'పెద్ద'రికం దక్కేదెవరికి?
సుదీర్ఘ చరిత్ర కలిగిన పెద్దపల్లి నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్రంలో తొలి ఎంపీ ఎవరవుతారని అందరూ ఎదురుచూస్తున్నారు. గెలుపు..
	సుదీర్ఘ చరిత్ర కలిగిన పెద్దపల్లి నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్రంలో తొలి ఎంపీ ఎవరవుతారని అందరూ ఎదురుచూస్తున్నారు. గెలుపు... ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌దా..? ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీఆర్‌ఎస్‌దా..? అన్న ఆసక్తి వ్యక్తమవుతోంది.   ప్రముఖ పారిశ్రామిక వేత్త, సిట్టింగ్ ఎంపీ డాక్టర్ వివేకానంద కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మంచిర్యాలకు చెందిన  ప్రముఖ
	డాక్టర్ జానపాటి శరత్‌బాబును టీడీపీ బరిలో దింపింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్ టీఆర్‌ఎన్ తరఫున ఢీ కొడుతున్నారు.
	
	ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ డాక్టర్ వివేకానంద కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వెంకటస్వామి తనయుడు. వెంకటస్వామి ఇక్కడ నుంచి చాలాకాలం లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఏడుసార్లు పోటీచేసిన ఆయన నాలుగుసార్లు గెలిచారు. ఆయన వారసుడిగా వివేకానంద 2009లో కాంగ్రెస్ తరఫున  పోటీ చేసి  టీఆర్‌ఎస్ అభ్యర్ధి గోమాస శ్రీనివాస్‌పై విజయం సాధించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో  కీలక పాత్ర పోషించారు. తెలంగాణ అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్‌ను వీడీ టీఆర్‌ఎస్‌లో చేరారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన నేపథ్యంలో  ఆయన ఇటీవలే  మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు.
	టీఆర్‌ఎస్ తరఫున
	విద్యార్థి నేత..
	తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఓయూ జేఏసీ నేత బాల్క సుమన్‌ను టీఆర్‌ఎస్ ఇక్కడ నుంచి బరిలో దింపింది. యువ నాయకుడు కావడం, నియోజకవర్గంలో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ధర్మపురి, చెన్నూరు, మంచిర్యాల స్ధానాల్లో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ వల్లే  తెలంగాణ వచ్చిందన్న భావన జనంలో బాగా ఉండడం అనుకూలించే అవకాశం ఉంది.
	
	టీడీపీపై వ్యతిరేకత..!
	
	విద్యావంతుడు, సింగరేణిలో పని చేసిన డాక్టర్ శరత్‌బాబును టీడీపీ  బరిలో దింపింది. రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఆయన కార్మికులకు సేవలందించారు.  పలు సామాజిక సేవా  కార్యక్రమాలు కూడా చేపట్టారు.  తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు విషయంలో టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు వ్యవహరించిన తీరు ప్రతికూల ప్రభావం చూపనుంది. నియోజకవర్గ పరిధిలోని ఒక్క సెగ్మెంట్‌లో కూడా టీడీపీ ఎమ్మెల్యే లేడు. బాబు రెండు కళ్ల సిద్ధాంతంతో ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరారు. దీంతో పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రస్తుత పరిస్థితుల్లో.. క్షేత్రస్ధాయిలో బీజేపీ శ్రేణుల సహకారమే టీడీపీ అభ్యర్ధికి దిక్కయింది.
	
	సింగరేణి సవాళ్లు..!
	    
	సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం.  డిపెండెంట్లకు ఉద్యోగాలివ్వాలనే డిమాండ్ ఉంది.పర్యావ రణాన్ని కాపాడే విధంగా.. ఓపెన్‌కాస్టులను నియంత్రించాలని నిర్వాసితులు ఆందోళనలు చేస్తున్నారు.సింగరేణి ఉద్యోగులకు ఆదాయ పన్ను రద్దుకు సంబంధించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే విధంగా ఒత్తిడి తేవాలన్న డిమాండ్ ఏళ్ల నుంచి ఉంది.
	
	లోక్‌సభ నియోజకవర్గం: పెద్దపల్లి
	
	ఎవరెన్నిసార్లు గెలిచారు    : కాంగ్రెస్    -9   టీడీపీ    -4 టీపీఎస్    -1    
	తొలి ఎంపీ    : ఎం.ఆర్. కృష్ణ (కాంగ్రెస్)
	ప్రస్తుత ఎంపీ    : డాక్టర్ వివేకానంద (కాంగ్రెస్)
	ప్రస్తుత రిజర్వేషన్    : ఎస్సీ
	నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాలు:
	పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం, మంథని, చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి.
	
	మొత్తంఓటర్లు  
	14,17,460
	
	పురుషులు 7,21,522
	మహిళలు 6,95,880
	ఇతరులు                   58
	
	ప్రస్తుతం బరిలో నిలిచింది: 17
	
	ప్రత్యేకతలు: నియోజకవర్గంలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో సింగరేణి విస్తరించి ఉంది. సింగరేణి
	కార్మికుల ఓట్లే కీలకం. ఎస్సీ ఓట్లు కూడా కీలకం.
	ప్రధాన అభ్యర్థులు వీరే: డాక్టర్ వివేకానంద (కాంగ్రెస్)
	బాల్క సుమన్ (టీఆర్‌ఎస్)
	జానపాటి శరత్‌బాబు (టీడీపీ)
	
	
	
	డాక్టర్ జి. వివేకానంద (కాంగ్రెస్)
	
	 అనుకూలం..
	1.కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు
	2. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్వచ్చంద సేవా కార్యక్రమాలు. హా సిట్టింగ్ ఎంపీ కావడం ప్రతికూలం...
	3. కాంగ్రెస్‌నుంచి టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్  నుంచి కాంగ్రెస్‌లో చేరడం.
	4. స్ధానికంగా అందుబాటులో ఉండకపోవడం.
	5.రామగుండం ఎఫ్‌సీఐ ఎరువుల కార్మాగార పనులు వేగవంతం చేస్తా.
	6. సింగరేణిలో భూగర్భ గనులు ఏర్పాటు చేసి ఉద్యోగావకాశాల కల్పనకు కృషి చేస్తా.
	7. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను పరిమితి పెంపుకు ప్రయత్నిస్తా.
	8. స్ధానిక యువకులకే.. ఓపెన్‌కాస్టుల్లో కాంట్రాక్టు  ఉద్యోగాలందేలా కృషి చేస్తా.
	9. రైతులకు సాగునీరందించే  ఏర్పాట్లు చేస్తా.
	
	డాక్టర్ శరత్‌బాబు (టీడీపీ)
	
	అనుకూలం..
	1. సింగరేణి పరిధిలోని రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రిలో డాక్టర్‌గా సేవలందించడంతో  కార్మికులతో విస్తృత పరిచయాలున్నాయి.
	2. బీజేపీతో పొత్తు
	3. సింగరేణి కార్మికులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్విస్తున్నారు. ప్రతికూలం...
	4. రాజకీయాల్లోకి కొత్తగా రావడం. అన్ని వర్గాలను ఆకట్టుకోలేకపోవడం
	5. రామగుండాన్ని ఇండస్ట్రియల్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తా.
	6. మూతబడ్డ ఎరువుల కార్మాగారాన్ని తెరిపిస్తా.
	7. రామగుండం రైల్వేస్టేషన్ సమీపంలో ఫై్లఓవర్ నిర్మాణానికి కృషి.
	8. మంథనికి సాగునీరందిస్తా.
	9. నియోజకవర్గానికి ఎల్లంపల్లి ద్వారా తాగు,సాగునీరందిస్తా.
	10. ధర్మపురి దేవాలయ అభివృద్ధి, వేద పాఠశాల ఏర్పాటు.
	11. మంచిర్యాల, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో తాగునీటి ఎద్దడిని తీర్చుతా.
	
	బాల్క సుమన్ (టీఆర్‌ఎస్)
	
	అనుకూలం..
	1. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి జైలుకు వెళ్లడం.
	2. ఓయూ జేఏసీ నేత కావడంతో విద్యార్ధులు, తెలంగాణవాదులను ఆకర్శించడం.
	3.అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్వీ శాఖలు.. పార్టీ ప్రభావం. ప్రతికూలం...
	4. జిల్లా వాస్తవ్యుడే అయినా, తొలిసారి పోటీచేయడం.
	5. రామగుండంలో ఎఫ్‌సీఐ ఎరువుల కార్మాగార పునరుద్ధరణ, మూతబడ్డ పరిశ్రమలు తెరిపించేందుకు కృషిచేస్తా.
	7. నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రైతులకు సాగు  నీరందించేలా చర్యలు తీసుకుంటా. మున్సిపాలిటీ  ప్రజలకు తాగునీరందిస్తా.
	8. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా పోరాడుతా.
	9. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
