గుహ వదిలింది గుండె నిండింది

All 12 boys, coach of Thailand soccer team rescued from cave - Sakshi

పండగ

పిల్లలంతా గుహలోంచి బయట పడ్డారు. కోచ్‌ కూడా బయటికి వచ్చాడు. ఈ అద్భుత ఘటనతో ఒక్క థాయిలాండ్‌ మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలన్నీ కూడా ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌లో తమ జట్టే గెలిచినంతగా సంబరపడుతున్నాయి. 

జూన్‌ 23, 2018. థాయిలాండ్‌ చరిత్రలో మరచిపోలేని రోజు. థాయ్‌ చరిత్రలోనే కాదు.. ప్రపంచ చరిత్రలో కూడా! యంగ్‌ సాకర్‌ టీమ్‌లో ఉన్న 12 మంది విద్యార్థులు ఆడుకుంటూ ఆడుకుంటూ.. థాయిలాండ్‌ గుహల్లోకి వెళ్లారు. అంతే అకస్మాత్తుగా వారంతా మాయమైపోయారు! విద్యార్థులకు ఫుట్‌బాల్‌ నేర్పిస్తున్న కోచ్‌ కూడా ఆ పిల్లలతో పాటు కనపడకుండా పోయారు. అకస్మాత్తుగా వచ్చిన వరదలు వారిని ప్రమాదంలోకి తోసేసాయి. థాయ్‌లాండ్‌లోని కొండప్రాంతమైన చియాంగ్‌ రాయ్‌ ప్రావిన్స్‌లో కొండ గుహలో వీరంతా చిక్కుకుపోయినట్లు తొమ్మిదిరోజుల తరువాత గుర్తించారు. ఈ ప్రాంతం బ్యాంకాక్‌ నగరానికి 825 కి.మీ. దూరంలో ఉంది.

జాడ తెలియడమే పెద్ద అదృష్టం
గుహలో విద్యార్థులు చిక్కుకుపోయిన నాటి నుంచి ఆ పిల్లలు చదువుతున్న స్కూల్‌లో ప్రతిరోజూ మనసులను కదిలించే ఒక దృశ్యం కనిపించేది. మే సాయ్‌ ప్రసిట్‌సార్ట్‌ పాఠశాలలో విద్యార్థులంతా స్కూల్‌ ప్లే గ్రౌండ్‌లో వరుసలలో నిలబడి, తలలు వంచుకుని, చేతులు జోడించి, ‘స్నేహితులంతా క్షేమంగా తిరిగిరావాలి’ అని భగవంతుడిని ప్రార్థించేవారు. ఆ చిన్నారులు జోడించిన చేతులకు భగవంతుడు కొద్దిగా కరుణించాడు. తొమ్మిదిరోజుల పాటు ఆ విద్యార్థులు చేసిన ప్రార్థనలు ఫలించాయి. తప్పిపోయిన పిల్లల జాడ తెలిసింది. గుహలో నాలుగు కిలోమీటర్ల దూరంలో వరద నీటిలో చిక్కుకున్నట్లు గుర్తించారు!

తల్లడిల్లిన స్నేహితులు
‘‘తొమ్మిది రోజుల తరవాత వాళ్లను గుర్తించామని చెప్పడం సంతోషంగా ఉంది. మా స్నేహితులు క్షేమంగా ఉన్నారన్న వార్త నాకు ఆనందం కలిగించింది’’  అన్నాడు తప్పిపోయిన విద్యార్థుల స్నేహితుడైన 14 సంవత్సరాల పువాడెట్‌ కుంగోయెన్‌. ‘‘వాళ్లకు ఏం జరుగుతుందా అని నాకు ఆందోళనగా ఉంది. ఆ గుహలు చీకటిగా, భయంగొలిపేవిగా ఉంటాయి. నేను పొరపాటున కూడా ఆ గుహలోకి వెళ్లడానికి సాహసించలేను’ అని గుండెల మీద చెయ్యి వేసుకున్నాడు 14 ఏళ్ల  కిటిచోక్‌ కొంకావ్‌. గుహలో చిక్కుకున్నవారిలో కొటిచోక్‌ స్నేహితుడు కూడా ఉన్నాడు. విద్యార్థులు గుహలో చిక్కుకుని రోజులు గడిచాయి. వారిని రక్షిద్దామంటే, లోపలకు వెళ్లే ఏకైక మార్గం వరద నీటితో మూసుకుపోయింది. సరదాగా ఫుట్‌బాల్‌ ఆడుకుందామనుకున్న వారితో విధి వింత నాటకం ఆడింది. ‘‘వాడు మళ్లీ తిరిగి వచ్చి, నన్ను సాకర్‌ ఆడమని అడగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అన్నాడు గద్గద స్వరంతో పువాyð ట్‌. తోటి మిత్రులు గుహలో చిక్కుకున్నారన్న వార్త స్కూల్‌ విద్యార్థులకు తెలియగానే ఆ పసి హృదయాలు అల్లాడాయి. ‘‘మా విద్యార్థులు బాధలో ఉన్నారు. ఈ వార్త వినగానే వీరంతా బిగ్గరగా ఏడ్వటం మొదలుపెట్టారు’’ అన్నారు ఆ స్కూల్లోని ఒక టీచరు. ప్రతిరోజూ రాత్రి సమయంలో గుహ దగ్గరకు వెళ్లి, పిల్లలకు సంబంధించిన సమాచారం తెలుసుకుంటూనే ఉంది పాఠశాల యాజమాన్యం. 

బ్రిటిష్‌ ఈతగాళ్లే హీరోలు
‘‘మా పిల్లలకు ఇలా జరుగుతుందని ఎన్నడూ అనుకోలేదు. ప్రస్తుతం పాఠశాలలో ఉన్న పిల్లలకు ‘‘వారంతా అజాగ్రత్తగా ఉండటం వల్లే ఇది జరిగిందని బోధిస్తున్నాను’ అన్నారు మరో టీచరు. ‘‘తప్పిపోయిన విద్యార్థులకు తొమ్మిదిరోజుల పాటు ఎటువంటి ఆహారం లేదు. మంచినీళ్లు లేవు. బయటి ప్రపంచంతో సంబంధం లేదు. కాని ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి. అంతా మంచి జరుగుతుందని, విద్యార్థులందరూ క్షేమంగా తిరిగివస్తారని మనస్ఫూర్తిగా ఆశించడం తప్ప ఏం చేయలేకపోయాం’’ అన్నారు జాంగ్‌పుయాంగ్‌ అనే ఇంకో టీచర్‌. ఎట్టకేలకు గుహలోకి వెళ్లిన ఆ పిల్లలు ‘బాన్‌ వియాంగ్‌పాన్‌ స్కూల్‌’కి సమీపంలో ఉన్నట్టుగా తెలుసుకున్నారు. ఒక బ్రిటిష్‌ ఈతగాడు కొంతదూరం వరకు ఈత కొట్టి వెళ్లి, ‘మీరు ఎంత మంది ఉన్నారు’ అని ప్రశ్నించాడు. అందులో ఒక పిల్లవాడు పదమూడు మంది అని ఇంగ్లీషులో సమాధానం చెప్పాడు. ‘‘మా విద్యార్థి బ్రిటిషు ఈతగాడు అడిగిన ప్రశ్నను అర్థం చేసుకోవడమే కాకుండా, సమాధానం కూడా చెప్పగలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది’ అని సంబరపడ్డారు విమోన్‌చాట్‌ జిట్టాలమ్‌ అనే ఇంగ్లీషు టీచరు. పిల్లలంతా క్షేమంగా తిరిగి రావాలంటూ ఒక బొమ్మను వేసి, పాఠశాల ముందు భాగంలో అతికించారు. 

ఈ పదహారు రోజులూ..!
గుహలో చిక్కుకుపోయిన విద్యార్థుల కుటుంబాలన్నీ ఒకరితో ఒకరు ప్రతిరోజూ బాధను పంచుకునేవారు. వారు వింటున్న వార్తలను ఒకరికి ఒకరు చెప్పుకునేవారు. భగవంతుడికి పండ్లు సమర్పిస్తూ,  పిల్లలు క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థించేవారు. ఇన్నిరోజుల పాటు పిల్లలు అన్నపానీయాలు లేకుండా ఎలా ఉన్నారో అనే ఆలోచన రాగానే వారి కళ్లు కన్నీళ్లతో నిండిపోయేవి. పాఠశాలలో ఉదయం అసెంబ్లీ సమయంలో ‘మన విద్యార్థులు క్షేమంగా వస్తారు. వారికి ఒక ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నారు. వారు చక్కగా ఈదుకుంటూ మన దగ్గరకు వచ్చేస్తారు’ అని అసిస్టెంట్‌ ప్రిన్సిపాల్‌ అందరికీ ధైర్యం చెప్పేవారు.ఈ ధైర్యాలు, ప్రార్థనలు, మానవ ప్రయత్నాలు. గుహలో చిక్కుబడి పోయిన పిల్లల ఆత్మస్థయిర్యం, వారిలో గట్టి శక్తిని నూరిపోసిన కోచ్‌ విల్‌పవర్‌ అన్నీ కలసి ప్రపంచానికి ఒక విషాదాన్ని తప్పించాయి.
- రోహిణి 
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top