కరోనా కష్టంతో.. గురుగ్రామ్‌కి ఆవాజ్‌

Awaz To Gurugram Community Radio Coronavirus Times Special Story In Sakshi Family

టీవీలు, ఇంటర్నెట్‌ రాకముందు యుద్ధం, ప్రకృతి  వైపరీత్యం, సంక్షోభం.. ఏది వచ్చినా చెవిలో వేసింది రేడియో! పండితులకూ పామరులకు దగ్గరైంది...ఆబాల గోపాలం అభిమానాన్ని పొందింది! అందుకే రేడియో అంటే  ఆ తరానికి అందమైన జ్ఞాపకమే కాదు.. ఈ తరానికీ క్రేజే! కాబట్టే కదా ప్రధాని మనకీ బాత్‌నూ  రేడియోలోనే వినిపిస్తున్నారు. ఆదరణ ఉండబట్టే కదా ఎఫ్‌ఎమ్‌లుగా ట్రాన్స్‌ఫామ్‌ అయింది.  మూలమూలన ఉన్నవాళ్లను చేరడానికి కమ్యూనిటీ రేడియోగానూ వచ్చింది.. ఢిల్లీ సర్కారు దృష్టిలోనూ పడింది ‘గురుగ్రామ్‌కి ఆవాజ్‌’ అనే కమ్యునిటీ రేడియో.. కరోనా కష్టంతో. 

‘భాయియో.. ఔర్‌ 
బహెనో.. గురుగ్రామ్‌కి ఆవాజ్‌ సునియే...’ అంటూ  ఉదయమే గొంతు సవరించుకుంటుంది ఢిల్లీ, గురుగ్రామ్‌లోని సెక్టార్‌ 31లో ఉన్న ఈ కమ్యూనిటీ రేడియో స్టేషన్‌.  చుట్టూ పది కిలోమీటర్ల మేర వలస కార్మికులు ఉంటారు. వీళ్లతోపాటు స్థానిక పేదలకూ విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచడానికి ఈ కమ్యూనిటీ రేడియో పనిచేస్తోంది గత పదేళ్లుగా. దీని వ్యవస్థాపకురాలు ఆర్తి జైమన్‌. ఇప్పుడు దీన్ని ఢిల్లీ సర్కారు  
‘కరోనా’ మీద ఆ కమ్యూనిటీవాసుల్లో అవగాహన కల్పించడానికి వేదికగా మార్చుకుంది. 
భోజనం, మందులు.. కౌన్సెలింగ్‌..
వలసకార్మికులతోపాటు స్థానికుల కోసమూ ప్రభుత్వం పంపే ఆహార పొట్లాలు, నిత్యావసరకుల వ్యాన్లు ఏయే సమయాల్లో ఎక్కెడెక్కడికి వస్తాయి? భౌతికదూరం ఎందుకు పాటించాలి? ఏయే ప్రాంతాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయి? ఆ ప్రాంతాలకు వెళ్లడం ఎందుకు నిషిద్ధం వరకు అన్ని వివరాలనూ కమ్యూనిటీ రేడియోలో వినిపిస్తారు. గురుగ్రామ్‌లోని పలు ప్రదేశాల్లో క్వారంటైన్‌ స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటారు. ఒకవేళ ఏ రోజైనా సరుకులు అందకపోయినా చేతిలో డబ్బు లేకపోయినా గాభరా పడకుండా ఆ కొరతను ఎలా అధిగమించాలో కౌన్సెలింగ్‌ ఇస్తూ హెల్ప్‌లైన్‌ నంబర్లనూ చెప్తారు. శానిటైజర్లు, శానిటరీ నాప్‌కిన్స్, మందులూ అందేలా చూస్తోంది స్థానిక నేతల ద్వారా. మొత్తంగా కరోనా కష్టకాలంలో ఈ కమ్యూనిటీ రేడియో గురుగ్రామ్‌ స్థానికులు, వలసకార్మికులకు ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా పని చేస్తోంది. ‘ఈ రోజు రేషన్‌ దొరకలేదు... ఎవరిని అడగాలి? ఇలా ఎన్నాళ్లు ఇళ్లల్లోనే ఉండాలి? జనాలు బయట కనిపిస్తే పోలీసులు కొడుతున్నారంట కదా నిజమేనా? అంటూ రోజుకు కనీసం వంద ఫోన్‌ కాల్స్‌ వస్తూంటాయి మాకు. వాళ్ల సందేహాలు తీర్చి, భయాలు, ఆందోళనలన్నిటినీ పోగొడ్తున్నాం’ అంటున్నారు మూడేళ్లుగా ఆ కమ్యూనిటీ రేడియోలో పనిచేస్తున్న ప్రీతి ఝక్రా. 

కాలినడకన బయలుదేరిన వాళ్లను ఆపేసింది...
లాక్‌డౌన్‌ మొదలవగానే పని దొరక్క బెంబేలెత్తిపోయిన చాలామంది వలస కార్మికులు ఢిల్లీ నుంచి వాళ్ల వాళ్ల ప్రాంతాలకు కాలినడకన వెళ్లిన సంఘటనలు సంచలనమయ్యాయి. గురుగ్రామ్‌ చుట్టుపక్కల ఉన్న వాళ్లు కూడా ముల్లెమూటా సర్దుకున్నారు గురుగ్రామ్‌కి వెళ్లడానికి. అప్పుడు ఆవాజే వాళ్లను ఆపింది. ‘ఇలా కాలినడకన వెళ్లడం ప్రమాదం. ఎక్కడున్నవాళ్లు అక్కడే ఉండిపోండి. మీకే కష్టం కలగకుండా సర్కారు చూసుకుంటుంది అని కొంతమంది స్థానిక నేతలు, ప్రభుత్వ అధికారులతోనూ రేడియోలో మాట్లాడించింది. అప్పటికప్పడు ప్రభుత్వమూ ఆ వలస కార్మికుల కోసం నిత్యావసర సరుకులను, కొంత రొక్కాన్నీ పంపిణీ చేసింది. అంతేకాదు, వలసకార్మికులు ఉంటున్న ఇళ్ల అద్దెను ఒక రెండు నెలలు వాయిదా వేయాలనీ ఇళ్ల యజమానులనూ కోరింది.  

కరోనా లక్షణాల నుంచి లైవ్‌ప్రొగ్రామ్‌ వరకు..
దాదాపు నెల రోజుల నుంచి కరోనా సమాచారానికే అంకితమైన ఈ కమ్యూనిటీ రేడియో ప్రతిరోజూ నలభై నిమిషాల లైవ్‌ ప్రోగ్రామ్‌ను ప్రసారం చేస్తోంది. ఇందులో స్థానిక నేతలతోపాటు రెవెన్యూ, పోలీసు అధికారులూ పాలుపంచుకుంటున్నారు. గురుగ్రామ్‌ వాసులు డిప్రెషన్‌లోకి వెళ్లకుండా కొన్ని వినోద కార్యక్రమాలనూ ప్రసారం చేస్తోంది. వీటన్నిటితోపాటు ఎప్పటికప్పుడు కరోనా అప్‌డేట్స్‌నూ ఇస్తుంటారు. ఈ కార్యక్రమాలన్నిటినీ సింగిల్‌ హ్యాండ్‌ మీద నడిపిస్తున్న రేడియో జాకీ ప్రీతి ఝాక్రా. నిజానికి అయిదుగురు ఉద్యోగులుంటారు. కాని లాక్‌డౌన్‌ ప్రకటించగానే అందరూ వాళ్ల వాళ్ల ఇళ్లకే పరిమితమవడంతో ప్రీతి ఒక్కరే అటు రిపోర్టర్‌గా ఇటు రేడియో జాకీగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు వలంటీర్ల సహాయంతో. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top