకు అర్థం ఒక్క ఆటలోనే వాళ్లు నేర్చుకోగలరు. పిల్లలకు ఆటలెంత అవసరమో అనడానికి ఇలా... బోలెడు కారణాలు చెప్పుకోవచ్చు. కాని ఓ గంట వారితో ఆటలాడించే తీరిక ఎంతమందికి ఉంది? బాలగోకులం గురించి తెలుసుకుంటేగాని ఈ తీరిక విలువ తెలియదు మనకి.
 
ఒకోసందర్భంలో డబ్బు కంటే సమయం చాలా విలువైంది. ఆ సమయంలో మనం చేసే పనులను బట్టి ఆ విలువ మరింత పెరుగుతుంది. పుస్తకాల ప్రపంచంలో పడి తలకిందులవుతున్న చిన్నారులను కాసేపు బయటికి తీసుకెళ్లి నాలుగు రకాల ఆటలాడించే పరిస్థితి ఎక్కడా కనపించడం లేదు. ఆ లోటుని పూరించడానికి వచ్చిందే బాలగోకులం. పిల్లలకోసం కాసింత సమయం కేటాయించడం ఇష్టమైన వారు బాలగోకులంలో సభ్యులుగా చేరి వారి చుట్టుపక్కలున్న చిన్నారి పిల్లల్ని ప్రతి ఆదివారం ఓ గంటన్నరపాటు ఆటలు ఆడించాలి. అదే బాలగోకులం. ముప్పైఏళ్లక్రితం కేరళలో మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడు పొరుగుదేశాలకు కూడా వెళ్లింది. ప్రస్తుతం మన రాష్ర్టంలో 30 ెకేంద్రాలలో బాలగోకులం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఆదివారం ఉదయం 7:30 నుంచి 9 గంటలవరకు ఈ ఆటల కార్యక్రమం కొనసాగుతుంది.
 
ఆన్‌లైన్ సిలబస్...
 
బాలగోకులం ఆటలకు సంబంధించిన వివరాలాన్నీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. బాలగోకులం డాట్‌కామ్‌లో ఏ రోజు ఏ ఆటలు ఆడించాలో వివరాలు ఉంటాయి. ఈ కేంద్రాలున్న అన్ని చోట్లా ఒకటే సిలబస్‌ని ఫాలో అవుతారు. ఈ కేంద్రాలు ఎవరు నడుపుతారంటారా! ఆసక్తి ఉన్న యువకులే ముందుకొస్తున్నారు.
 
‘‘నాకు బాలగోకులం గురించి తెలిసిన వెంటనే ఓ పదిరోజులుపాటు శిక్షణ తరగతులకు వెళ్లాను. తర్వాత మా ఇంటిచుట్టుపక్కలున్న పిల్లల తల్లిదండ్రులను కలిసి ప్రతి ఆదివారం దగ్గరలో ఉన్న పార్కుకి పంపమని అడిగాను. మొదట్లో ముగ్గురు నలుగురు పిల్లలే వచ్చారు. ప్రస్తుతం అరవైమంది పిల్లలవరకూ వస్తున్నారు. బాలగోకులం కార్యకలాపాల వల్ల పిల్లల్లో మంచి మార్పులు వచ్చాయని వారి తల్లిదండ్రులు చెబుతుంటే చాలా సంతోషమేస్తుంది. నేను ఓ ప్రయివేటు ఉద్యోగిని. వారంలో ఒక గంటన్నర నాది కాదనుకుంటే పిల్లలకు ఎనలేని ఆనందాన్ని ఇవ్వొచ్చుకదా అని బాలగోకులంలో సభ్యుడిగా చేరాను’’ అని చెప్పారు హైదరాబాద్ జీడిమెట్ల ప్రాంతానికి చెందిన ఏవీ నారాయణ.
 
ఆటలతోపాటు...
 
బాలగోకులంలో ఆటలతో పాటు ప్రతిరోజు ఒక యోగాసనం ఉంటుంది. అలాగే స్వాతంత్య్ర సమరయోధుల పుట్టినరోజుల్ని జరుపుకోవడం, ఆ  వారి గురించి చర్చించుకోవడం ఉంటుంది. అప్పుడప్పుడు ఉపన్యాసపోటీలు, క్విజ్‌లు ఉంటాయి. వీటితోపాటు చిన్నపిల్లలకు మైండ్ డెవలప్‌మెంట్ గేమ్స్‌లో భాగంగా సంఖ్యామథనం పేరుతో రకరకాల ఆటలు ఆడిస్తారు. అలాగే పరుగు పందేలు, అంత్యాక్షరి వంటివి రెగ్యులర్‌గా ఉంటాయి. దేశభక్తిగీతాలు, దేవుడి పాటలు కూడా నేర్పిస్తుంటారు. భగవద్గీత, రామాయణం, బైబిల్...అన్నింటిలోని పిల్లలకు అర్థమయ్యే  అంశాలను వారికి బోధిస్తారు. ఇవన్నీ ఒక సిలబస్ రూపంలో ఏ వారం ఏంచేయాలో వెబ్‌సైట్‌లో వివరంగా ఉంటాయి. దాన్నిబట్టి బాలగోకులం సభ్యులు ఆరోజు ఏం చేయాలన్న విషయంపై పూర్తి అవగాహనతో ఉంటారన్నమాట.
 
సభ్యులు కావాలంటే...
 
రూపాయి ఖర్చులేకుండా సమాజాన్ని మార్చే గొప్ప ఆయుధం బాలగోకులం అంటారు మియాపూర్‌కి చెందిన ప్రదీప్. ‘‘నేను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. మియాపూర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాను. మాది చాలా పెద్ద అపార్ట్‌మెంట్. సాయంత్రం స్కూళ్లనుంచి రాగానే పిల్లలందరూ టీవీల ముందు కూర్చుండిపోవడాన్ని చూసి తల్లిదండ్రులు కూడా ఏం చేయలేకపోతున్నారు. కనీసం ఆదివారమైనా ఆరుబయట ఆడుకోవడానికి ఎక్కడికి పంపిస్తారు? నేను ఇక్కడ బాలగోకులం మొదలుపెట్టాక పిల్లలకంటే తల్లిదండ్రులే ఎక్కువ సంతోషపడుతున్నారు. ఆటపాటలతో పాటు యోగాసనాలు, క్విజ్‌లు వారిని మరింత హుషారుగా ఉంచుతున్నాయి. వారంలో ఒక గంటన్నర మనది కాదనుకుంటే మన చుట్టుపక్కల పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇచ్చినవారమవుతాము’’ అని ముగించారు ప్రదీప్. నిజమే! ఆటపాటలు లేని బాల్యం భవిష్యత్తులో పెద్ద మూల్యాన్నే చెల్లించుకోవాల్సివస్తుంది. ఆ లోటు లేకుండా చేస్తున్న బాలగోకులాన్ని అందరం పోత్సహించాలి.
 
- భువనేశ్వరి
  ఫొటోలు: శివ మల్లాల

 

Advertisement
 
Advertisement
Advertisement