యువతే కీలకం

యువతే కీలకం - Sakshi


జిల్లాలో భారీగా పెరిగిన యువ ఓటర్లు

 

 ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వచ్చే సార్వత్రిక ఎన్నికలలో యువ ఓటర్లే కీలకం కానున్నారు. కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల కమిషన్ పలుమార్లు గడువు ఇవ్వడం.. తాజాగా ఈనెల 9 వరకు కూడా దరఖాస్తుకు అవకాశం ఇవ్వడంతో 18 సంవత్సరాలు నిండిన వారు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అభ్యర్థుల గెలుపోటములను శాసించే స్థాయికి యువత చేరుకుంది.



 నూతన జాబితా ప్రకారం జిల్లాలో ఓటర్ల సంఖ్య 20,17,292 మందికి చేరుకుంది. గతంలో  19,71,797 మంది ఓటర్లు ఉండగా, ఓటరు నమోదుకు ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 9 వరకు ఎన్నికల కమిషన్ గడువు పొడిగించడంతో కొత్తగా 45,497 మంది పేర్లు నమోదు చేసుకున్నారు.



 ప్రస్తుతం జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 20,17,292 కాగా, వీరిలో పురుషులు 9,97,517, మహిళలు 10,19,650, ఇతరులు 125 మంది ఉన్నారు. నూతనంగా ఓటు నమోదు చేసుకున్న వారిలో 22,085 మంది పురుషులు, 23,396 మహిళలు ఉన్నారు.



ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో అత్యధికంగా ఖమ్మం నియోజకవర్గంలో 9,377 మంది నమోదు చేసుకోగా, ఆ తర్వాత కొత్తగూడెంలో 7,263 మంది ఉన్నారు. జిల్లాలోని మొత్తం ఓటర్లలో 11 లక్షలకు పైగా యువతే ఉండటం గమన్హారం.



 యువతకు నేతల గాలం...

 ఈ ఎన్నికల్లో యువత ఓట్లే కీలకంగా మారడంతో పలువురు నాయకులు వారికి గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని.. ఇలా పలు రకాల హామీలతో మేనిఫెస్టో తయారు చేస్తున్నారు. కొత్తగా ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు.



 పోలింగ్ కేంద్రాలు ఇలా....

 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను పెంచారు. గతంలో 2,259 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కేంద్రాలను మరో 32 పెంచారు.



దీంతో ప్రస్తుతం జిల్లాలో పోలింగ్ కేంద్రాల సంఖ్య 2,291కి పెరిగింది. ఓటు వేసేందుకు వచ్చే వికలాంగులు, వృద్ధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ర్యాంప్‌లు, మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు, మంచినీటి సౌకర్యం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top