కోడిగుడ్లలో మానవ ప్రోటీన్లు

Another benefit to the man is with the eggs - Sakshi

రోజూ కోడిగుడ్డు తింటే ఆరోగ్యానికి మేలని చెబుతూంటారు. ఇందులో నిజం లేకపోలేదుగానీ.. త్వరలోనే కోడిగుడ్లతో మనిషికి ఇంకో ప్రయోజనమూ చేకూరనుంది. ఎడిన్‌బరో యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని కొన్ని రకాల వ్యాధులకు అవసరమైన మందులను కూడా ప్రొటీన్ల రూపంలో కోడి గుడ్ల నుంచి సేకరించవచ్చు. మానవ ప్రొటీన్లను మందులుగా చాలాకాలంగా వాడుతున్నా వాటిని కృత్రిమంగా ఉత్పత్తి చేయడం చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారం.

రకరకాలుగా ముడుతలు పడి ఉండే ప్రొటీన్లను చౌకగా తయారు చేయగలిగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎడిన్‌బరో శాస్త్రవేత్తలు జన్యుమార్పిడి చేసిన కోళ్ల ద్వారా మానవ ప్రొటీన్లు ఉన్న కోడిగుడ్లను ఉత్పత్తి చేసేందుకు పరిశోధనలు ప్రారంభించారు. వీటిద్వారా ప్రొటీన్ల పనితీరుపై పరిశోధనలు చేయాలన్నది లక్ష్యం. అయితే కోడిగుడ్లలోకి చేరిన మానవ ప్రొటీన్లు అచ్చం మనిషిలోని ప్రొటీన్ల పనితీరును కనబరుస్తూండటంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు.

ఉత్పత్తి చేసిన రెండు ప్రొటీన్లు యాంటీవైరల్, యాంటీ కేన్సర్‌ లక్షణాలు ఉన్న నేపథ్యంలో వాటిపై విస్తృత పరిశోధనలు చేపట్టాలని నిర్ణయించారు. సులువైన పద్ధతి ద్వారా ఈ ప్రొటీన్లను వేరుచేసి వాడుకోవచ్చునని కోళ్లను ఉపయోగిస్తూండటం వల్ల ఖర్చు కూడా చాలా తక్కువని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త హెలెన్‌ సాంగ్‌ తెలిపారు. ప్రస్తుతానికి ఈ ప్రొటీన్లను మనుషుల్లో వాడే పరిస్థితి లేదని కాకపోతే సమీప భవిష్యత్తులోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వివరించారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top